– మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పాలనే చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. శనివారం ఆయన బీఆర్ఎస్ఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుభరోసా ఎప్పుడిస్తారో చెప్పలేదన్నారు. రుణమాఫీ విషయంలో స్పష్టత లేదనీ, అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలో తాము ఏ కంపెనీకి ఒక్క ఎకరం కేటాయించకుండానే, సీఎం తక్కువ ధరకు కంపెనీలకు కేటాయించినట్టు అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారన్నారు. ఎస్సెల్బీసీని తాము 11 కిలోమీటర్లు తవ్వితే ఒక్క కిలోమీటర్ తవ్వలేదని అబద్ధం చెప్పారన్నారు. రూ.నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి మూసీ ట్రీటమెంట్ ప్లాంట్లు కట్టామన్నారు. మూసీ కాలుష్యం 50 ఏండ్ల కాంగ్రెస్, 16 ఏండ్ల తెలుగుదేశం పాలన ఫలితమేనని విమర్శించారు. లగచర్లకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తప్పులకు వివరణ ఇద్దామనుకుంటే తమకు స్పీకర్ మాట్లాడే అవకాశమివ్వలేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంటు బీఆర్ఎస్ తెచ్చినవే అని తెలిపారు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీరు అందిస్తున్నదని చెప్పారు. దానిపై సీఎం 50 వేల ఎకరాలే సాగవుతున్నదని చెప్పారన్నారు. కాళేశ్వరమే లేకపోతే, మల్లన్నసాగర్ లేదు, సీఎం హైదరాబాదుకు తెస్తమన్న 20 టీఎంసీల నీళ్లు లేవని ఎద్దేవా చేశారు.
రూ. 7500 కోట్లు వానాకాలం రైతుబంధు, రూ. 2500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటు, రూ. 2000 కోట్లు ముసలోళ్ల ఫించన్లు, రూ. 1000 కోట్ల బతుకమ్మ చీరెలు సీఎం ఎగ్గొట్టారని తెలిపారు. కేసీఆర్ కిట్స్ పథకాన్ని నాశనం చేశారన్నారు. పాక్షిక రుణమాఫీ మాత్రమే చేశారని తెలిపారు. రైతులపై వడ్డీ భారం పడిందని చెప్పారు. చర్చకు సీఎం లేదా మంత్రులు వస్తారా? అని సవాల్ చేశారు.
బీఆర్ఎస్ హయంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే రెండు వేల ఉద్యోగాలిస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటారా? మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. కార్ రేస్ మీద చర్చ పెట్టమంటే ఎందుకు పారిపోయారో చెప్పాలన్నారు. ఏడాది పాలనలో 54 మంది విద్యార్థులు మరణించారన్నారు., 89 మంది ఆటో డ్రైవర్లు, 29 మంది నేతన్నలు, 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 1000 రేప్ కేసులు నమోదు, 390 ప్రొటెస్టులు జరిగాయన్నారు. రేవంత్ పాలనంతా అవినీతిమయమేననీ, బిల్లులు కావాలంటే 8 శాతం ఇవ్వాల్సిందేనంట అని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు నిరంకుశత్వంతో ప్రారంభమైన ప్రజా సమస్యలు లేవనెత్తామన్నారు. లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యకాండను ప్రశ్నించామని తెలిపారు. నల్లచొక్కాలు, ఖాకీ షర్టులు వేసుకుని నిరసన తెలిపామని గుర్తుచేశారు. రైతుభరోసాపై తప్పుడు లెక్కలను కేటీఆర్ తిప్పికొట్టారని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు.