మను, గుకేశ్‌ ఖేల్‌ రత్నాలు

Manu and Gukesh Khel are gems– హర్మన్‌ప్రీత్‌, ప్రవీణ్‌లకు సైతం..
– దీప్తి జీవాంజికి అర్జున పురస్కారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
2024లో భారత ఖ్యాతిని రెట్టింపు చేసిన క్రీడాకారులను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌ రత్న వరించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించిన మను బాకర్‌, ప్రపంచ చెస్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ సహా హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌లు 2024 మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డులను దక్కించుకున్నారు. క్రీడా అవార్డుల సెలక్షన్‌ కమిటీ సిఫారసుల మేరకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ అవార్డుల విజేతలను గురువారం ప్రకటించింది. పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజి అర్జున అవార్డుకు ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్ప్రింటర్‌ జ్యోతి ఎర్రాజి సైతం అర్జున పురస్కారానికి ఎంపికైంది. 32 మంది అర్జున అవార్డుకు ఎంపిక కాగా.. 17 మంది పారా అథ్లెట్లు కావటం విశేషం. ఖేల్‌ రత్న విజేతకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు విజేతలకు రూ.15 లక్షల చొప్పున నగదు బహుమతి దక్కుతుంది. జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో జరుగబోయే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రెసిడెంట్‌ ద్రౌపది ముర్ము అందజేయనున్నారు.
22 ఏండ్ల మను బాకర్‌ ఓ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నిలిచింది. పారిస్‌లో 10మీ ఎయిర్‌ పిస్టల్‌, 10 మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మను కాంస్య పతకాలు సాధించింది. ఖేల్‌ రత్న అవార్డుకు మను బాకర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవటం లేదని వార్తలు రాగా.. తాజాగా అవార్డుల జాబితాలో ఆమె నిలిచింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టును హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ముందుండి నడిపించాడు. ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా వరుసగా రెండో కాంస్య పతకం సాధించింది. 18 ఏండ్ల గుకేశ్‌ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా నిలిచాడు. చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించి చదరంగం రారాజుగా అవతరించాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ హైజంప్‌లో టీ64 ఈవెంట్‌లో పసిడి పతకం సాధించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించిన పారా షూటర్‌ అవనీ లేఖర అత్యున్నత క్రీడా పురస్కారం జాబితాలో చోటు సాధించలేదు.
క్రీడా పురస్కార విజేతలు:
మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న: దొమ్మరాజు గుకేశ్‌ (చెస్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (హాకీ), ప్రవీణ్‌ కుమార్‌ (పారా అథ్లెటిక్స్‌), మను బాకర్‌ (షూటింగ్‌).
అర్జున అవార్డులు: జ్యోతి ఎర్రాజి (అథ్లెటిక్స్‌), అన్ను రాణి (అథ్లెటిక్స్‌), నీతు (బాక్సింగ్‌), సవీటీ (బాక్సింగ్‌), వంటిక అగర్వాల్‌ (చెస్‌), సలీమ టెటె (హాకీ), అభిషేక్‌ (హాకీ), సంజరు (హాకీ), జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), సుఖ్‌జిత్‌ సింగ్‌ (హాకీ), రాకేశ్‌కుమార్‌ (పారా ఆర్చరీ), ప్రీతీ పాల్‌ (పారా అథ్లెటిక్స్‌), దీప్తి జీవాంజి (పారా అథ్లెటిక్స్‌), అజీత్‌ సింగ్‌ (పారా అథ్లెటిక్స్‌), నవదీప్‌ (పారా అథ్లెటిక్స్‌), నితీశ్‌ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌), తులసిమతి మురుగేశన్‌ (పారా అథ్లెటిక్స్‌), నిత్య శ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌), మనీశ్‌ రామదాస్‌ (పారా బ్యాడ్మింటన్‌), కపిల్‌ పర్మార్‌ (పారా జూడో), మోన అగర్వాల్‌ (పారా షూటింగ్‌),రూబిన ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌), స్వప్నిల్‌ సురేశ్‌ కుశాలె (షూటింగ్‌), సరబ్జోత్‌ సింగ్‌ (షూటింగ్‌), అభరు సింగ్‌ (స్క్వాష్‌), సాజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), ఆమన్‌ సెహ్రావత్‌ (రెజ్లింగ్‌).
అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌): సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారామ్‌ (పారా స్విమ్మింగ్‌).
ద్రోణాచార్య అవార్డు: సుభాశ్‌ రానా (పారా షూటింగ్‌), దీపాళి దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ).
ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్‌): ఎస్‌ మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌), ఆర్మాండో (ఫుట్‌బాల్‌).