కొందరి పనులు పరేషాన్ ఉంటయి. మనిషి ఎప్పుడు చూసినా బిజీగా కనబడతాడు. ఏదో ఒక పని చేస్తున్నట్టే కనబడతారు. కానీ అత్యవసరమైన సమయానికి పైసలు కనబడయి.
కొన్ని వత్తులు అట్లనే ఉంటాయి. ‘పేరు పెద్దిర్కం ఊరు పేదరికం’ అన్నట్టు కనిపిస్తది. వీళ్లను చూసి పుట్టిన సామెత ‘గడియ తీరిక లేదు దమ్మిడీ రాకడ లేదు’ వీళ్లు ఎప్పుడు చూసినా లొల్లి లొల్లి కనిపిస్తరు. వీళ్ల పని ఎట్లా ఉంటదంటే ‘అదిగో పులి అంటే తోక బారెడు’ అన్నట్టు ఉంటది. అసలు పులినే చూడరు తోక కనబడ్డది అంటరు. ఏ పనిలో కుదిరినా గాని దాని లోతు తెలుసుకోవాలి. లేకుంటే ఆగమాగం అవుతారు. ఏదైనా ‘ఇల్లు అలకగానే పండుగ కాదు’ అసలు పండుగకు ముందు అలుకుడు మొదటి పని ఆ తర్వాత ఇంకా ఎన్నో పనులు ఉంటాయి. ఏ పని అయినా సమర్థవంతంగా చేయాలి . లేకుంటే చేతులు కాలుతాయి. ‘ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కమిరి పోయినట్టు’ అనే సామెత ఉండనే ఉన్నది. మన దీపమే అంటే దాని పని అది చేస్తూనే ఉంటది. కొందరు ఏకకాలంలో రెండు పనులు అయ్యేట్టుగా ఆలోచిస్తారు. వాళ్ల పనులను చూసి ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అని అభినందిస్తారు.
అంటే ఒక్కసారి సూటి పెడితే రెండు పిట్టల పడ్డట్టు అని అర్థం. జీవితంలో సామెతలు ఒక జీవన వాస్తవికత.
జానపదులు తరతరాలుగా తాత్విక ఆలోచనా పరులు. ఆయా కాలాల్లో పుట్టిన సామెతలు ఇప్పుడు వర్తించవచ్చు వర్తించకపోవచ్చు. కానీ ఇది ఒక పల్లె ప్రజల ఆలోచనా చైతన్యం.
– అన్నవరం దేవేందర్, 9440763479