– తెలంగాణ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలుగు వికీపీడియాపై అందరికీ అవగాహన అవసరమని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమంలో ”వికీపీడియా గురించి మీకు తెలుసా?” అనే ఉచిత పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించి వికీపీడియా సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్‌సైక్లోపీడియాకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందేనన్నారు. 2001లో ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ఈ వికీపీడియాకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. అలాగే తెలుగు వికీపీడియా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ లక్ష వ్యాసాలను దాటి, భారతీయ భాషల వికీపీడియాల్లో ఎక్కువ వ్యాసాలను కలిగి ఉన్న జాబితాలోకి చేరడం గర్వించదగ్గ విషయం అన్నారు. కలెక్షన్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ అవన్నీ కలిపితేనే ఒక నాలెడ్జిగా కొలమానంగా అయిందని వివరించారు. వికీపీడియన్స్ అంతా కలిసి స్వచ్ఛందగా వీకీ వ్యాసాలు రాస్తున్నారని చెప్పారు. అనంతరం, వికీ పీడియాలో వ్యాసాలు రాసిన వారికి సన్మానం చేశారు. అలాగే బుక్ ఫెయిర్‌లోని తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహణలో పాల్గొన్న వికీమీడియన్లకు సత్కారాన్ని చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, బుక్ పెయిర్ సెక్రటరీ వాసు, పాశం యాదగిరి, వికీపీడియన్లు కృపాల్ కశ్యప్, వి.జె. సుశీల, గుంటు పల్లి రామేశం, ప్రణరు రాజ్ వంగరి, నాగరాణి బేతి తదితరులు పాల్గొన్నారు.