నమోక్రసీ

Namocracyకేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తోంది. చాప కింద నీరులా అన్ని వ్యవస్థల్లోకి చొరబడి వాటిని తన గుప్పిట్లో పెట్టుకునే యత్నాలను ముమ్మరంగా చేస్తూనే ఉంది. అందుకు సామ, దాన, భేద, దండోపాయాలను సైతం ప్రయోగిస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ)ను నిర్వీర్యం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ మోడీ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి ఖాళీగా ఉంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రాజసుబ్రహ్మణ్యంను చైర్మన్‌గా నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టెక్నికల్‌గా నియామక ప్రకియ పూర్తి అయి ఉండవచ్చు. కానీ నియామక పద్ధతి తీవ్ర వివాదమై కూర్చుంది.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా విస్తృత ఏకాభిప్రాయంతో నియమాకాలు చేపట్టడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌, ఉభయసభల్లో ప్రతిపక్ష నేతలతో ఒక కమిటీ ఉంది. ఉభయసభల్లో ప్రతిపక్ష నాయకులు సూచించిన పేర్లు కనీసం పరిశీలనకు కూడా నోచుకోలేదు. ప్రభుత్వ ఎంపిక విధానాన్ని తప్పుపడుతూ ఖర్గే, రాహుల్‌ గాంధీ కమిటీ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ అసమ్మతి పత్రం అందజేశారు.
మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి వ్యవస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి దాసోహ సంస్థలుగా మార్చేశారు. కనక అవన్నీ జీ హుజూర్‌ సంస్థలుగా తయారయ్యాయి. అంతర్జాతీయంగా భారత మానవ హక్కుల సంఘానికి గుర్తింపే కరువై పోయింది. ఈ గుర్తింపు ఇవ్వడానికి అంతర్జాతీయ కమిటీ అంగీకరించడంలేదు. గ్లోబల్‌ అలయన్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇన్స్టిట్యూషన్స్‌ భారత జాతీయ మానవ హక్కుల సంఘాన్ని గుర్తించాలి. కానీ గత ఏడాదిగా ఈ గుర్తింపు ఇవ్వడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సంఘంలో స్త్రీ పురుషులు ఉండవలసిన రీతిలో లేకపోవడం, బహుళత్వానికి తావివ్వకపోవడంతో, ప్రభుత్వ జోక్యం లేకుండా మానవ హక్కుల సంఘం స్వతంత్రంగా పనిచేయడానికి వీలు లేకపోవడం సహా అనేక కారణాలను అంతర్జాతీయ వ్యవస్థ ఎత్తి చూపింది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన మోడీ ప్రభుత్వం వాటిని తోసిరాజని ప్రతిపక్షాల ప్రతినిధులు సూచించిన పేర్లను బుట్టదాఖలు చేస్తూ ప్రియాంక్‌ కానుంగో, డా.జస్టిస్‌ బిద్యుత్‌ రంజన్‌ సారంగిలను సభ్యులుగా నియమించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో మన మానవ హక్కుల కమిషన్‌ మీద విశ్వాసం నానాటికీ దిగజారుతోంది.
మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సవ్యమైన దర్యాప్తు చేసి, దోషులను కనీసం అభిశంసించి మానవ హక్కులకు భంగం కలగకుందా చూసే వ్యవస్థ కాదు వీరికి కావాల్సింది. తమ ప్రభుత్వం ఎంతగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా ప్రభుత్వ అనుకూల నివేదికలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యవస్థ కావాలి వారికి. అలాంటప్పుడు ఎంపిక విధానం కడిగిన ముత్యంలా ఉంటుందనుకోవడం భ్రమే. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పని తీరును వేలెత్తి చూపుతూ కనీసం 16 మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. అయినా ప్రభుత్వం తన తీరు మార్చుకోలేదు. దళితులు, గిరిజనులు, మైనార్టీల విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరి ఇసుమంత కూడా మారడం లేదు. మానవ హక్కుల కోసం పాటుపడే వారిని కేంద్ర ప్రభుత్వం వెంటాడుతూనే ఉంటుంది. మానవ హక్కుల కమిషన్‌ సిఫార్సులను అంగీకరించే తత్వం కూడా ఈ ప్రభుత్వానికి లేదు.
భిన్న అభిప్రాయాలు, భిన్నమైన నమ్మకాలు, విభిన్నమైన సంప్రదాయాల సమ్మేళనం భారతదేశం. ఎవరి అభిప్రాయాన్నయినా వ్యక్తపరచుకునేందుకు హక్కును కలిపిస్తున్న రాజ్యాంగమున్న దేశం మనది. మరిప్పుడు ఏమైందీ ఆలోచనలకు? కారుమబ్బులేవో కమ్మేస్తున్నాయి క్రమంగా… చీకటి తలుపులేవో తెరుచుకుంటున్నాయి! భిన్న అభిప్రాయాలపై దౌర్జన్య కోరలేవో దాడులకు తెగబడుతున్నాయి. ఆలోచనల్లో అంధత్వం తాండవిస్తోంది. సహన పూరిత సహజీవన దృశ్యం అదృశ్యమవుతోంది. డెబ్బయి ఐదేండ్లుగా నిలుపుకున్న విలువలు నిలువునా ధ్వంసమవుతున్న చిత్రం ప్రత్యక్షమవుతోంది. ఈ తరుణంలో మోడీ నియమించిన మానవ హక్కుల కమిషన్‌ ప్రజల హక్కులను ఏమేరకు కాపాడగలుతుంది?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా…వారంతా దేశద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ సామాజిక కార్యకర్తలను, రచయితలను, ప్రతిపక్ష నేతలను జైలు పాలుచేస్తున్నారు. ఒక్క సత్యవాక్కు విన్నా ఉలికిపాటుకు గురవుతున్న మోడీ సర్కార్‌ నిర్ణయాలను జీ హుజూర్‌ సంస్థగా మారిన ఎన్‌హెచ్‌ఆర్సీ అసలు ప్రశ్నించగలదా? వ్యవస్థల స్వతంత్రతకు సంకెళ్లు వేసి, డెమోక్రసీని నమోక్రసీగా మార్చజూస్తున్న కుతంత్రాల కాలంలో ప్రశ్నించి తను మనుగడ సాధించగలదా? ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన వ్యవస్థలన్నీ అధికారంలో ఉన్నవారి విధేయులే వాటి అధినేతలుగా ఎంపికవుతుంటే అది కేవలం ఓ జేబు సంస్థగా మారిపోయిందనడానికి ఇంతకంటే ఉదాహరణలేమి కావాలి?