”ఊలు దారాలతో గొంతుకురిబిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా! దయలేని వారు మీ ఆడవారు”
కరుణశ్రీ తమ పుష్పవిలాపంలో ఒకరోజు పూసి తెల్లవారి వాడిపోయే పువ్వుల సున్నితత్వాన్ని ఆడవాళ్లు గుర్తించక సూదులతో గుచ్చి దండలు కట్టారని, తమ సిగలలో ముడుచుకున్నారని వాపోయారు.
పై గేయం చదివితే మనకు కూడా గుండెతడి అవుతుంది. మరి తల్లిదండ్రుల వద్ద ఏడు మల్లెల ఎత్తున, పువ్వు కన్నా సుకుమారంగా పెరిగిన, అందమైన మనసున్న ఆడవాళ్లను దుఃఖింపజేసి వారి హదయాల్లో తడి ఆరిపోయేలా చేసి ప్రేమ, అభిమానం, ఆత్మీయతలు ఎరుగని ఒక బండరాయి, రాక్షసి గయ్యాళిలాగా ఎందుకు తయారు అయ్యారు, అవుతున్నారు…? ఏ పరిస్థితులు అలా తయారు చేస్తున్నాయి… మన సమాజంలో మహిళల జీవితంలో అడుగడుగునా ఆంక్షలు, అవరోధాలు… వివిధ దశల్లో ఎదురయ్యే కఠిన పరీక్షల్లో వైధవ్యం లేదా వితంతువు కావడం అనేది దుర్భరమైన స్థితి.
స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సామెతను సష్టించి తమ చేతులకు ఏ మట్టీ అంటకుండా ఆచార వ్యవహారాలు, సంస్కతి సంప్ర దాయాలు అంటూ ఘోరమైన నిబంధనలను రూపొందించిన మనువుది కాదా ఈ పాపం. ఆయన వారసులుగా పురుషాధిక్య భావ జాలంతో మన చుట్టూ ఉన్న, మన ఇంట్లో ఉన్న మనుషులదికాదా ఈ పాపం.
21వ శతాబ్దంలో పావుభావం పూర్తిగా వస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి ఒక డాక్టర్ శస్త్రచికిత్స చేశారట. ఇది చైనాలో జరిగింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిత్యం నూతన ఆవిష్కరణలు జరుగుతున్నా మన దేశంలో మాత్రం సనాతనం పేర జనాన్ని వాస్తవాలకు దూరంగా భ్రమల్లో ముంచెత్తుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఆగ్రహం కన్నా సనాతనంపైన, ఆచారాలపైన, మతంపైన చర్చలు ప్రచారాలు జరుగుతూ ఉండడం యాదచ్ఛికమేమీ కాదు. ధరలపై ఆందోళన వెలిబుచ్చిన వారి గొంతుకలకు ఎక్కడా గుర్తింపు ఉండదు. ఈ ఉపోద్ఘాతం, ఆవేదన ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా మనసును కలచివేసిన కొన్ని సంఘటనలు నన్ను వెన్నాడుతున్నాయి. ఆ అమానవీయ ప్రక్రియను ఎట్లా ఆపగలం, ఎట్లా ఎదిరించగలం అనేది.. ప్రశ్న.. అయితే అసాధ్యం ఏమీ కాదు.. ఆ అమానవీయ ప్రక్రియ భర్తను కోల్పోయిన స్త్రీ వితంతువుగా మారే ప్రక్రియ.
వైధవ్యం అంటే ధవుడు లేకపోవడం. పెనిమిటి మరణించిన భార్యకు విధవ లేదా వితంతువు అని పేర్లు. భర్త మరణించి భార్య ఉండడం భార్య మరణించి భర్త ఉండడము సహజం. ఆ ఇరువురు ఒకసారి పుట్టలేదు ఒకసారి మరణించరు కానీ భర్త చనిపోయిన భార్య పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మధ్యయుగంలో విన్నాం. ఆధునిక యుగంలో కళ్లారా చూశాం సతీసహగమనం. రాజస్థాన్‌లో జరిగిన రూప్ కన్వర్ సతీసహగమనం. ఉద్యమాల పుణ్యమా అని సతీసహగమనం బాధ తప్పినా బతికున్న భార్యను జీవచ్ఛవంగా మార్చే వితంతు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. భర్త చనిపోయిన భార్యను నిరలంకారం చేయడంలో ఒకరేమిటి అందరూ పెద్దలే. ఈ పద్ధతి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు భర్త అంత్యక్రియల సందర్భంగా భార్యను పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించి శవం పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికీ కలిపి స్నానం చేయించడంతో ఆమె నిమిత్తం లేకుండానే మొదలవుతుంది. అది మొదలు పదోరోజు వరకూ ఇదే చివరి అలంకారం అంటూ రోజూ హింసిస్తూనే ఉంటారు. ఇక పదవ రోజున చేసే గాజులు పగలగొట్టడం, పసుపు కుంకుమలు తుడిచేయడం, పుస్తే మట్టలు తీసేయడం. ఈ పని ఒక చాకలి లేదా మంగలి వత్తికి చెందిన మహిళే చేయాలి. కన్నతల్లి, తోబుట్టువులు, ఆత్మీయులు ఎవరూ చేయకూడదట. భూమి బద్దలై సీత వలె అందులో కూరుకుపోతే బాగుండు అనిపించినా సానుభూతికి మాత్రం అవకాశం ఉండదు. స్నానం చేశాక తెల్ల చీర కట్టించి వెలుతురు ఎక్కువగా లేని ఒక గదిలో కూర్చోబెట్టి అమ్మలక్కలంతా ఒక్కొక్కరు వరుస కట్టి ఆ గదిలోనికి వెళ్లాలి. ఆమె తల వంచుకుని దుఃఖిస్తూనే ఉండాలి. చేతిలో బెల్లం ముక్క పెట్టి ఓదార్చి వస్తారు. ఆ రోజు తప్ప, అప్పుడు తప్ప మరో రోజు ఆమెను కలవాలన్నా ఆమె ముఖాన్ని చూడాలన్నా తిధివార నక్షత్రాల్ని చూసుకుని చూడాలట. చివరకు కన్న తల్లి అయినా, పెళ్లయిన కూతురు అయినా సరే, ఎంత అమానుషం. ఇక ఆ రోజు నుంచే ఆమె కుంకుమ ధరించడానికి వీల్లేదు. శుభకార్యాల్లో ముందు ఉండడానికి వీల్లేదు. రంగు చీరలు కట్టకూడదు. ఏ విధమైన అలంకరణ ఉండకూడదు. అయితే తన బాధ్యతలతో పాటు ఇకపై భర్త బాధ్యతలనూ తను మోయాల్సిందే. ఆ కష్టనష్టాలన్నీ తనవే కానీ తన ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనూ తాను సంతోషంగా భాగస్వామి కాలేదు. దూరంగా, పరాయి వ్యక్తిలా ఉండాల్సిందే. ఎప్పుడూ దిగులుగా, దుఃఖం గూడు కట్టుకున్న ముఖంతో ఉండాల్సిందే. విచిత్రం ఏమిటంటే అదే భార్య పోయిన భర్తకు ఈ నిబంధనలు లేవు కదా కుంకుమ బొట్టు కూడా దర్జాగా పెట్టుకోవచ్చు. శుభకార్యాల్లో అందరి మగవాళ్లతో పాటూ ఆయనకూ పెడతారు. చూడండి ఎంత వివక్షో. జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరై భవిష్యత్తు ఏమిటి? పిల్లల్ని ఎలా పెంచాలి ఈ కుటుంబ భారాన్ని ఎట్లా మోయాలి అని గుండెపగిలేలా రోధిస్తున్న ఆమెకు ఈ వితంతు ప్రక్రియ మరొక దుఃఖకారకమైనది.
ఈ మూర్ఖ ఆచారాలు ఎందుకు? ఆమె పరిస్థితి ఏమిటి? ఆలోచనలు ఏమిటి? అని కనీసం ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ఆవేదన కలిగించే అంశం. ఈ విషయంలో పిల్లలు కొంత చొరవ చూపినా ఆచారం, అరిష్టం పేరుతో వాళ్ల నోళ్లు మూయిస్తారు. తాను ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో నిర్ణయించుకునే అవకాశం అధికారం ఆమెకి ఉండాలి. ఆమె అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంలో ఆమె నిర్ణయాన్ని సమర్థించే కన్న పిల్లలు, తోబుట్టువులు, ఆత్మీయులు అండగా నిలవాలి. ఆడవాళ్లు భర్త కోసమే అందంగా అలంకరించుకోవాలి. భర్తలేని స్త్రీలు అలంకరణకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అందంగా అలంకరించుకున్న వితంతు స్త్రీలకు మగవాళ్లు ఆకర్షితులు అవుతారని, వాళ్ల సంసారాలు పాడైపోతాయని ఇలాంటి ఆచారం పెట్టారట. పరాయి మగవాడి కోసం, తమను తాము నియంత్రించుకోలేని అసమర్థుల కోసం మహిళలు వైధవ్యాన్ని స్వీకరించాలన్నమాట. మరి అలంకరణ లేని మహిళల వైపు బాల వితంతువుల వైపు మగవాడి దష్టి వెళ్లదు అని చెప్పిన పండితులు అమాయక మహిళలను, బాలికలను లోబరచుకుని గర్భం చేస్తే జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేలు ముందుపడి యువతులను ఎట్లా ప్రసవాలు చేశారు. ఆ పిల్లలు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా రక్షించారో మనం చదువుకున్నాం. అంటే అలంకరణ ఉన్నదా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా బాలికలు, స్త్రీలు మగవాళ్లు అనుభవించడానికి పుట్టారు అనేటువంటి అహంకారం, ఆధిపత్య ధోరణి తప్ప మరేం కాదు. నిబంధనలు, నియమాలు అన్ని ఆడవాళ్లకే అపరిమితమైన స్వేచ్ఛ, తప్పు చేసినా తప్పించుకునే వెసులుబాటు మగవాళ్లకు. ఇదీ మన భారతీయ సమాజంలో మనుధర్మం పేర ఏర్పాటు చేసిన సదాచారం అని చెప్తున్న దురాచారం.
ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా ఒకే రకమైన వస్త్రధారణ, ఒకే విధమైన ఆచార వ్యవహారాలు ఉండవు. అదే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం కదా . భారతీయ సమాజంలో అనేక కుటుంబాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియ ఏ మాత్రం మంచిదికాదు. అసలు ఆడపిల్లలకి కుంకుమ, పసుపు, పూలు, గాజులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు.
ఎప్పుడు మొదలవుతుంది
పాప పుట్టగానే పురిటినాడు బారసాల నాడు బొట్టు పెట్టడం ప్రారంభిస్తారు. బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు పాదాలకు గజ్జెలు పెడతారు. పాదాలకు పసుపుపెట్టి జుట్టు కట్టి పూలు పెడతారు. రంగురంగుల గాజులతో పిల్లలను అలంకరించి ఆనందిస్తారు. ఆ పద్ధతి పెద్దవాళ్లు అయిన తర్వాత చిన్న మార్పులతో కొనసాగుతూనే ఉంటాయి. పెండ్లి సందర్భంగా ఆడవాళ్లకు మాత్రం మంగళసూత్రం పేరుతో మెడలో పసుపుతాడు, పాదాలకు మెట్టెలుపెట్టి ఒక నిబంధన అంటారు. ఇక అనేక కారణాలు చెబుతుంటారు. మొగలాయిలు లేదా ఇక్కడ నిజం పరిపాలనా కాలంలో ఆడవాళ్ల మీద దాడులు చేస్తూ లైంగికదాడులకు పాల్పడేవారు కాబట్టి పెండ్లైనట్టు గుర్తులు ఉంటే వాళ్ల జోలికి ఎవరూ రారని, అందుకే పెండ్లి గుర్తులు అని చెప్తుంటారు. చరిత్రలో ఎక్కడైనా మహిళల మీద లైంగికదాడులు జరుగుతున్నటువంటి సందర్భాల్లో కులం, మతం, దేశం, జాతిగాని ఏమైనా అడ్డొచ్చాయా ఏవీ రాలేదు కదా. ఈ సందర్భంగా భర్త చనిపోయిన స్త్రీకి పెండ్లితో వచ్చినటువంటి పుస్తె, మట్టెలు తీయడంలో అర్థం ఉందనుకుందాం. కానీ బొట్టు, పసుపు కుంకుమలన్నీ తీయాల్సిన అవసరం ఏమి వచ్చింది. పూర్వకాలంలో ఉన్నత కుటుంబాల్లో లేదా అగ్రవర్ణాల్లో ఉండే ఆచారాలను ప్రస్తావించుకుంటే మరింత బాధగా ఉంటుంది. కానీ వాళ్లు కుటుంబాలు నడిపిన తీరుగానీ, ఆ తర్వాత కుటుంబ బాధ్యతను మోసిన తీరుగానేనీ, ఆ పిల్లల్ని, కుటుంబాన్ని, వద్ధులను చూసిన తీరుగాని అద్భుతం. ఒంటి చేత్తో కుటుంబాన్ని నడిపించినటువంటి మహిళలు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. కానీ ముఖ్యమైన కార్యక్రమాలు అన్నింటికీ దూరం పెట్టి, ివాళ్ల ఆనందాన్ని బలవంతంగా దూరం చేసి ఏం సాధించిందీ సమాజం. ఇప్పటికైనా కుటుంబాలు, మన చుట్టూ ఉన్న సమాజం శాస్త్రీయమైనటువంటి ఆలోచన పద్ధతుల్లో స్త్రీ పురుషుల సంబంధాలను గురించి గానీ, వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో, ఆచార వ్యవహారాల పేరుతో జోక్యం చేసుకొని వారి అభిప్రాయాలకు విలువనివ్వకుండా వాళ్ల మీద రుద్దడం మానుకోవాలి. సమాజం అభివద్ధి చెందుతూ ఎక్కడికో ఆకాశపు అంచుల్ని తాకుతున్న సందర్భంలో కూడా ఈ మూఢాచారాన్ని, మూర్ఖమైన ఆచారాన్ని పాటిస్తూ మహిళలను ఇంకా రెండవ శ్రేణిపౌరులుగాను, భర్త చాటున ఉండే భార్యలుగాను, తండ్రి చాటున ఉండే బిడ్డలు గానూ చూడకుండా స్త్రీ పురుషులు, బాలబాలికలు సమానం అనే స్పహ పెంచుకోవాలి. వాళ్ల సామర్థ్యాన్ని దేశాభివద్ధికి, సమాజాభివద్ధికి ఉపయోగించుకోవాలి. ఆ వైపుగా సమాజం, కుటుంబం, వ్యక్తులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే శాస్త్రీయ దష్టి అనేది చాలా అవసరం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి అభివద్ధి ఫలాలన్నింటినీ ప్రతిక్షణం, ప్రతినిత్యం ఉపయోగించుకుంటూనే మన ఆచార వ్యవహారాల్లో మాత్రం దాన్ని పాటించకపోవడం మన ద్వంద్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇది వాంఛనీయం కాదు.
మోతుకూరి సంయుక్త
9908924947