‘ఏర్రోళ్ల’కు కండిషన్‌ బెయిల్‌

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి మూడవ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారనే కారణంతో శ్రీనివాస్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాంపల్లి పోలీసులు ఆయన్ను మూడుసార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీచేశారు. శ్రీనివాస్‌ విచారణకు రాకపోవడంతో గురువారం ఉదయం అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 5000 పూచీకత్తుతోపాటు రెండు జమానత్‌లు సమర్పించాలనీ, పోలీసుల విచారణ కు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అంతకు ముందు బీఆర్‌ ఎస్‌ నేతలు హరీశ్‌రావు, వివేకానంద, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాసాబ్‌ ట్యాంక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి పరామర్శించారు. శ్రీనివాస్‌ ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని బీఆర్‌ఎస్‌ నాయకు లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడు తూ నాపై అక్రమ కేసులు పెట్టిన ప్రభుత్వంపై ధర్మం గెలిచిందనీ, అధర్మం ఓడిందని వ్యాఖ్యానించారు. కోర్టు నిబంధనలు తప్ప కుండా పాటిస్తాననీ, అండగా నిలిచిన కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు వ్యవహారాలు పరిశీలిస్తూ, బెయిల్‌కు కృషిచేసిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌కు ధన్యవాదాలు చెప్పారు.