అనగనగా కొమరబండ అనే ఊరిలో కొమరయ్య అనే రైతు ఉండేవాడు. తన పిల్లలు ముంజకాయలు కావాలని మారాం చేయడంతో పక్కనే ఉన్న అంగడికి బయలుదేరాడు. అంగడికి వెళ్లిన కొమరయ్య.. ముంజలు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లి ”ఏమయ్యా.. ముంజలు ఎంతకు ఇస్తావు?” అని అడిగాడు. ”ముప్పై రూపాయలకు అరడజను ఇస్తాను” అని సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి.
”వామ్మో.. అంత రేటా! ముప్పై రూపాయలకు డజను ఇవ్వచ్చు కదా?” అని అడిగాడు కొమరయ్య. ”మీకు ముప్పై రూపాయలకు డజను కావాలంటే ఇంకా ముందుకు వెళ్లండి దొరుకుతాయి” అని చెప్పాడు ముంజలు అమ్మే వ్యక్తి.
కొమరయ్య ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ… నడుచుకుంటూ.. వెళ్లగా ముంజలు కనిపించాయి. ఆశగా అతని వద్దకు వెళ్లి ”ఏమయ్యా.. ముంజలు ఎలా ఇస్తావు!” అని అడిగాడు కొమరయ్య.
”ముప్పై రూపాయలకు తొమ్మిది ముంజలు ఇస్తాను” అన్నాడు ముంజలమ్మే వ్యక్తి.
”ఇంకో మూడు ముంజలు కలుపుకొని డజను ఇవ్వొచ్చు కదా?” అని అతనితో అన్నాడు.
”లేదండీ.. తొమ్మిది కంటే ఎక్కువ ఇవ్వడం కుదరదు” అని చెప్పాడు.
”కనీసం పది ముంజలు ఐనా ఇవ్వు” అన్నాడు.
”నాకు బేరం గిట్టదు. కానీ మీకు ఒక మంచి ఉపాయం చెప్తాను. ఇంకాస్త ముందుకు వెళ్లండి. అక్కడ తాటి చెట్లు ఉన్నాయి. ఎన్ని ముంజలు కావాలంటే అన్ని ముంజలు కోసుకొని ఇంటికి వెళ్లొచ్చు” అని ఉచిత సలహా ఇచ్చాడు.
వెంటనే కొమరయ్య ”ఇదేదో బాగుందే!” అని మనసులోనే అనుకున్నాడు. ముంజలు కోయాలంటే కత్తి కావాలి కదా?అని అనుకొని వెంటనే ”నా దగ్గర కత్తి లేదు. కొంచెం కత్తి ఇస్తావా? ఆ ముంజల్లో నీకూ కొన్ని ముంజలు ఇచ్చి వెళ్తాను” అని అతని దగ్గర కత్తి తీసుకున్నాడు.
అలా చాలా దూరం నడిచి వెళ్లాక తాటి చెట్ల వరుస కనిపించింది. వెంటనే గోసి బోసి చెట్టును ఎక్కాడు. చాలా కష్టం మీద పైవరకు చేరుకున్నాడు. కొమరయ్య ముంజ గెలలను కోశాడు. కానీ దిగేటప్పుడు ఎలా దిగాలో అతనికి అర్థం కాలేదు. ఎంత ప్రయత్నం చేసినా చెట్టు నుంచి దిగడం సాధ్యం కాలేదు. చేతులు పట్టు తప్పేలా ఉన్నాయి. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. కింద పడిపోతానేమో అని ”నన్ను కాపాడండి… నన్ను రక్షించండి…” అని గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. సంతకు వెళ్లేవారు అతని కేకలు విని ఎలాగోలాగా కాపాడి చెట్టు పై నుంచి కిందకి దించారు.
అక్కడ ఉన్నవారంతా ”చెట్టు దిగడం రాని వాడివి, చెట్టు ఎందుకు ఎక్కావు?” అని ఆరా తీశారు. కొమరయ్య జరిగిన సంగతి చెప్పాడు.
”డబ్బులు మిగులుతాయని ఆశపడి ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. ఇంకాస్త ఉంటే ప్రాణాలు పోయేవి” అని అందరూ తిట్టిపోసారు.
”నా పిసినారి తనమే నా ప్రాణం మీదికి తెచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయగూడద”ని అనుకున్నాడు.
ముంజ గెలలను భుజాలపై వేసుకుని బయలుదేరాడు. ఒక గెలను కత్తి ఇచ్చిన వ్యక్తికి ఇచ్చి, ఇంకో గెలను ఇంటికి తీసుకెళ్లాడు కొమరయ్య. ఆ రోజు నుంచి ఎవరితో ఎక్కువగా బేరసారాలు ఆడలేదు. చెప్పిన ధరకే అవసరమైన వస్తువులను కొనసాగాడు.
బుద్ధారపు ప్రవళిక, 7వ తరగతి,
జెడ్పీహెచ్ఎస్ కోదాడ, తెలంగాణ