సమాజాన్ని మారుద్దాం.. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం

Let's change the society.. Let's shape the future of children– ప్రయివేటులో ఎల్‌కేజీ చదువుకు లక్షల రూపాయలు
– అందుకే అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించాం : జిల్లా సంక్షేమ అధికారుల సమీక్షలో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘సంక్షేమ శాఖలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులే మా ప్రభుత్వానికి కలెక్టర్లుగా భావిస్తున్నాం. పేదలు, వెనుకబడిన వారికి సేవ చేసే అవకాశం మీకు కలిగింది. వారి సంక్షేమాన్ని చూసే బాధ్యత మీదే. మీరు మారండి. మనమంతా సమాజాన్ని మారుద్దాం. చిన్నారుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుదాం’ అని జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ(సీతక్క) ఉద్బోధించారు. ప్రయివేటు స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ చదువులకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారనీ, ఈ కారణంతోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్య అందించి తల్లిదండ్రులపై భారం తగ్గించాలనే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మధురానగర్‌ లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో డిడబ్ల్యూఓలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రతి అంగన్‌వాడీకేంద్రంలోనూ గంట ఏర్పాటు చేయాలనీ, ఉదయం 9 గంటలకు బెల్‌ మోగించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో డీడబ్ల్యూఓలు సమావేశాలు నిర్వహించి లోటుపాట్లపై నివేదికలు సమర్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి నిధులను అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాల కోసం వెచ్చించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలని సూచించారు. చిన్నారులే ఈ దేశం భవిష్యత్తు అనీ, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత డీడబ్ల్యూఓలదేనని నొక్కి చెప్పారు. అధికారులంతా తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. జిల్లాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని చెక్‌చేయాలని ఆదేశించారు. పిల్లలకు అందించే పోషకాహారాన్ని మరింత మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సాంకేతిక కారణాలు, న్యాయపర చిక్కులతో మూతపడ్డ అంగన్‌వాడీ కేంద్రాలను తక్షణమే తెరిపించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మహిళాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌ ఉమెన్‌ బండ్రు శోభ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మెన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ కాంతి వెస్లీ, వికలాంగుల సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శైలజ, 33 జిల్లాల డీడబ్ల్యూఓలు, తదితరులు పాల్గొన్నారు.