మార్పు

changeమన జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఆ మార్పు వచ్చినప్పుడు దాన్ని ఎలా తెలుసుకోవాలి? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తూనే ఉంటాయి. అయితే పరిస్థితుల ప్రాబల్యం వల్ల మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో, చివరికి మన జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ మారుతున్న పరిస్థితులు మనకు సంతోషం కలగజేసేవి అయితే, వీటి వల్ల మనలో హటాత్తుగా వస్తున్న మార్పులు మనం గమనించకపోవచ్చు. కాని మన చుట్టుపక్కల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా గమనించే అవకాశం ఉంది. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మారుతున్న పరిస్థితులు మనకు ఇబ్బందికరమైనవి, కష్టదాయకమైనవి, బాధాకరమైనవి అయినప్పుడు మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో, మన జీవితాల్లో వచ్చిన, వస్తున్న మార్పులను మనం తప్పనిసరిగా తెలుసుకుంటూనే ఉంటాం. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో రాబోతున్న మార్పులను మనం ముందుగానే అంచనా వేయగలుగుతాం.
మన తల్లితండ్రులు మన వ్యక్తిత్వాన్ని చాలా వరకు రూపుదిద్దితే, మన కుటుంబ పరిస్థితులు, మన ఇంటి వాతావరణం, మన బంధువులు, స్నేహితులు, అలాగే మన చుట్టూ ఉన్న ఇకోసిస్టం మన ఆలోచనలనూ, మాటతీరునూ, పనితీరునూ, స్పందనా వైఖర్లనూ ఇంకా ఇలాంటివి చాలా, మనం జాగ్రత్తగా గమనించని మన సూక్ష్మ లక్షణాలను ఎంతోకొంత ప్రభావితం చేస్తాయి. ఇవేకాక మన జీవితపు ఎదుగుదల దశల్లో జరిగిన, జరుగుతున్న సంఘటనలు కూడా మనలను నిరంతరం కొద్ది కొద్దిగా మారుస్తూనే ఉంటాయి. అయితే ఈ మార్పులు అల్పకాలపు వ్యవధుల్లో గమనించడానికి వీలు కానివి. ఇవి దీర్ఘకాలానికి చెందినవి కాబట్టి కొన్నేండ్ల తర్వాత మీరే ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుని నిజాయితీగా అంతరావలోకనం చేసుకుంటే ‘అవునా, నేను ఇంతగా మారిపోయేనా’ అని మీకే అనిపించవచ్చు.
జీవితంలో పైకెదగాలనుకున్న ప్రతీ వ్యక్తీ తన కోసం కొన్ని ఆశయాలూ, ఆకాంక్షలూ, కొన్ని టార్గెట్లూ నిర్ధారించుకుంటాడు. వీటిని చేరుకోవడానికి సరైన తోవ, దశలవారీగా తను చేరుకోవలనుకున్న మైలురాళ్ళూ వగైరాలను కూడా తయారు చేసుకుంటాడు. ఈ కార్యసాధనా మార్గంలో తన శక్తి-యుక్తులనూ, తన సామర్థ్యాలు-పరిమితులూ వగైరాలను బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ విశ్లేషణ ద్వారా తన ఆలోచన, మాట, ఆచరణలలో తాను చేసుకోవలసిన మార్పుల గురించి ప్రణాళికలు వేసుకుంటాదు. ఆవిధమైన మార్పులు చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు.
పెట్టుకున్న టార్గెట్లు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. చదువుకుంటున్న ఇరవై ఏండ్ల యువకుడు ‘నేను ఎలాగైనా సరే ఐ.ఏ.ఎస్‌ అయి తీరాలి’ అనుకోవచ్చు. లేదా బద్ధకిష్టు అయిన యాభై ఏండ్ల పెద్దాయన ‘నేను రోజూ ఉదయాన్నే ఓ అరగంట సేపు వాకింగ్‌కు వెళతాను’ అనుకోవచ్చు. ఒకసారి ఇటువంటి నిర్ణయం చేసుకున్నాక ఆ యువకుడు, ఈ పెద్దాయనా కూడా తమ తమ రోజువారీ కార్యక్రమంలో చాలా మార్పులు అవలంబిస్తారు. తమ తమ లక్ష్య సిద్ధి కోసం ఎంతో కొంత శ్రమిస్తారు. సరైన పద్ధతిలో పాటు పడితే, క్రమశిక్షణా తగిన మోతాదుల్లో ఉంటే వీళ్ళు తమ టార్గెట్లను సాధించ గలుగుతారు. ఈ విధమైన మార్పులు అయిచ్ఛికమైనవీ, ఆరోగ్యదాయకమైనవి కూడా. రోజూ జిమ్‌కు వెళ్తున్న కుర్రవాడు తన శరీరంలో వస్తున్న మార్పులను రోజూ అద్దంలో చూసుకున్నట్టే, స్వచ్ఛందంగా సమాజం మార్పు కోసం కృషి చేస్తున్న వారు కూడా ఈ మార్పులను గమనిస్తూ ఉండాలి. తాము అనుకున్నది సాధించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎదురయ్యే అడ్డంకులను స్వాగతించి అధిగమించాలి. మార్పు వారు అనుకున్న విధంగా ఉంటుంది.