– లబ్దిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలి
– విధివిధానాలు ప్రకటించాలి
– ఎవరెవరికి ఎలా ఇస్తారనే దానిపై స్పష్టతివ్వాలి : వ్యకాస రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
– నేడు జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
– లబ్దిదారులతో జనవరి 6న తహసీల్దార్లకు వినతులు :జి నాగయ్య, సారంపెల్లి, ఆర్ వెంకట్రాములు,
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏటా రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చింది. 28 నుంచి తొలి విడతగా రూ.6వేల చొప్పున ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ కార్మికులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు.? ఇందులో అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? అందరికీ ఇస్తారా? లేక కోతలు పెడతారా? ఒక వేళ కోతలు పెడితే వారిని ఏ ప్రాతిపదికన అనర్హులుగా ప్రకటిస్తారు? అసలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది కూలీలు ఉన్నారో తేల్చారా? మంత్రులు చెప్పే లెక్కల్లో నిజముందా? వంటి అనేక ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పథకాల అమలులో కాంగ్రెస్ మార్క్ కోతలు, కొర్రీలు ఈ పథకంలోనూ కొనసాగుతాయనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ కార్మిక, స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వమే సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకుంటే తప్పేంటి? విధివిధానాలు ప్రకటించకుండా ఏ ప్రాతిపదికన నగదు ఇస్తారు?’ తదితర అనేక సందేహాలను పలువురు వక్తలు వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘భూమి లేని వ్యవసాయ కార్మికులకు రూ.12వేలు ఇవ్వాలి’ అనే డిమాండ్‌పై సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, డీబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండలు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, డీవైఎప్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఏ వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి పద్మ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్‌నాయక్ తదితరులు మాట్లాడారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబ్‌కార్డు ద్వారా 100 రోజులు పని పొందిన కుటుంబాలు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా రూ12వేల పథకానికి ఎంపిక చేయబోతున్నట్టుగా వార్తలొస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించా లని వారు డిమాండ్ చేశారు. లబ్దిదారులను కుదించేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సభల ద్వారానే లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే విధివిధానాల రూపకల్పనకు వ్యవసాయ కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు కలిగిన వారితో పాటు వలస కార్మికులను, కూలి పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కొత్తగా జాబ్ కార్టులిచ్చి పనిదినాలు కల్పించాలని కోరినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ కార్డులో కుటుంబ సభ్యులను అదనంగా చేర్చాలనీ, అలాగే విడిగా జాబుకార్డులివ్వాలని ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా అధికారులు పట్టించుకోలేదని విమర్శిం చారు. ఒంటరి మహిళలు, ముసలివారు అనే పేరుతో పనికి రానివ్వకుండా అనేక చోట్ల అధికారులు అడ్డుకున్నారన్నారు. ఆధార్, జాబ్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంటు లింకు పేరుతో వేలాది మంది పేదల జాబ్‌కార్డ్ల్‌ను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేకమంది పేదలు పనికి దూరమ య్యారని చెప్పారు. పని ప్రదేశంలో ఫొటోల అప్‌లోడింగ్, ఆన్‌లైన్ మస్టర్ పేరుతో ఇంటర్నెట్ సపోర్ట్ చేయని దగ్గర పని చేసిన కూలీలకు కూడా మస్టర్ వేయకుండా పనికి రాలేదని రికార్డులు తయారుచేసి వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీన పరుస్తూ రూ.12వేల పథకం లబ్దిదారుల ఎంపికకు లింకు పెట్టడమంటే కార్మికుల సంఖ్యను కుదించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని చెప్పారు. తక్షణమే ఈ చర్యలకు స్వస్తి చెప్పాలనీ, గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి రూ. 12వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనీ, జనవరి 6న తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయాలని కోరారు. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారనీ, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. ఏ పథకానికి నోచుకోని ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గుంట, రెండు గుంటల భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసాలో ఏమీ రాదు కాబట్టి, అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్హులైన అందరికీ న్యాయం చేయాలని రౌండు టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.సాగర్ తదితరులు