– పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
గ్రూప్-1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువడింది. దీంతో దీనికి చెందిన అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో లీకేజీ కారణంగా రద్దు కావడంతో ప్రభుత్వం గత ఫిబ్రవరిలో మరో నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఈ మేరకు జీవో 29ని జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్ట్టు ఈ నెల 17 తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ సుజరుపాల్, జస్టిస్ రాధారాణిలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయ్యాక వెంటనే పిటిషనర్లు కోర్టుకు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. పిటిషన్లు వేయడంతో సుదీర్ఘ జాప్యం జరిగిందని చెప్పింది. దీనికి తగిన కారణాలు కూడా చెప్పలేదంది. సమాచార హక్కు చట్టం కింద జీవో 29 గురించి వివరాలను సేకరించే ప్రయత్నం పిటిషనర్లు చేయలేదని తప్పుపట్టింది. అందుకే పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ 2018లో జారీ చేసిన జీవో 10, 2019లో జారీ చేసిన జీవో 96తోపాటు ఈ ఏడాది జారీ చేసిన జీవో 29ను వ్యతిరేకిస్తూ నల్లగొండకు చెందిన అభ్యర్థులు, ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. తొలి నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం సమాంతర రిజర్వేషన్‌లు అమలు చేయాలని పిటిషనర్లు కోరారు. 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు పిలవాలన్నారు. 2022 నోటిఫికేషన్‌లో 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. రిజర్వేషన్ల కేటగిరీ అభ్యర్థులకు మంచి మార్కులు వస్తే అన్ రిజర్వుడు కేటగిరీగా పరిగణించడం వల్ల దివ్యాంగులకు, మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వ ప్లీడర్ వాది స్తూ, నిబంధనలు సవరించడం వల్ల పిటిషనర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారికి మెరిట్ జాబితాలో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వుడు కేటగిరీలో పరిగణనలోకి తీసుకుంటా మన్నారు.
భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన అదనపు మాజీ ఎస్పీ ఎన్. భుజంగరావు తనకు బెయిల్‌ఇవ్వాలంటూ వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. జడ్జిమెంట్‌ను తర్వాత చెబుతామని న్యాయమూర్తి జస్టిస్ సుజన గురువారం పేర్కొన్నారు. పోలీస్ అధికారిగా అర్హత లేకపోయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేశారనీ, ఇద్దరు నింది తులు పరారీలో ఉన్నారనీ, ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని పీపీ వాదించారు. అనారోగ్యం కారణంగా మధ్యం తర బెయిల్‌పై పిటిషనర్ ఉన్నారనీ, దర్యాప్తు పూర్తి అయినందున బెయిలివ్వాలని పిటిషనర్ లాయర్ కోరారు ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.