పాఠ్యపుస్తకాల్లో వీర్‌ బల్‌ దివస్‌ను పెట్టడాన్ని పరిగణలోకి తీసుకుంటాం

– కేంద్రం మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వీర్‌ బల్‌ దివస్‌ను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలనే డిమాండ్‌ ఉందనీ, దీనిని పరిగణనలోకి తీసుకుని స్వయంగా ప్రధాని మోడీతో చర్చిస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీనిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీర్‌ బల్‌ దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన దేశ ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు 350 ఏండ్ల కింద వీర్‌ సాహెబ్‌ డిసెంబర్‌ 26న బలిదానం చేసుకున్నారని గుర్తుచేశారు. దేశం కోసం బలిదానాలు చేసిన ప్రతీ ఒక్కరికి నమస్కరిస్తున్నానన్నారు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ నిర్వహించే ఏర్పాటు చేస్తామన్నారు. 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హైదరాబాద్‌ వస్తున్నారనీ, సికింద్రాబాద్‌ నుంచి గోల్డెన్‌ టెంపుల్‌ వరకు ప్రత్యేక రైలును నడపాలనే అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. ఈ విషయంలో తన పూర్తి సహాయ సహకారాలు సిక్కు సోదరులకు ఉంటాయని హామీనిచ్చారు. కార్యక్రమంలో బల్‌దేవ్‌ సింగ్‌, బగ్గాసింగ్‌, గురుదేవ్‌సింగ్‌, బగేందర్‌సింగ్‌, హరిసింగ్‌, చంద్రశేఖర్‌, రాంచందర్‌రావు, గౌతంరావు, ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్‌ శిల్పారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.