బంగారంతో సమానంగా తులతూగే కుంకుమపువ్వు… చలచల్లని హిమపాతాలున్న ప్రాంతాల్లోనే విరబూసే కుంకుమ పువ్వును.. నిప్పులు కురిసే హైదరాబాద్‌లాంటి నగరంలోనూ ఎంతో సులభంగా సాగు చేయొచ్చంటూ నిరూపించాడు ఓ యువకుడు. శీతల వాతావరణంలో సాగయ్యే ఈ పంటను గుర్రంగూడకు చెందిన బీటెక్ స్టూడెంట్ లోహిత్‌రెడ్డి తీసుకువచ్చాడు. తనకు వ్యవసాయం చేయడంపై అమితమైన ఆసక్తి ఉండటంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం అదే ట్రెండ్‌గా మారింది. అనుకున్నంత స్థాయిలో ఉత్పత్తి జరిగితే హైదరాబాద్ నగరంలోనే కుంకుమ పువ్వును పండించే అవకాశం వస్తుంది. అదీ కొన్ని నెలల్లో మాత్రమే సాగవుతుంది.
ఆ యువకుడేమీ వ్యవసాయదారుడో.. వ్యవసాయ కుటుంబ నేపథ్యమో ఉన్నవాడేమీ కాదు. బీటెక్ సెంకడ్ ఇయర్ చదువుతున్న ఓ సాధారణ విద్యార్థి. అయితే.. తనకు వ్యవసాయం మీద ఉన్న ఆసక్తి.. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆతతే ఆ యువకుడి చేత ఈ అద్భుతాన్ని ఆవిష్కరించేలా చేసింది. బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గుర్రంగూడకు చెందిన సింగిరెడ్డి లోహిత్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వ్యవసాయం చేయాలన్న ఉత్సాహమే కాకుండా.. ఏదైనా సరికొత్తగా చేయాలని లోహిత్ రెడ్డి భావించాడు. ఈ క్రమంలోనే.. కుంకుమ పువ్వు సాగు గురించి ఆలోచించాడు. కేవలం కశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే కాకుండా.. ఈ మధ్య సాధారణ ప్రదేశాల్లోనూ సాగు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నాడు. గూగుల్, యూట్యూబ్‌లలో ఈ పంటకు సంబంధించిన వీడియోలు చూశాడు. అంతేకాదు.. సాగు చేసే ప్రాంతాలకు వెళ్లి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాడు. ఇంకేముంది.. సాగు మొదలుపెట్టేశాడు.
కుంకుమ పువ్వు సాగు కోసం..
270 చదరపు అడుగులున్న ఓ గదిని సిద్ధం చేశాడు. గాలిలో తేమ, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండేలా గదిని రెడీ చేశాడు. పగటి వేళ 17 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి 9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అక్టోబర్ మొదటివారంలో రూ.2 లక్షలతో కశ్మీర్ నుంచి 200 విత్తనాలు తెచ్చి సాగు మొదలుపెట్టాడు. ట్రేలలో కుంకుమ పువ్వు సాగు చేయటం ప్రారంభించాడు. అక్టోబర్‌లో వేస్తే.. డిసెంబరు నెలలో కుంకుమ పువ్వు ఉత్పత్తి వస్తోంది. ఒక్కో విత్తనానికి రెండు నుంచి మూడు పువ్వులు వస్తాయి. అయితే.. ఈ కుంకుమ పువ్వు మార్కెట్లో గ్రాముకు రూ.800 నుంచి 1000 పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న సాగుతో 150 గ్రాముల వరకు దిగుబడి వస్తుందని లోహిత్ రెడ్డి అంచనా వేస్తున్నాడు.
70 గ్రాముల తొలి దిగుబడి
బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గుర్రంగూడకు చెందిన లోహిత్‌రెడ్డి ఇబ్రహీంపట్నం గురునానక్ కళాశాలలో సీఎస్ఈ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. గూగుల్‌లో సాగు చూసి ఆకర్షితుడైనట్టుగా వివరించాడు. ఇప్పటి వరకు 70 గ్రాముల కుంకుమ పువ్వు వచ్చిందని పెంపకం చాలా సులభంగానే ఉందని తెలిపాడు. కాగా.. ఇప్పటివరకు 70 గ్రాముల కుంకుమ పువ్వు వచ్చిందని తెలిపాడు. పెంపకం కూడా చాలా సులభంగానే ఉందని తెలిపాడు. ఒక్కసారి ఈ పంట సాగుకు పెట్టుబడి పెడితే ఆ తర్వాత ఎలాంటి ఖర్చు చేయకుండానే పూల ఉత్పత్తి వస్తుందని లోహిత్ రెడ్డి చెప్తున్నాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణలో సిద్దిపేటలో కూడా కుంకుమ పువ్వును సాగు చేస్తుండటం గమనార్హం. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలోని డీఎక్స్ఎన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ వారు ఏరోఫోనిక్ విధానంలో జులైలో ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వు సాగును చేపట్టారు.
మెరిసే చర్మం కోసం
చర్మానికి నిగారింపు తీసుకురావడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎలాంటి క్రీంలు వాడుకుండానే సహజసిద్ధంగా మన చర్మం మెరిసేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు తగ్గించడంలోనూ ఇది దోహదపడుతుంది.
డిప్రెషన్ తగ్గించడానికి
ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఇందులో పైటోకెమికల్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మెదడుకు అవసరమైన సెరోటోనిన్‌ను అందించడంలో సహాయపడుతాయి. అందువల్ల టెన్షన్ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్తే పాలల్లో దీన్ని కలుపుకుని తాగితే వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ కూడా వెంటనే మారిపోతుంది.
బరువు తగ్గడానికి..
జీవక్రియను నియంత్రించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి అవ్వదు. కొద్దిగా తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు.
నిద్రలేమి
పడుకునే ముందు పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇందులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ప్రశాంతత చేకూర్చి త్వరగా నిద్రపోయేలా చేస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. మహిళలలో రుతుక్రమ సంబంధిత సమస్యలకు కుంకుమ పువ్వు చక్కగా పనిచేస్తుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల అధిక రక్తస్రావం వంటి సమస్య కూడా ఉండదు. మగవారిలో అంగస్తంభన, వీర్య కణాలు తక్కువ ఉన్నవారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తాయి. బాదం పాలల్లో కుంకుమ పువ్వును కలిపి తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
జ్ఞాపకశక్తికి
కుంకుమ పువ్వులో క్రోసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జ్వరాన్ని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. పాలల్లో కుంకుమపువ్వు వేసుకుని తాగడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
గుండెకు మంచిది
కుంకుమ పువ్వులో క్రోసిటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా హద్రోగాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
కీళ్ల నొప్పులకు కూడా..
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. ఆస్తమా, కోరింత దగ్గు ఇలా పలు సమస్యలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.
కల్తీ గుర్తించడమెలా
చిటికెడు కుంకుమ పువ్వును గోరువెచ్చని నీళ్లు లేదా గోరువెచ్చటి పాలల్లో వేయాలి. తక్షణమే రంగు మారితే అది అసలైనది కాదు. ఎందుకంటే అసలైన పువ్వు మిశ్రమం ఎరుపు నుంచి బంగారు రంగుకు రావడానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతుంది.
క్యాన్సర్ దూరం
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ పెరగకుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు కుంకమ పువ్వులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంకుమ పువ్వును రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417