దీప సందేశం

పంచే వెలుగును ఆసరాగా
లోకాన్ని చూడమంటుందే తప్ప
ఏ దీపమూ తననే చూస్తూ కూర్చోమనదు

మనం వెలిగించే దీపమే అయితే..
ఆరిపోకుండా ఇంత తైలం
ఆర్పకుండా గాలికి అడ్డూ
కాలిపోకుండా ఇన్ని వత్తులూ
అందించమంటుందంతే!

సూర్యుని వెలుగులో
ప్రకతి అందాలను
ఆ అందాల వెనుక ఉన్న
ప్రాకతిక నియమాలను
జీవిత పాఠాలను నేర్పే
కదులుతున్న కాలచక్రాన్ని
అవలోకించి అవగాహన చేసుకోవడం
ఓనమాల బడికే వదిలేశాం.

దీపాల చుట్టూ తిరిగే పురుగుల్లా
విశ్వాసాల చుట్టూ
కళ్లుమూసుకుని
ప్రదక్షిణలు చేస్తుంటామంతే

అవి చూపే
వెలుతురు దారుల్లో
అడుగే వేయం

వాళ్లకు
మనం శలభాలమై దీపజ్వాలలకు
రెక్కలు కాలుతూ..
ప్రాణాలు పోతున్నా
వాళ్లు చూపే కత్రిమ ప్రగతి
దీపాల చుట్టూ
ఎగరటమే కావాలి

రంగురంగుల కాంతుల
జలధారలు చూస్తూ
మురిసి మైమరచి పోయి
విద్యుల్లతా కాంతిచ్ఛటలకు
కళ్లుబైర్లు కమ్మి
మత్తులమూ ఉన్మత్తులమై పోవాలి

వాళ్లంతే..
మనల్ని మాయాకాంతిపుంజాల
తాళ్లతో కట్టేసి
తమ చీకటి రాజకీయాలకు
తెరలు తీస్తారు

మననెప్పటికీ
తూరుపు తిరిగి దండంపెట్టమంటూ..
పడమటి సుఖాలకై
పరుగులు పెడతారు.
– మడిపల్లి రాజ్‌కుమార్‌
99496 99215