అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మైదానాలు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో క్రీడా మైదానాలను సిద్ధం చేస్తు న్నామని మంత్రులు వి శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 1988 ఒలంపిక్స్‌ క్రీడల సందర్భంగా నిర్మించిన క్రీడా మైదానాలను పరిశీలించినట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో ఒలంపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు దేశానికి అవకాశం వస్తే ఆ క్రీడలను రాష్ట్రంలో నిర్వహించేందుకు మైదానాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడి నుంచి దేశానికి ఎక్కువ మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 17వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించామని పేర్కొన్నారు. మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం లాంటి పట్టణాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కప్‌ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గోల్ఫ్‌ కోర్టు పేరుతో షామీర్‌ పెట్‌ లో 230 ఎకరాల భూమి లీజుకు తీసుకున్న సంస్థపై నిబంధనలు పాటించని కారణంగా న్యాయ పోరాటం చేసి లీజును రద్దు చేసి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో క్రీడా కారులను ప్రోత్సహించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. ఈ పర్యటనలో తెలంగాణ పర్యాటక శాఖ ఎమ్‌డీ మనోహర్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వి కర్ణన్‌ పాల్గొన్నారు.