గతేడాది 2023 సెప్టెంబర్లో ”యూనెస్కో” కర్ణాటక రాష్ట్రంలోని హలిబేడులో ఉన్న హోయశాలేశ్వరాలయం, బేలూరు చెన్నకేశవాలయం, సోమనాథపురంలోని కేశవస్వామి ఆలయాలను సంయుక్తంగా ”ప్రపంచ వారసత్వ ప్రదేశాలు” గా ప్రకటించిన సందర్భంగా నేను ఈ ఏడాది మే 30, 31, జూన్ 1న ఆయా ప్రాంతాలను సందర్శించి, ఆనాటి కళా నైపుణ్యానికి, శిల్పకళా సౌందర్యానికి ముగ్ధుడై మన పాఠకులతో కొన్ని అంశాలు, చరిత్రను పంచుకోవడానికి ఈ వ్యాసాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను.
ఈ ఆలయాలు నిర్మించి సుమారు 1000 ఏండ్లు పూర్తి కావస్తున్నా, అనేక మంది రాజులు దాడులు చేసినా, నేటికీ సజీవంగా హూందాగా నిలబడి, అలనాటి కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి అంటే మనం అందరం తప్పక చూడవలసినదే… సాధారణంగా ఈ రోజుల్లో టూరిజం అంటే ఎంజారుమెంట్ అనే దృక్పథంతో కొన్ని ప్రదేశాలకు వెళుతున్నారు తప్పా, దేశ వారసత్వ సంపదకు, కళా నైపుణ్యాలకు, రాతి శిల్పాల సౌందర్యానికి ప్రతీకలు వంటి ఆలయాలు, నిర్మాణాలు సందర్శించడానికి ఎక్కువ మంది వెళ్లకపోవడం బాధాకరం… ఏదిఏమైనా ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా, కొందరైనా దర్శిస్తారని భావిస్తూ… నా ప్రయాణ విషయాలు తెలియపరుస్తూ… బెంగళూరుకు 250 కి.మీ పరిధిలో ”హాసన్” జిల్లాలో ఉన్న బేలూరు, హాలిబేడు, సోమనాథ పుర, శ్రావణ బెణగల గూర్చి తెలుసుకుందాం… పాఠకులారా.. పర్యాటకులారా… ఆధ్యాత్మికంగానే కాకుండా ఆనాటి కళా నైపుణ్యానికి నిదర్శనంగా చూడాలని తెలుపుతూ….
బేలూరు
జైన, వైష్ణవ మతాలకు నిలయంగా కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో నెలకొన్న ‘బేలూరు’ సుమారు 300 ఏండ్ల పాటు కర్ణాటక, ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ”హోయశాలల” రాజధానిగా విరాజిల్లింది అంటే అతిశయోక్తి కాదు. దక్షిణ బెనారస్గా, వేలాపురిగా వర్ధిల్లింది. ముఖ్యంగా శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా ఇక్కడ ఆలయాలు నిర్మితమయ్యాయి. చిన్నకేశవ దేవాలయం చక్కటి ఉదాహరణ. హోయశాల రాజులు ముందు చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. చాళుక్యులు బలహీన పడటంతో హోయశాలలు తమ పరాక్రమంతో సుమారు 300 ఏండ్లు కర్ణాటక రాష్ట్రంలోని అత్యధిక భాగాన్ని పరిపాలించారు. ”సళ” ఆది పురుషుడుగా, తదుపరి వీరి వంశంలో ”విష్ణువర్ధనుడు” పేరుగాంచాడు. బేలూరులో విష్ణువర్ధనుడు విజయాలకు సూచికగా 1117లో చిన్న కేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూర్తి చేయడానికి సుమారు 103 ఏండ్లు పట్టింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడుగా ”విజయ నారాయణ”ను ప్రతిష్టించారు. ఇక దేవాలయం అడుగు భాగంలో ఏనుగులు, తదుపరి వరుసలో సింహాలు, ఆ తదుపరి వరుసలో రామాయణం మహాభారతంలోని కొన్ని ఘట్టాలు, స్త్రీల భంగిమలు, ఇలా పలు అద్భుతమైన శిల్పాలు చెక్కి, అపురూపంగా తీర్చిదిద్దారు. దాడుల్లో, కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న సమయంలో తదుపరి ఆ ప్రాంతాన్ని పాలించిన విజయనగర సామ్రాజ్య రాజులు, తదుపరి మైసూర్ పాలకులు పెద్ద కృష్ణరాజ వడయార్, నాల్మాడి కృష్ణరాజ వడయార్ ఈ దేవాలయానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. విష్ణువర్ధనుడు కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలకు అమర శిల్పి జక్కన్న (జకణాచారి) దాసోజి, జావణ, చిక్క హింస మొదలైన శిల్పులు పాత్ర కీలకం. హోయశాలలు కాలంలో సుమారు 100కు పైబడి దేవాలయాల నిర్మాణం చేపట్టారు. వీరు కట్టిన నిర్మాణాల్లో వీరి చిహ్నంగా ”సళ సింహాన్ని చంపుతున్న దృశ్యం” కనపడుతుంది. బంగారంతో వర్ధిల్లే ఈ ప్రాంతంలో విదేశీయులు దాడి చేసి, భారీ ఎత్తున బంగారాన్ని దోచేశారు అని ‘అబ్ధుల్ రజాక్’ అనే విదేశీ యాత్రికుడి రచనల ద్వారా తెలుస్తోంది. హాళిబేడులో పారశ్వనాధ బసతి, శ్రావణ బెణగలలో జీననాధ బసతి, సిద్ధేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందాయి.
సోమనాథ పుర
హోయశాలలు నిర్మించిన మరో అద్భుతమైన దేవాలయం ”కేశవస్వామి ఆలయం” బెంగళూరుకు సమీపంలో సోమనాథపురలో ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ శిల్పకళా సౌందర్యానికి ముగ్ధులై పోవలిసిందే. 1268లో సోమనాథ దండనాయక నిర్మించినాడు. కేశవ, జనార్ధన్, వేణుగోపాల స్వామి వారి విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దేవాలయంపై చెక్కిన వివిధ ఆధ్యాత్మిక విషయాలు, శిల్పాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
శ్రావణ బెణగల.. జైన మత పవిత్ర స్థలం..
క్రీ.శ. 981లో చాముడ రాయుడుచే 58 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పు బాహుబలి/ గోమటేశ్వరమూర్తి విగ్రహం నిర్మించినారు. 142 మీటర్లు ఎత్తులో కొండ మీద ఉంటుంది. రెండు గుట్టల మధ్య శ్రావణ బెణగల ఉంటుంది. శ్రావణ అనగా జైన ముని అని అర్ధం. బెళకళ అనగా శ్వేత సరస్సు అని అర్థం. జైన మతస్తులకు పవిత్ర స్థలంగా శ్రావణ బెణగల వర్ధిల్లుతుంది. దేశ వ్యాప్తంగా జైనులు ప్రతీ 12 ఏండ్లకు ఇక్కడ జరిగే ఉత్సవాలకు వస్తారు. చాలా అద్భుతమైన ”నగముని” నిర్మాణం చూపరులను ఆకట్టు కుంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది.
ముఖ్యంగా మనలో చాలామంది పర్యాటకానికి బెంగళూరు, మైసూర్ వెళతారు. కానీ చారిత్రాత్మక ప్రదేశాలు అయిన, అపురూప కళానైపుణ్యం, శిల్పాలతో చెక్కిన దేవాలయాలు దర్శించడానికి ఆసక్తి చూపక పోవడం బాధాకరం. ఒక చారిత్రక సంఘటనలు, అప్పటి కళాకారుల నైపుణ్యాలు, శిల్పాలు దర్శించి అప్పటి కళాకారుల పని తీరు అభినందించుకుంటూ, నాటి నైపుణ్యాలు నెమరువేసుకుంటూ భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తెలుసుకోవాలి. ఆనాటి రాజుల ఆసక్తి గమనించాలి. నాటి కళా వైభవాన్ని కళ్లకు కట్టే విధంగా ఈనాటికీ ఉండటం అందరూ అభినందించాల్సిందే.! ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపదగాగా యునెస్కో ప్రకటించడం వల్ల ఇప్పటికే విదేశాల నుంచి పర్యాట కులు వస్తున్నారు. మనలో కూడా ఆసక్తి ఉన్నవారు ముఖ్యంగా గత హోయసల సొగసైన కళాఖండాలు చూడటానికి బెంగళూరు వెళుతున్న పర్యాటకులారా… ఇకనైనా తప్ప కుండా బేలూరు, హాళిబేడు, సోమనాథ పుర, శ్రావణ బెణగల ప్రాంతాలు దర్శించి, తన్మయత్వం పొందాలని ఆశిస్తూ… మూడు రోజుల్లో ఈ ప్రాంతాలు చూడవచ్చు అని తెలియజేస్తూ…
హాళీబేడు
బేలూరు అనంతరం హోయశాలలు హాళీబేడు రాజధానిగా చేసుకుని 12-13 శతాబ్ధాల కాలంలో పాలించారు. హాలీబేడునే ‘ద్వార సముద్రం’ అని పిలిచేవారు. మాలిక్ కాఫిర్ 1311లో ఈ పట్టణంపై దాడి చేసి సంపద దోచుకుపోగా, 1326లో మహమ్మద్ బీన్ తుగ్లక్ తిరిగి ఈ పట్టణంపై దాడి చేసి దేవాలయాన్ని పాడుచేసి, మొత్తం సంపద దోచుకున్నాడు అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ నిర్మించిన హోయసాలేశ్వరాలయం హోయశాల రాజుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో రెండు గర్భగుడుల్లో రెండు శివలింగాలు ప్రతిష్ట చేయగా, వీటికి ఎదురుగా రెండు నందులు నిర్మించారు. దేవాలయం చుట్టూ రకరకాల విగ్రహాలు, రామాయణం మహాభారతంలోని పాత్రలు చెక్కినారు. చూపులు తిప్పుకోలేనంత అందంగా, ఆకర్షణీయంగా శిల్పాలు చెక్కి అపురూపంగా ఉన్నాయి. హిందూ వాస్తు శిల్పి ”ఫర్గూసన్” ఈ దేవాలయం హిందూ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక అని తెలిపారు. ఈ హోయశాలలు బలహీనపడిన తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.
ఐ.ప్రసాదరావు
6305682733