స్నేహం కోసం!!

స్నేహం కోసం!!అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరికి ఆనుకొని పొదల్లో ఒక పాము, ముంగిస స్నేహంగా ఉండేవి. సహజంగా పాము, ముంగిసలకు పడదు. కానీ ఇవి రెండు ప్రాణ స్నేహితుల్లా ఉంటాయి. అవి రెండు స్నేహంగా ఉండడం చూసి అన్ని జంతువులూ అసూయపడేవి. లోపల బాగా కుళ్లుకొనేవి. కానీ పాము ముంగిసలు ఇవేవీ పట్టించుకొనేవి కాదు. ఒకరోజు పాము దారిలో వెళుతుండగా ఒక బాటసారి కళ్లలో పడింది. వెంటనే అతడు పాము… పాము… అని గట్టిగా కేకలు వేశాడు. అది విని చుట్టుపక్కల వారు కర్రలు తీసుకొని పరుగెత్తుకొచ్చారు. పాము ఎక్కడుందని బాటసారిని అడిగారు. ఇదిగో ఇటునుంచే వెళ్లిందని చెప్పాడు బాటసారి. కొంతమంది అటువెళ్లి వెతకడం మొదలు పెట్టారు. పాము మెల్లిగా అక్కడున్న ఒక రంధ్రంలోకి దూరింది.
ముంగిస.. నా మిత్రుడు పాము ఇంకా రాలేదని వెతుకుతూ అటువైపు వస్తుంది. అక్కడ కర్రలు పట్టుకున్న వాళ్లు పాము ఇదిగో ఈ రంధ్రంలోకి పోయిందని మాట్లాడుతున్న మాటలు విని తన మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడని అర్థమైన ముంగిస పామును ఎలాగైనా కాపాడాలని అనుకుంది. అయితే పాము కోసం వెతికితే ఇదిగో మన కోడిపిల్లలను తినే ఈ ముంగిస వచ్చింది. ముందు దీని సంగతి చూద్దాం అని కర్రలతో ముంగిసను చంపబోతారు.
లోపల రంధ్రంలో ఉన్న పాము ”నా నేస్తం ముంగిసను, వీళ్లను కాటేసైనా కాపాడాలి” అనుకొని బయటికి వచ్చేస్తుంది. వెంటనే అక్కడున్న కొంతమంది పామును కర్రలతో చంపేశారు. మరికొంతమంది ఇటు ముంగిసను చంపుతారు. ఒకరిని కాపాడాలకొని ఒకరు స్నేహం కోసం తమ ప్రాణాలు కోల్పోయారు. నిజమైన స్నేహితులు ఆపదలో ప్రాణాలకైనా తెగిస్తారు అనేది ఈ కథలోని నీతి.

– కె.ప్రణీత్‌,
9వ తరగతి, జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల,
పూడూర్‌, వికారాబాద్‌ జిల్లా