
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పిఓడబ్ల్యు, పివైఎల్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ,ప్రయివేటు హాస్పిటల్స్ లలో సర్వే నిర్వహించి గురువారం సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోట చలం కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక పోవడంతో ప్రజలు తప్పని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.టెస్టుల పేరుతో, మందుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లపై మెడికల్ మాఫియాపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్స్ పోస్టులు భర్తీ చేయాలి అన్నారు.హాస్పిటల్స్ లో అన్నిరకాల వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నూ కలెక్టర్ గారు ఎన్ని సార్లు సందర్శించిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా హాస్పిటల్ లో సౌకర్యాలు,సిబ్బంది పనితీరు ఉంది అన్నారు.దీని వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.తక్షణమే హాస్పిటల్స్ లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రాథమిక, ఏరియా హాస్పిటల్స్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహయ కార్యదర్శి సంతోషి మాత, కోశాధికారి జయమ్మ,పివైఎల్ నాయకులు జాన్ సుందర్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్ రమేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.