మట్టి మనుషుల జీవిత గాథలతో వెండితెరకు కొత్త సొబగులు అద్దిన శ్యామ్ బెనెగల్ మరణంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక అధ్యాయం ముగిసింది. కమర్షియల్ హంగులతో ఆకాశపు హద్దులు దాటే బాలీవుడ్ చిత్రాలను నేలకు దించి సామాన్యుల చెంత నిలపడమే కాకుండా, వారి జీవితాలనే వెండి తెరకు నిలువెత్తు కాన్వాస్‌గా మలచిన ఘనత శ్యామ్ బెనెగల్ది! అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక, సుస్మన్, మండి ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడికి పట్టం కట్టిన ఆయన సినిమాలు ఎన్నో! శ్యామ్ పూర్తి పేరు బెనెగళ్ల శ్యామసుందర రావు. కర్నాటకకు చెందిన ఆయన తండ్రి బెనెగళ్ల శ్రీధర్ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలా తెలుగువాడైన శ్యామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. చిన్నతనం నుండి ఆయన సినిమాల మీద, సామాజిక సమస్యల మీద ఆసక్తి చూపేవారు. సినీరంగ ప్రవేశం తరువాత కూడా ఆయన సామాజిక సమస్యలనే తన కథా వస్తువులుగా మార్చుకున్నారు. జిలుగు వెలు గుల బాలీవుడ్ మాయాజాలానికి కొత్త గ్రామర్ నేర్పారు. మానవ సంబంధాల గాథలతో వెండితెరకు కొత్త గ్లామర్‌ను జోడించారు. అందుకే ఆయన సినిమాలు సామాజిక వివక్షలో కూరుకుపోయిన నిస్సహాయు లకు గొంతుగా మారాయి. వాటిలో తెలంగాణ ఆత్మ కనిపించింది. అవి గుజరాత్ రైతుల గౌరవ పోరాట వేదికలయ్యాయి. మహిళల, దళితులతోపాటు ఎందరో బాధా సర్పద్రష్టుల గాథలకు దృశ్యరూప మయ్యాయి. వెరసి అసలు, సిసలు భారతీయతను ఆవిష్కరించాయి.
ఫ్రెంచ్, ఇటాలియన్ నియో రియలిస్టిక్ సినిమాలతో స్ఫూర్తి పొందిన శ్యామ్ బెనెగల్ భారతీయ గ్రామీణ జీవితాన్ని తన సినిమా సఅజనకు ఆలంబన చేసుకున్నారు. అప్పటివరకు దఅశ్యరూపం ఇవ్వడానికి ఎవరూ సాహసించని ఫ్యూడల్ వ్యవస్థ వికృత రూపాన్ని, నిర్బంధ వెట్టి చాకిరీని, కులరక్కసి వికృత కోరలను తనదైన శైలిలో శ్యామ్ సినిమాలుగా తీయడం కలకలం రేపింది. ఒక్కసారిగా సామాజిక వాస్తవికతను చర్చనీయాం శం చేసింది. అంకుర్ (1974) చిత్రం ద్వారా షబానా అజ్మీని ఆయన వెండితెరకు పరిచయం చేశారు. తెలంగాణలోని ఫ్యూడల్ పరిస్థితులు, దోపడీపై తీసిన చిత్రమిది. సినిమా చిత్రీకరణ కూడా తెలంగాణ జిల్లాలోనే ఎక్కువ భాగం సాగిం ది. ఈ సినిమా జాతీయ ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికైంది. షబానా అజ్మీకి ఉత్తమ నటి పురస్కారం దక్కింది. ఇలా అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్, ఓంపురి, కుల్‌భూషణ్ ఖర్బందా, అమ్రీష్ పురి వంటి నటులను కూడా ఆయన తీర్చిదిద్దారు.
గుజరాత్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిన తీరు గురించి తీసిన సినిమా మంథన్ (1976). ఈ చిత్ర కథ విన్న గుజరాత్ రైతులు దాదాపు ఐదులక్షల మందితలో రెండు రూపాయల వంతున ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. అలా అంతమంది రైతుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న సినిమా బహుశా ఇదొక్కటే కావచ్చు. భూమిక చిత్రంలో మహిళ యెక్క అంతర్గత కల్లోలాన్ని అనితరసాధ్యమన్న రీతిలో శ్యామ్ బెనెగల్ తెరకెక్కించారు. స్మితాపాటిల్‌కు ఈ చిత్రం ద్వారా తొలిసారి జాతీయ అవార్డు లభించింది. సుభాష్ చంద్రబోస్ గురించి 2005లో, బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ గురించి 2023లో తీసిన సిని మాలు కూడా విమర్శకుల ప్రశంసలు పొందాయి. అదే ఆయన చివరి సినిమా! ఇలా 1970లలో ఆయన చేసిన సినీరంగ ప్రవేశం భారతీయ చలన చిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నెలకొల్పింది. అప్పటి నుండి సోమవారం సాయంత్రం కన్నుమూసేంత వరకు ఆయనది అదే ఒరవడి.
తనకు తొంభై ఏండ్లు వచ్చాయని, ఆరోగ్యంగానే ఉన్నానని, శరీరం, మనసు సహకరిం చినంత కాలం సినిమాలు తీయాలన్నదే తన కోరికని ఈ నెల 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పారు. ఈ మాటలు చెప్పి పది రోజులు గడవకుండానే మన మధ్య లేకుండా పోవడం బాధాకరం! అవినీతి, సనాతన ధర్మం, ఆధుని కత, మహిళా విముక్తి తదితర అంశాలను తన రచనలు, సినిమాల ద్వారా శ్యామ్ బెనెగల్ చర్చకు పెట్టి సమాంతర సినిమాకు గుర్తింపు తీసుకువచ్చారు. సమాజం పట్ల ఉన్న నిబద్ధతను ప్రతి సినిమాలోనూ చాటుకున్నారు. భారత చలన చిత్ర రంగానికి సరికొత్త దశను దిశను నిర్దేశించిన పురోగామిగా ఆయనను భావి తరాలు గుర్తుంచుకుంటాయి.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్