హైదరాబాద్: అమెరికా (యుఎస్‌ఏ) క్రికెట్ బోర్డు చైర్మెన్ పిసికె వేణు రెడ్డితో తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. అమెరికా జాతీయ జట్టులో తెలుగు క్రికెటర్లు, ముఖ్యంగా పాలమూరు జిల్లా మూలాలు కలిగిన ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఉండటం ఎంతో సంతోషం. తెలంగాణ గ్రామీణ క్రికెటర్లలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు అవకాశాలు దక్కటం లేదు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యుఎస్ క్రికెట్ బోర్డు ముందుకు రావాలని వేణును అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. గ్రామీణ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు టీడీసీఏ ముందుకు రావటం హర్షనీయం. సమాన అవకాశాలు, పారదర్శకతతోనే విజయాలు సాధ్యపడతాయి. టీడీసీఏకు అవసరమైన సహకారం అందించేందుకు ఆలోచన చేస్తామని ఈ సందర్బంగా వేణు రెడ్డి తెలిపారు.