కొత్త‌ద‌నంతో కొట్టా‌రు హిట్టు‌

A new hit– రీల్‌ .. రౌండప్‌ 2024
ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడమే కాదు. తమ సినిమాలతో వారిని మెప్పించడమనేది కూడా మేకర్స్‌కి సవాల్‌ విసిరే అంశాలు.  వీటిల్లో ఎవరైతే నెగ్గుతారో వారే విజేతలు. ఈ ఏడాది దాదాపు 200 సినిమాలు రిలీజైతే, కేవలం 20 సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈ చిత్రాల మేకర్స్‌ కొత్తదనం చూపించారు కాబట్టే హిట్లు కొట్టారు. కలెక్షన్లూ కొల్లగొట్టారు. సక్సెస్‌ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వసూళ్ళ పరంగా పాన్‌ఇండియా మార్కెట్‌లో తెలుగు సినిమా విజయ దుందుభి మోగించింది. ప్రేక్షకుల్ని అలరించే పరీక్షల్లో ఈసారి దాదాపు 200 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిల్లో కేవలం 20 సినిమాలకే ప్రేక్షకులు నూటికి నూరు శాతం మార్కులు వేశారు. ఈ చిత్రాలు అటు ప్రేక్షకుల్ని మెప్పించడంతోపాటు ఇటు నిర్మాతల్ని లాభాల బాట పట్టించాయి.
పాన్‌ ఇండియా మార్కెట్‌ని షేక్‌ చేశాయి
దేశ వ్యాప్తంగా విడుదలైన సినిమాల్లో పాన్‌ ఇండియా మార్కెట్‌ని షేక్‌ చేసిన టాప్‌ టెన్‌ చిత్రాల్లో మన తెలుగు సినిమాలు 4 ఉండటం విశేషం. ప్రభాస్‌, అమితాబ్‌బచ్చన్‌, దీపికా పదుకొనె వంటి భారీ తారాగణంతో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ప్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కీ 2898 ఎ.డి.’ విశేష ఆదరణ పొంది, రూ.1100 కోట్లకి పైగానే వసూళ్ళని రాబట్టింది. వర, దేవరగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘దేవర’. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసింది. ఇక అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప2 : దిరూల్‌’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్‌ సాధించిన సినిమాగా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది. అలాగే నార్త్‌లోనూ రూ.700 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. అన్నింటికి మించి చాలా తక్కువ రోజుల్లో ఈస్థాయి వసూళ్ళని సాధించడం రికార్డ్‌. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. రూ.2వేల కోట్ల వసూళ్ళ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కలయిలో రూపొందిన ‘హను-మాన్‌’ సినిమా సుమారు రూ.350 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ సినిమా సాధించిన వసూళ్లు పాన్‌ ఇండియా మార్కెట్‌లో తెలుగు సినిమా సత్తా ఏమిటో నిరూపించింది. మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన ‘గుంటూరుకారం’ టాక్‌ పరంగా నిరాశపర్చినా, కలెక్షన్ల పరంగా దాదాపు రూ.180 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. నాని, వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘సరిపోదా శనివారం’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లోకి చేరాయి. దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీభాస్కర్‌’ సైతం మంచి వసూళ్ళనే రాబట్టింది. మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్‌ ‘సైంధవ్‌’, రవితేజ ‘ఈగల్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, వరుణ్‌తేజ్‌ ‘మట్కా’, నిఖిల్‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’, గోపీచంద్‌ ‘భీమా’, ‘విశ్వం’, రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, సుధీర్‌బాబు ‘హరోం హర’, విజరు దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రాలు మెప్పించ లేకపోయాయి.
చిన్నసినిమాలు పెద్ద విజయాలు
పెద్ద సినిమాలతో పోలిస్తే ఈసారి చిన్న సినిమాల నిర్మాణంతోనే ఎక్కువ స్థాయిలో నూతన ప్రతిభావంతులు సిల్వర్‌స్క్రీన్‌కి పరిచయం అవ్వడం విశేషం.  స్టార్లు లేనప్పటికీ, భారీ బడ్జెట్‌ లేకపోయినప్పటికీ కేవలం ఫ్రెష్‌ కంటెంట్‌తో ఈసారి చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేశాయి. సుహాస్‌ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’, విశ్వక్‌సేన్‌ ‘గామి’, శ్రీ విష్ణు ‘ఓంభీమ్‌బుష్‌’, ‘కమిటీకుర్రోళ్ళు’, ‘ఆరు’, ’35 చిన్న కథ కాదు’, ‘మత్తువదలరా 2’, ‘క’ వంటి సినిమాలు మంచి వసూళ్ళతో అదరగొట్టాయి. ఈ సినిమాల సక్సెస్‌కి ఆయా చిత్ర దర్శకులు, నిర్మాతలు ఎంచుకున్నది ఒక్కటే కొత్తదనం. కంటెంట్‌లోనో, క్యారెక్టరైజేషన్‌ లోనో, బ్యాక్‌డ్రాప్‌లోనో.. ఇలా ఏదో ఒక అంశాన్ని ముఖ్యంగా తీసుకుని, ఆసాంతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే పనిలో గ్రాండ్‌ సక్సెస్‌ సాధించారు. గ్రామీణ నేపథ్యం, మన నేటివిటీ, జరిగిన వాస్తవ ఘటనల్ని అత్యంత సహజంగా తెరకెక్కించడం కూడా ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. మిగిలిన సినిమాల్లో ఈ మ్యాజిక్‌ మిస్‌ అయ్యింది. ఇక ‘సర్కారు నౌకరి’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘ఊరుపేరు భైరవ కోన’ ‘ప్రసన్నవదనం’, ‘గం గం గణేశా’, ‘మెకానిక్‌ రాకీ’, ‘జీబ్రా’, ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’, ‘పేకమేడలు’, ‘మానాన్న సూపర్‌ హీరో’, ‘జనక అయితే గనక’, ‘పొట్టేల్‌’ వంటి తదితర చిత్రాలు కథా కథానాలు, సాంకేతికత పరంగా, కొత్త నేపథ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించడంలోను, సమాజానికి అవసరమైన విషయాల్ని చర్చించడంలోను, ఈ తరం రచనకి అద్దం పట్టిన చిత్రాలుగానూ నిలిచినప్పటికీ నిర్మాతలకు నిరాశే మిగిల్చాయి.