– సిడ్నీలో విరాట్ కోహ్లికి కఠిన సవాల్
– కోహ్లి బలహీనతపై ఆసీస్ సీమర్ల దెబ్బ
– రేపటి నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు
డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉండాలని ప్రతి జట్టు స్వప్నించిన ఆటగాడు. అతడు క్రీజులో ఉంటే విజయంపై సొంత జట్టుకు ఎనలేని దీమా. అతడే ప్రపంచ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి. మైదానంలో విరాట్ కోహ్లి ఉత్సాహంలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ బ్యాట్‌తో అతడి గణాంకాలే తీసికట్టుగా మారుతున్నాయి. ప్రత్యర్థి బౌలర్లు అతడి వికెట్ కోసం శ్రమించాల్సిన అవసరం లేకుండా పోతుంది. కొత్త ఏడాదిలోనైనా పాత విరాట్ కోహ్లిని చూడగలమా?!.
నవతెలంగాణ క్రీడావిభాగం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి తనదైన ముద్ర వేశాడు. ఆరేండ్ల క్రితం పెర్త్‌లో హీరోయిక్ ఇన్నింగ్స్‌తో క్రికెటర్లను, అభిమానులను, వ్యాఖ్యాతలను, విమర్శకులను మంత్రముగ్ధులను చేశాడు. విరాట్ కోహ్లి క్రీజులో ఉంటే ఏదైనా సాధ్యమే అనే నమ్మకం కలిగించాడు. కంగారూ గడ్డపై విరాట్ కోహ్లి నమ్మశక్యం కాని ప్రదర్శనలతో భారత్‌ను ముందుండి నడిపించాడు. 2024 ఏడాది ఆరంభంలోనూ సఫారీ బ్యాటర్లు 55 పరుగులకు కుప్పకూలిన పిచ్‌పై విరాట్ 46 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ గమనాన్ని మార్చివేయటంలో కోహ్లిది విస్మరించలేని పాత్ర. బ్యాట్‌తో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిపత్యం చూపించటంతో పాటు మైదానంలో అతడి ఉత్సాహభరిత హావభావాలు స్టేడియాన్ని హోరొత్తిస్తాయి. విరాట్ కోహ్లి వంటి ఆటగాడు తమ జట్టులోనూ ఉండాలని ప్రతి జట్టు స్వప్పించే స్థాయికి ఎదిగాడు. కానీ, ఓ బలహీనతను జయించలేక అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తూ.. ప్రత్యర్థి శిబిరంలో చులకన అవుతున్నాడు. సొంత జట్టుకు భారంగా మారే దుస్థితికి చేరుకుంటున్నాడు!!.ఔ
ఒకే తరహాలో..
విరాట్ కోహ్లి 122 టెస్టులు ఆడాడు. 47.21 సగటుతో 9207 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా నిలిచేందుకు పోటీపడుతున్న కోహ్లి.. ఒక్క బలహీనతకు బలవుతున్నాడు. ఆఫ్ స్టంప్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్ కోల్పోతున్నాడు. విరాట్ బలహీనతను ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. విరాట్ కోహ్లి అమ్ములపొదిలో చూడచక్కని షాట్ డ్రైవ్. ఆ డ్రైవ్ షాట్లు ఆడేందుకు వికెట్‌కు దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడటం కోహ్లికి బలహీనంగా మారింది. సాఫ్ట్ హ్యాండ్స్‌తో డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. వికెట్ల వెనకాల, స్లిప్ కారిడార్‌లో క్యాచులు ఇస్తూ పెవిలియన్‌కు చేరుతున్నాడు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి నాలుగు టెస్టుల్లోనూ ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఆరు సార్లు విరాట్ అవుట్ అయ్యాడు. ఈ ఆరు సార్లు సైతం ఒకే తరహాలో కోహ్లి నిష్క్రమించటం గమనార్హం. బలహీనతను సరిదిద్దుకునే ప్రయత్నం మానేసిన కోహ్లి.. అదే పొరపాటును పునరావృతం చేస్తున్నాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 100 పరుగులు చేసిన కోహ్లి.. ఆ తర్వాత పూర్తిగా నిరాశపరిచాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 167 పరుగులు చేశాడు. అందులో శతక ప్రదర్శన మినహాయిస్తే.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు 67 మాత్రమే. మెల్‌బోర్న్‌లో 36, 5.. బ్రిస్బేన్‌లో 3, ఆడిలైడ్‌లో 7, 11 పరుగులే సాధించాడు. నాలుగు టెస్టుల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు 27.83. ఇందులో సెంచరీ మినహాయించి చూస్తే గణాంకాలు మరీ దారుణంగా ఉంటాయి.
పాత కోహ్లిని చూస్తామా?
ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఒడిదొడుకులు సహజం. సుదీర్ఘ కాలం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఇప్పుడిప్పుడే లయ తప్పుతున్నాడు. ఎవరూ ఆడిన ప్రతి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడలేరు. కోహ్లి ఇందుకు మినహాయింపు కాదు. కానీ కోహ్లి వికెట్ కోల్పోతున్న తీరు అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. క్రీజులో పరుగుల వేటలో మంచిగా కనిపిస్తున్నా.. ఆ బలహీనతకు బానిస అవుతూ నిష్క్రమిస్తున్నాడు. కోహ్లి వంటి మేటి బ్యాటర్‌కు ఇటువంటి చిన్న తప్పిదాలను అధిగమించటం పెద్ద సమస్య కాదు. అయినా, కోహ్లి ఎందుకు ఈ అంశంలో వేగంగా ముందుకు సాగటం లేదో అర్థం కావటం లేదు. కొత్త ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇది ఆఖరు అవకాశం. సిడ్నీ టెస్టులో భారత్ నెగ్గితేనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియా సొంతమవుతుంది. లేదంటే, దశాబ్దాం తర్వాత ఆసీస్ గూటికి చేరటం ఖాయమే. కొత్త ఏడాదిలో పాత కోహ్లిని బ్యాట్‌తో చూపిస్తే… కుర్రాళ్ల సాయంతో సిడ్నీ టెస్టులో విజయం సాధ్యమే. లేదంటే, విరాట్ కోహ్లి కెరీర్‌లో ఈ సిరీస్ ఓ మాయని మరకగా నిలువటం ఎవరూ మార్చలేరు.
ఆ ఇద్దరు సైతం
భారత బ్యాటింగ్ లైనప్‌లో మరో ఇద్దరు కీలక బ్యాటర్లు సైతం నిలకడగా విఫలం అవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో కలిపి 31 పరుగులే చేశాడు. బ్యాటింగ్ సగటు 6.20 మాత్రమే. టెయిలెండర్లు ఆకాశ్ దీప్ సైతం రోహిత్ కంటే మెరుగైన కలిగి ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాలుగు మ్యాచుల్లో 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 37. బ్యాటింగ్ సగటు 22.00. యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ భారం మోస్తున్నారు. రోహిత్, పంత్, కోహ్లి మెరిస్తే.. ఆసీస్‌కు సిడ్నీలో చుక్కలు చూపించవచ్చు!.