స్వంతపాట మాని వంతపాట

Mani Vantapata of own song”పీల్చే ముందు ఒకసారి గాలిని కూడా తనిఖీ చెయ్… లేదా ఈ గాలిలో ఎన్ని రాజకీయాలో, ఎన్ని అరాచకీయాలో…” అంటాడు అలిశెట్టి ప్రభాకర్‌. కానీ, దీనికి స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థయిన ఎన్నికల సంఘం కూడా మినహాయింపు కాదా? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లనూ తొలుస్తున్న సమస్య! తన నైతిక ప్రవర్తనా నియమావళికి ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న సవరణలే ఈ సందేహానికి కారణం. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం(ఈసీ) మార్పులు చేయడానికి పూనుకుంది. దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తుంటే, వాటిని తుంగలోకి తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం గోప్యతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత రహస్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా రాజకీయ పార్టీల హక్కులను హరించడమే అవుతుంది.
దేశంలో ప్రజాస్వామిక విలువలను వమ్ము చేయడమే గాక రాజ్యాంగ వ్యవస్థల స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తూ నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బాహాటంగా బరితెగించి వ్యవహరించినవి కొన్నయితే, అచ్చంగా చట్టబద్ధంగా చట్టం కోసమే చేస్తున్నట్టు నటిస్తూ చాపకింద నీరులా తమ పని చక్కబెట్టుకునేవి మరికొన్ని. ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు (సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్‌లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు తీసుకోస్తోంది. అధికారపక్షం కుట్రలు బయటకు రాకుండా చేసేందుకు ఈ నిషేధం విధించింది. ఇవన్నీ చూస్తుంటే ఈసీ తన స్వతంత్రతను కోల్పోతోందని స్పష్టమవుతోంది.
ఎలాంటి ప్రలోభాలకూ, అనైతిక ప్రభావాలకూ, అక్రమాలకూ అవకాశమివ్వకుండా… అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిం చడం ఎన్నికల సంఘం బాధ్యత. కానీ అవాంఛ నీయమైన రాజకీయ జోక్యాలతో ఎన్నికల సంఘం డూడూ బసవన్నలా తలాడించే వారితో నిండిపోతోంది. చివరికి ఎన్నికల్లో ఆ స్వేచ్ఛా, పారదర్శకతలే కొడిగట్టిన దీపాలవుతున్నాయి. మూడో దఫా మోడీ పాలనలో అది మరింత తీవ్రమై ఎన్నికల సంఘమంటే ఏలినవారి వ్యూహాలకు గుడ్డిగా తలాడించే కీలుబొమ్మగా మారింది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, భారత సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టే వివాదాస్పద ‘జమిలి ఎన్నికల’ అంశం ఇప్పటికే జేపీసీ ముందు ఉంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఈ సవరణకు ఉరుకులాడటం ఆశ్చర్యానికే కాదు, పలు అనుమానాలకూ, ఆందోళనలకూ గురిచేస్తోంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తినే సందేహాస్పదంగావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్న అంశాలే అనేకం అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాలను ఈసీ నియంత్రించలేక పోతోంది. ఎన్నికల్లో కుల మత విభజనలనూ, విద్వేషాలనూ అడ్డుకట్టు వేయలేక పోతోంది. నేర స్వభావం గల నేతలను పోటి నుంచి నివారించలేకపోతోంది. తన నియంత్రణలోని అతిక్రమణలనే అడ్డుకోలేని ఎన్నికల సంఘం, తాజా నింబంధనలకు ప్రయత్నించడం అవాంఛనీయం, రాజ్యాంగ విరుద్ధం. వాటన్నిటినీ వదిలేసి ఏలినవారి ఆలోచనలకు ఊడిగం చేయడానికి వ్యవస్థలు దిగజారితే అంతకన్నా విషాదమేముంటుంది?
కేంద్ర సర్కార్‌ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. భారతదేశ ఎన్నికల కమిషన్‌కు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాని పనితీరును ప్రపంచదేశాలు అనేక సందర్భాల్లో శ్లాఘించాయి. ఇంతటి గొప్ప నేపథ్యం ఉన్న ఎన్నికల కమిషన్‌ను మోడీ ప్రభుత్వం తమ కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈసీ విధుల్లో మోడీ ప్రభుత్వం జోక్యం మానుకోవాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతుందనడంలో సందేహమే లేదు.
కేంద్రం వ్యవస్థలను లోబరుచుకుని దొడ్డిదారిన తన ప్రయోజనాలను సాధిస్తానంటే అది ఎలా సమంజస మవుతుంది? దీనికి వంతపాడితే వ్యవస్థల స్వతంత్రతకు విలువేముంటుంది? ఇప్పటికే కొన్ని అంశాల వలన ఈసీ తన ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. కాబట్టి, వీలైతే సమాజంలో చైతన్యానికి పాటుపడాలే తప్ప, గంగిరెద్దులా తలూపడం, ఏలికలకు వంతపాడటం వ్యవస్థలకు తగని పని.