3,4 వారాల్లో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తి

– మొదట ఎస్‌ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదల
– సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ట్రైనింగ్‌కు
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు జరుగుతున్న నియామక ప్రక్రియను మూడు, నాలుగు వారాల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో మొదట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించనుంది. రాష్ట్రంలో 550 ఎస్‌ఐ పోస్టులు, 17 వేల కానిస్టేబుళ్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో తుది రాత పరీక్షలో 1.50 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వయోపరిమితి, విద్యార్హతలకు సంబంధించిన లోపాల కారణంగా చాలా మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతం 97,177 మంది అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయింది. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా? వారి వయోపరిమితి సరిగ్గా పొందుపర్చారా? లేదా? అనే అంశాలను అధికారులు మరోమారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిసింది. కొందరు అభ్యర్థులకు సంబంధించిన వివరాలు సందేహాత్మకంగా ఉండటంతో దాదాపు 18 జిల్లాల నుంచి వారి ధ్రువపత్రాలను తెప్పించుకుని వాటిని పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కటాఫ్‌ మార్కులను నిర్ణయించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడానికి కొంత సమయం పట్టేటట్టు ఉందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తర్వాత జిల్లాల వారీగా స్పెషల్‌ బ్రాంచి పోలీసుల ద్వారా వారి చిరునామా, వారిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయా? లేదా? అనే విచారణను చేయనున్నారు. మొత్తం మీద ఎంపికైన కొత్త ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌ అభ్యర్థులను సెప్టెంబర్‌, అక్టోబర్‌ నాటికి ట్రైనింగ్‌కు పంపించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.