బీ కేర్‌ ఫుల్‌

They are getting caught in the magic of social mediaఇప్పుడు కండ్లు తెరవగానే సెల్‌ఫోన్‌ చేతిలోకి తీసుకోవాలి. ముఖం కడుక్కుంటున్నా.. వాష్‌ రూంలో ఉన్నా.. టిఫిన్‌ చేస్తున్నా.. బయట నడుస్తున్నా.. అసలు ఏం చేస్తున్నా.. దేన్నైనా మర్చిపోతున్నారు కానీ చేతిలో సెల్‌ఫోన్‌ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు. సోషల్‌ మీడియా మాయలో చిక్కుకుపోతున్నారు. ఒక్కసారిగా సెల్‌ ఫోన్లు పనిచేయడం ఆగిపోతే మనుషులంతా ఏమైపోతారా? అని భయపడేంతలా వాటికి అడిక్ట్‌ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
సోషల్‌ మీడియా ద్వారా మంచి స్నేహితులు అయినవారు లేకపోలేదు. అయినా కూడా ఆ ప్లాట్‌ఫామ్‌ మీద స్నేహితుల్ని ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం.. వారి ప్రొఫైల్‌ కరెక్టేనా? వారు అసలు నిజంగా ఆడా.. మగా? వారు చెప్పేవి నిజాలేనా? అనేవి ఆలోచించకుండా తొందరపడి స్నేహాలు చేస్తే ఆనక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ఫేక్‌ ఐడీలతో ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా చాటింగ్స్‌ చేస్తూ బుట్టలో వేస్తున్న సంఘటనలు ఎన్నో విన్నాం. వారి కల్లబొల్లి మాటలు నమ్మి లక్షలు సమర్పించి ఆనక మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఇక కొంతమంది అమాయకులు వారి మాటలు నమ్మి ప్రేమ అనే భ్రమలో వారి కోసం వెళ్లి పోతున్నారు. కంటికి కనపడని వారితో కబుర్లు చెప్పుకుంటూ ఓ మాయా లోకంలో విహరిస్తు న్నారు. ముఖ పరిచయం లేని వారితో స్నేహాలు.. డేటింగ్స్‌ పేరుతో మోసపోవడాలు. ఆ తర్వాత తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లడం.. ఆత్మహత్యలకు పాల్పడటం.. వంటి అనేక ఘటనలు చూస్తున్నాం. కొన్ని రోజులు వారితో జీవితం బాగానే ఉన్నా ఒక్కొక్కటిగా వారి మోసం బయటపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
కష్టంలో ఉన్నామనో.. తమ ఇంట్లో వారికి బాగా లేదనో నమ్మించి ఆర్ధిక సాయం కోరే వారి సంఖ్య కోకొల్లలు. అలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నా వారి చేతుల్లో చాలా మంది మోస పోతున్నారు. ఇక మాటల్లోకి దింపి ఎదుటివారి బలహీనత ను క్యాష్‌ చేసుకునే గుంపులు చాలానే ఉంటున్నాయి. ఏ మాత్రం వారి మాటలకు పడి పోయినా ఫోటోలు, వీడియో లతో బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. పరువు పోతుందని వారికి భయపడి డబ్బులు ఇచ్చి వదిలించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక కల్లబొల్లి మాటలకు పడిపోయి ప్రేమనే భ్రమలో జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న యువతని చూస్తున్నాం. ఇంట్లో పెద్దవాళ్లు ఎంతో బాధ్యతగా చూసి చేసిన పెండ్లిలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటిది సోషల్‌ మీడియా వేదికలపై పరిచయమైన వారిని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అంటే ఎంత ఆలోచించాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి?
కొంతమంది కుటుంబసభ్యులు, స్నేహితుల కన్నా సోషల్‌ మీడియాలో పరిచయం అయిన వారిని బాగా నమ్ముతారు. వారితో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోతారు. నమ్మి కుటుంబ విషయాలు, ఆర్ధిక విషయాలు అన్నీ షేర్‌ చేసుకుంటారు. అవతలి వ్యక్తులు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈజీగా మోసం చేస్తారు. సాయం చేస్తున్నామని నమ్మించి అన్ని విషయాలు తెలుసుకుని ఇతరులకు చెబుతామనో.. పరువు తీస్తామనో బెదిరించే వాళ్లు లేకపోలేదు. ఇక సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇతరులకు పంపడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పర్మిషన్‌ లేకుండా ఇతరుల ఫోటోలు లాంటివి షేర్‌ చేయడం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.
సోషల్‌ మీడియా ఎంత పాపులారిటీని తెస్తుందో.. స్టేటస్‌ ఇస్తుందో.. అంతగా పతనాన్ని చూపిస్తుంది. కనిపించే ప్రతి వ్యక్తిని నమ్మడం.. అన్ని విషయాలు షేర్‌ చేసుకోవడం వల్ల అనేక అనర్ధాలు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా నమ్మడం.. వారు చెప్పేదంతా నిజమనుకోవడం మానేయాలి. వ్యాపారం పేరుతో.. వడ్డీల పేరుతో అనేకమంది ఎర వేస్తుంటారు. వారి మాటలు నమ్మి పెట్టుబడులు పెడితే అంతే. ఆనక వారి అడ్రస్‌ గల్లంతవుతుంది. మన ఇల్లు గుల్లవుతుంది. అందుకే సోషల్‌ మీడియాలో స్నేహం చేసేముందు జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. లేదంటే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. బీ కేర్‌ ఫుల్‌ ఫ్రెండ్స్‌.. కనిపించని స్నేహాల కన్నా.. కండ్ల ముందు కనపడే కుటుంబసభ్యులు, స్నేహితులకు సాటి వేరెవరు రారనే విషయాన్ని గుర్తుంచుకోండి.
ఏయే అంశాల్లో జాగ్రత్తలు అవసరమంటే
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాచార వ్యాప్తిలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో కలిగే ఆనందం, బాధ వంటి భావోద్వేగాలను పంచుకోవడంతో పాటు సమాజంలో చోటుచేసుకునే తాజా సంఘటనలకు సంబంధించి తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమాజం ముందుకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్నాయి. అయితే వీటి వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహనలేమితో కొందరు.. అత్యుత్సాహంతో మరికొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వినియోగంలో ఏయే అంశాల్లో జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం.
చాలా మంది సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలతో పాటు రోజువారీ జీవితంలో తాము ఎదుర్కొన్న సంఘటనల అనుభవాలను కూడా పంచుకుంటుంటారు. కొన్నిసార్లు తాము పోస్ట్‌ చేసిన సమాచారం వల్ల తమ ఉద్యోగాలతో పాటు.. ఉద్యోగావకాశాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అవి మీ ప్రొఫెషనల్‌ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రభుత్వ విధానాలు లేదా ఏదైనా కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేసే ముందు అది నిజమా? కాదా? అనేది సరిచూసుకోవాలి.
ఉన్నత చదువుల కోసం లేదా మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. కారణం.. గతంలో మీరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన సమాచారం సదరు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని అధికారులు భావించి ఉండొచ్చు. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఇతర దేశాల విధివిధానాలను వ్యతిరేకిస్తూ వచ్చే పోస్టులను షేర్‌ చేస్తాం. అవి భవిష్యత్తులో మీ విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపిస్తాయి.
ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు అనాలోచితంగా వాటిని షేర్‌ లేదా రీపోస్ట్‌ చేసేస్తాం. వాటి ఆధారంగా పోలీసులు మీపై కేసు నమోదు చేస్తారు. అలా మీరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వాటినే సాక్ష్యాలుగా సమర్పిస్తే కోర్టు మీకు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
సామాజిక మాధ్యమాల్లో పరిచయంలేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్టులకు దూరంగా ఉండటమే మంచిది. చాలా సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలానే మీ స్నేహితులు, బంధువుల పేరుతో సోషల్‌ మీడియాలో ఆర్థిక సాయం కోరితే.. ముందుగా వారికి ఫోన్‌ చేసి కనుక్కోవడం ఉత్తమం. ఒకవేళ అది నకిలీ అయితే మీకు ఎలాంటి నష్టం జరగదు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య.. కామెంట్ల రూపంలో వచ్చే అసభ్య పదజాలం. ఉద్దేశపూర్వకంగానే కొంత మంది వ్యక్తులు తమకు నచ్చని వారు పోస్ట్‌ లేదా షేర్‌ చేసిన సమాచారం లేదా ఫొటోలు/ వీడియోలను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడుతుంటారు. ఈ తరహా చర్యలు సదరు వ్యక్తుల మానసిన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. మీరు చేసే కామెంట్ల వల్ల కొన్నిసార్లు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకవేళ సోషల్‌ మీడియాలో మీకు నచ్చని సమాచారం లేదా పోస్ట్‌ కనిపిస్తే సదరు వ్యక్తులు, సంస్థ ఖాతాలను అనుసరించడం ఆపేయండి.
సోషల్‌ మీడియా వల్ల లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. అందుకని మీరు వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంలేదు. సామాజిక మాధ్యమాల్లో మీరు ఏం చేస్తారు? ఎలాంటి సమాచారం కోసం వెతుకుతారు? అనేది విశ్లేషించుకోండి. ఒకవేళ మీకు వాటి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందనుకుంటే సదరు సోషల్‌ మీడియా ఖాతాను తాత్కాలికంగా డిలీట్‌ చేయండి. తిరిగి కొద్దిరోజుల తర్వాత ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు లేదా పూర్తిగా ఖాతాను మూసేయ్యొచ్చు. అలా కాకుండా.. సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటే.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ డిజిటల్‌ ప్రపంచంలో సమాచార సరఫరాతోపాటు.. వ్యక్తులను అనుసంధానించడంలో సామాజిక మాధ్యమాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.
రిపోర్ట్‌ చేయండి!
వివిధ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను మీరు గుర్తిస్తే.. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసే వారిపై రిపోర్ట్‌ చేయవచ్చు. లేదంటే www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. మరింత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటే దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలి. దిగువ ఇచ్చిన లింక్‌లలో మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు.
ఫేస్‌బుక్‌ : https://www.facebook.com/help/572838089565953
వాట్సాప్‌ : https://faq.whatsapp.com/general/security-and-privacy/staying-safe-on-whatsapp/
యూట్యూబ్‌ : https://support.google.com/youtube/answer/ 2802027

ట్విట్టర్‌ :https://help.twitter.com/en/safety-and-security/report-a-tweet
ఇన్‌స్టాగ్రామ్‌ : https://help.instagram.com/1735798276553028
లింక్డ్‌ఇన్‌ : https://www.linkedin.com/help/linkedin/answer/37822/recognizing-and-reporting-spam-inappropriate-and-

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417