కనువిప్పు

open your eyesఆనంద్‌ పదవ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా స్నేహితులతో ఆడుతూ, తిరుగుతూ పాఠశాలకు గైర్హాజర్‌ అవుతూ ఉండేవాడు. ఆనంద్‌ తండ్రి బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. ఈ మధ్యకాలంలో తన భార్య పిల్లలతో మాట్లాడడానికి బంధువులతో సెల్‌ఫోన్‌ పంపించాడు. ఇదే ఆనంద్‌ను మరీ సోమరిగా తయారు చేసింది. ఆ మోజులో పడి ఆనంద్‌ పాఠశాలకు వెళ్లకుండా, హోంవర్క్‌ చేయకుండా వుండేవాడు. రాత్రింబవళ్లు ఆ సెల్‌ఫోన్‌లో రకరకాల గేమ్‌లు ఆడుతుండేవాడు. దాని ప్రభావంతో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. వేసవి సెలవుల్లో దుబారులో ఉంటున్న ఆనంద్‌ తండ్రి తన ఇంటికి చేరుకున్నాడు.
తన కుమారుడు ఆనంద్‌ పదవ తరగతి ఫెయిల్‌ అయ్యాడని తెలుసుకొని బాధపడ్డాడు. దానికి గల కారణాలను కూలంకషంగా తెలుసుకున్నాడు. ఒకరోజు ఆనంద్‌ను పిలిచి ప్రేమగా తన పక్కన కూర్చుండ పెట్టుకున్నాడు. ”చూడు ఆనంద్‌ బతుకుదెరువు కోసం నేను మీకందరికీ దూరంగా దుబాయిలో బతుకుతున్నాను. మీతో మాట్లాడడానికి సెల్‌ఫోన్‌ పంపించాను. ఇది అందరికీ అవసరం కూడా. కానీ నువ్వు చదువుకునే విద్యార్థివి. అదేపనిగా సెల్‌ఫోన్‌లో రకరకాల గేమ్‌లు ఆడుతూ, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. అంతేకాకుండా నీ బంగారు భవిష్యత్తును నువ్వే నాశనం చేసుకున్నావు. నీ స్నేహితులందరూ బాగా చదివి మంచి మార్కులతో పదవ తరగతి పాస్‌ అయ్యారు.
చూడు ఆనంద్‌ నేను చిన్నప్పుడు నీలాగే సరిగా చదవకుండా ఆటపాటలతో కాలక్షేపం చేశాను. మా తల్లిదండ్రులు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. అందుకు నేను ఇప్పుడు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాను. బతుకు తెరువు కోసం దుబారుకి వెళ్లి అష్టకష్టాలు పడుతున్నాను. నాలాగే నీ జీవితం కాకూడదనే ఉద్దేశంతో నిన్ను చదివిస్తున్న. బాగా చదివి ఉద్యోగం సంపాదించి మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకున్నాం. మా కండ్ల ముందే ఉంటావని ఆశపడ్డాం. కానీ నీవు మా ఆశలను అర్థం చేసుకోకుండా నీకు నచ్చినట్టు ప్రవర్తించావు. ఇకనైనా నీ తప్పును తెలుసుకొని బాగా చదువుకో”మని తండ్రి సుతిమెత్తగా వారించాడు.
ఆనంద్‌ తండ్రి మాటలకు కండ్లల్లో నీళ్లు తిరిగాయి. పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ల మీద పడ్డాడు. ‘నాన్న మీ మాటల వల్ల నాకు ‘కనువిప్పు’ కలిగింది. నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాను. ఇక నుంచి మీరు ఆశించినట్టు బాగా చదివి ఉద్యోగం సంపాదిస్తా’నని తండ్రికి మాటిచ్చాడు. తన మాటలు ఆనంద్‌కు బాధ కలిగించి, చివరికి అతనికి కనువిప్పు కలగడం ఎంతో సంతోషం ఇచ్చింది. తన తండ్రి ఆశించినట్టు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు.
– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105