కొత్త ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలో కొత్త ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు మొదలవుతాయి. ఇబ్బంది పెడుతున్న పాత అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలను అవలంబించాలని నిర్ణయించుకునేవారు మరికొందరు. సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో నూతన ఏడాది నుంచి కాస్త జోష్ నింపాలని అనుకోవడం సర్వసాధారణం. చాలా మంది తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం న్యూ ఇయర్ నుంచే ప్రారంభిస్తారు. మంచి ఏదైనా సరే, ఎక్కడున్నా సరే స్వీకరిస్తే తప్పేం లేదని చాలా మంది అనుసరిస్తున్నారు కూడా.
ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న తమ జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేక మార్పు తీసుకురావాలని భావిస్తే ఓ ప్రత్యేక రోజు కోసం వెతుకుతారు. ఆ రోజు నుంచి మార్పు దిశగా ప్రయాణం సాగిస్తారు. ఎక్కువ మంది పుట్టిన రోజు, పెండ్లి రోజు లేదంటే ఏదైనా పండగను అందుకు గుర్తుగా పెట్టుకుంటారు. న్యూ ఇయర్ కూడా అలాంటిదే. ఇది ఆంగ్ల సంవత్సరాది కాబట్టి ఆ రోజు నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చాలా మంది భావిస్తారు. గతేడాది ఎదురైన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ప్రాణాళికలు రూపొందించుకుంటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం అనుకున్న మార్పు సాధ్యమయ్యేది.
కొత్త ఏడాదిలో తొలిరోజు సంతోషంగా ఉంటే మిగతా రోజులంతా అలాగే ఉంటామనేది అందరిలో ఓ మానసిక భావన. ఆ రోజు కొత్త రిజల్యూషన్స్ను ప్రారంభిస్తే కచ్చితంగా సాధిస్తామని జీవితంలో పెను మార్పులకు ఇది కారణం అవుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల దాకా వారి ఆలోచనలను బట్టి, చేయాలనుకున్న పనులను బట్టి రిజల్యూషన్స్ను పెట్టుకుంటారు. దానికై శ్రమించి విజయం సాధిస్తారు. రోజు ఏదైనా స్థిరమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే మధ్యలో కాస్త అవరోధాలు వచ్చినా పట్టు వదలకుండా పని చేసుకుంటూ పోతే ఫలితాలు తప్పక వస్తాయి.
వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుందనేది నానుడి. ఈ రిజల్యూషన్స్ కూడా అంతే. ప్రారంభం అనేది జరిగితే అలా చివరిదాకా కొనసాగిస్తే అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధించగలరు. అలా చేయని వారు మధ్యలోనే చతికిలపడతారు. పరిస్థితుల కారణంగా చాలా మంది ఏడాది ప్రారంభంలో తీసుకున్న రిజల్యూషన్స్ అమలు చేయలేకపోతారు. మరో ఏడాదిలోనైనా వాటిని సాధించాలని, తమ కలను సాకారం చేసుకోవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. మలి ప్రయత్నంలోనూ విజేతలు ఎక్కువగానే ఉంటారు.
అందుకే ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ విజయం సాధించొచ్చు. మంచి పని ప్రారంభించడానికి మంచి ముహూర్తం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. కానీ ఏదో ఒక గుర్తు ఉండాలి. కాబట్టి చాలా మంది న్యూ ఇయర్ రోజు కొత్త పనులు, అలవాట్లు ప్రారంభిస్తారు. నేటి తరానికి స్థిరత్వం కాస్త తక్కువ కాబట్టి పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండరు అనేది కొందరి వాదన. క్యాలెండర్ మారినంత మాత్రాన పెట్టుకున్న లక్ష్యాలకు తగినట్లుగా శ్రమించకపోతే సరైన ఫలితాలు రావు కదా. కాబట్టి మీ లక్ష్యాలను చేరుకునేందుకు, వాటి సాధనకై శ్రమించేందుకు రాబోయే కొత్త ఏడాదిని ఎంచుకోండి.