అనధికారిక సెక్యూరిటీ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోండి..

Take action against unauthorized security agencies– సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ…
నవతెలంగాణ – బంజారా హిల్స్
 రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్,చైర్మన్ డి ఎస్ రెడ్డిలు మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీ ఉన్నాయని చెప్పారు.ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రణాళికా బద్దంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్ లను ఇష్టానుసారుగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘటనలో మహిళా మృతి చెందడం తీవ్ర విచారకరమని అన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ వ్యవస్థపై నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించిన అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గత ఎంతో కాలంగా ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ ఒకే యూనిఫామ్ ను ఆమోదించాలని కోరుతున్నామని చెప్పారు. గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థకు తోడ్పాటును ఇవ్వాలని కోరారు.