
– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
సమగ్ర సర్వ శిక్షా అభినయ్ ఉద్యోగుల సమ్మె శిబిరానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్పటివరకు పే-స్కేల్స్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం రూ.10 లక్షలు కల్పించాలని, రిటైరైన ఉద్యోగులకు రూ.25 లక్షలు బెనిఫిట్స్ క్రింద ఇవ్వాలని ప్రభుత్వ విద్యా శాఖ నియామకాలలో వెయిటేజి కల్పించాలని, పిటిఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం 2024 డిశంబర్ 10 నుండి ప్రారంభమైన సమ్మె గత 25 రోజులుగా ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీరి డిమాండ్లను పరిష్కరించకపోవడం చాలా అన్యాయం. విద్యా శాఖలో అతి తక్కువ వేతనాలతో ఎంతగానో శ్రమిస్తున్న సమగ్ర సర్వ శిక్షా అభియాన్ మరియు సిఆర్పి సిబ్బందిని ప్రభుత్వం చిన్న చూపు చూడటం సరికాదు. ఈ సమ్మె వల్ల పేద విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందిని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధ్యతారాహిత్యం. కావున ఈ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, సమ్మెను విరమింపజేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వ వైఖరి వల్ల ఈ సమ్మె మరింత జఠిలమైతే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఐటియు హెచ్చరిస్తున్నది. విద్యా శాఖలో సమగ్ర సర్వ శిక్షా అభియాన్ మరియు సిఆర్పి ఉద్యోగులతో గత ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారినికొచ్చి సంవత్సరం పూర్తయినా ఈ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సిబ్బంది ఉద్యోగాల్లో చేరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తయింది. 20 సం॥లకు పైగా సీనియారిటీ ఉండి కూడా వీరికి గౌరవప్రదమైన వేతనం లేకపోవడం గత ప్రభుత్వాల యొక్క నిర్లక్షమే ప్రధాన కారణం. రోజుకు 12 గంటలకు పైగా శ్రమిస్తున్నారుప్రత్యేకమైన జాబ్ చార్ట్ లేదు. విద్యా శాఖలోని ఉన్నతాధికారుల తీవ్రమైన వేధింపులున్నాయి. ఇన్ని కష్టాల నడుమ సమగ్ర సర్వ శిక్షా అభియాన్ సిబ్బంది ఉద్యోగాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. ఈ సిబ్బందిలో సగానికి | పైగా మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు.విద్యా, వైద్య రంగాల్లో ఉన్న అనేక స్కీమ్లకు (పథకాలకు) కేంద్ర బిజెపి ప్రభుత్వం నిధులు ప్రతి సంవత్సరం పెంచకుండా వివక్ష చూపుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వైద్య ఆరోగ్య రంగంలోని అనేక స్కీముల్లోని సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా, సమాన పనికి – సమాన వేతనం చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వమే అన్యాయం చేస్తున్నది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ విద్యా శాఖలో అంతర్భాగమే. కావున సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు జఠిలం కావడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వ పాత్ర కూడా ముఖ్యమైనదే.రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని, ప్రజా పాలన అని అనేక తియ్యటి మాటలు చెబుతున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లనే సంవత్సర కాలం నుండి ఓపిక పట్టి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరి వల్లనే సమ్మె తలపెట్టాల్సి వచ్చింది. ఈ సమ్మెకు కేంద్ర బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోకుండా మన పోరాటాన్ని ముందుకు సాగించలేం. విడివిడిగా జరిగే పోరాటాల వల్ల ప్రభుత్వాలు దిగి రావు. అందుకే అన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది మూకుమ్మడిగా ఉద్యమ బాట పట్టి హక్కులు సాధించుకోవడమే సరైన పరిష్కారమని సిఐటియు తెలియజేశారు. ఇరవై రోజులకు పైగా శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యోగుల సమ్మె డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సిఐటియు కోరుతున్నది. జాప్యం జరిగిన ఎడల జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఐటియు హెచ్చరిస్తున్నది. న్యాయమైన ఈ సమ్మెకు రాష్ట్రంలోని యావత్ కార్మికవర్గం అండగా నిలవాలని, సమస్య పరిష్కారమయ్యేంత వరకు సమగ్ర శిక్షా ఉద్యోగులు సమరశీలంగా ఉద్యమించాలని సిఐటియు కోరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ నూర్జహాన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నేసావ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.