– కొత్త బంతితో ఐదు రోజులూ పేస్
– మెల్‌బోర్న్ పిచ్‌పై క్యూరేటర్ వ్యాఖ్యలు
నవతెలంగాణ-మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. మూడు టెస్టుల అనంతరం భారత్, ఆస్ట్రేలియా 1-1తో సమవుజ్జీలుగా కొనసాగుతున్నాయి. కీలక బాక్సింగ్ డే టెస్టులో పైచేయి సాధించి సిరీస్ సాధించాలనే తపనతో ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా కనిపిస్తున్నాయి. భారత క్రికెటర్లు శనివారం నుంచే ప్రాక్టీస్ మొదలెట్టగా.. పిచ్‌లు మరీ నాసిరకంగా మారాయి. మరోవైపు కంగారూ క్రికెటర్లు పచ్చికతో కూడిన కొత్త పిచ్‌లపై సోమవారం నుంచి సాధన షురూ చేశారు. భారత్‌కు పాత ప్రాక్టీస్ పిచ్‌లు ఇవ్వటంపై దుమారం రేగటంతో క్యూరేటర్ మాట్ పేజ్ స్పందించాడు. సహజంగా మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రాక్టీస్ పిచ్‌లు సిద్ధం చేస్తామని, భారత్ ముందుగానే రావటంతో కొత్త పిచ్‌ల రూపకల్పన సాధ్యపడలేదని తెలిపారు.
పేస్‌కు అనుకూలం : మెల్‌బోర్న్ పిచ్ పేసర్లకు గొప్పగా అనుకూలిస్తుందని క్యూరేటర్ తెలిపారు. ‘గత కొన్నేండ్లుగా మెల్‌బోర్న్‌లో అందిస్తున్న పిచ్‌ల పట్ల సంతృప్తిగా ఉన్నాం. గతంలో మెల్‌బోర్న్ పిచ్ ఫ్లాట్‌గా ఉండేది. కానీ టెస్టులను మరింత ఉత్తేజంగా నిలిపేందుకు పిచ్‌పై మరింత పచ్చిక ఉంచాలని, బౌలర్లకు అదనపు బలం చేకూర్చాలని అనుకున్నాం. అందుకే పిచ్‌పై పచ్చిక ఉంచాం. మ్యాచ్ రోజు ఉదయానికి 6మిమి పచ్చిక ఉండేలా చూస్తాం. కొత్త బంతితో పేసర్లు వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ రాబట్టవచ్చు. కానీ బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్‌కు సైతం పిచ్ అనుకూలించనుందని’ మాట్ అన్నాడు.
స్పిన్ ఉండదు! : ‘మెల్‌బోర్న్ పిచ్ స్పిన్‌కు అనుకూలించదు. ఇక్కడ స్పిన్నర్లకు టర్న్ లభించదు. గతంలో ఇక్కడ జరిగిన రెడ్‌బాల్ ఫార్మాట్ మ్యాచులు చూస్తే.. ఇక్కడ పేసర్లకే ఎక్కువగా పిచ్ సహకరించింది. పెర్త్, బ్రిస్బేన్ తరహాలో మెల్‌బోర్న్ మరీ వేగంగా ఉండకపోవచ్చు. కానీ గత కొన్నేండ్లుగా పిచ్‌పై నిలకడగా పేస్ లభించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ బంతి అందుకునేందుకు ఉత్సాహం చూపిస్తారు’ అని క్యూరేటర్ తెలిపాడు.
తనుశ్‌కు పిలుపు : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు బాక్సిండ్ డే రోజున మెల్‌బోర్న్‌లో ఆరంభం కానుండగా.. ముంబయి యువ స్పిన్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియన్ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్రిస్బేన్ టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో యువ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ తనుశ్‌కు సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. విజరు హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్న తనుశ్ మంగళవారం మెల్‌బోర్న్‌కు బయల్దేరనున్నాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన మహ్మద్ షమి.. బౌలింగ్ వర్క్‌లోడ్‌తో మోకాలులో వాపు వచ్చింది. దీంతో ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు షమిని పరిగణనలోకి తీసుకోలేదు. విజరు హజారే ట్రోఫీలో సైతం షమి ఆడేది అనుమానమే!.