అందరూ మంచోళ్లే…

‘పోయినోళ్లందరూ మంచోళ్లు.. ఉన్నోళ్లందరూ వారి తీపిగురుతులు…’ అని అంటుంటారు మన పెద్దోళ్లు. దేశానికి అనేక సేవలు చేసి, మంచి పేరు సంపాదించుకుని ఇటీవల మన నుంచి దూరమైన పెద్దోళ్ల గురించి మొన్నామధ్య తెలంగాణ భవన్‌లో చర్చ నడిచింది. ఆ సందర్భంగా ఆ భవన్‌ ఇన్‌ఛార్జి రావుల చంద్రశేఖరరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా తనకున్న అనుభవాలను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జర్నలిస్టులతో పంచుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆయన గుర్తు చేసుకుంటూ… ‘నేను టీడీపీ తరపున 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను. ఆ పదవికి వీడ్కోలు పలికే సందర్భంలో… తెలుగుకు ప్రాచీన హోదా రాకపోవటం, దేశంలోని ప్రజలందరికీ విద్యనందించలేక పోవటం, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం కల్పించలేకపో వటమనేవి ఈ కాలంలో చేయలేకపోయాం. ఇది బాధాకరం. ఇది తప్ప నా పదవీ కాలమంతా సంతృప్తిగానే సాగిందంటూ నేను నా ప్రసంగాన్ని ముగించాను. అప్పుడు ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ముగింపు ఉపన్యానమిస్తూ… రావుల తన చివరి ప్రసంగంలో కూడా ప్రజా సమస్యల్నే ప్రస్తావించారు. వెరీగుడ్‌… అంటూ నన్ను ప్రశంసించారు…’ అని చంద్రశేఖరరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయనే కొనసాగింపుగా… ‘మన్మోహన్‌ ఎంత మంచోడో…’ అంటూ వ్యాఖ్యానించారు. ఎదురుగా ఉన్న పొన్నాల అందుకుంటూ… ‘మంచోళ్ల గురించి మంచోళ్లు ఎప్పుడూ మంచిగానే చెబుతారు…’ అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. ఆ వెంటనే రావుల ప్రతిస్పందిస్తూ… ‘ఇలాంటి మంచి విషయాలను మీలాంటి మంచివాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు…’ అంటూ వ్యాఖ్యానించటంతో అక్కడ నవ్వుల పువ్వులు విరిశాయి. అవి కంటిన్యూ అవుతుండగానే ఓ పాత్రికేయ మిత్రుడు అందుకుని… ‘ఇలాంటి మంచి విషయాలను మీలాంటి మంచి వాళ్లు చెబుతుంటే.. మా లాంటి మంచి వాళ్లే వింటారు…’ అనటంతో జర్నలిస్టులతోపాటు రావుల, పొన్నాల, అక్కడున్న మిగతా వారందరూ మరోసారి నవ్వుల్లో మునిగితేలారు. సో… అందరూ మంచోళ్లే…
-బి.వి.యన్‌.పద్మరాజు