గ్వెండోలిన్ బ్రూక్స్ అనే అమెరికన్ నల్లజాతి కవయిత్రి తన కవితా సంపుటి,The Bean Eaters ˝À We Real Cool అన్న కవితను ప్రచురించారు, (1960లో). అది 20వ శతాబ్దంలో విస్తతంగా చర్చించబడి ప్రసిద్ధిని పొందిన కవితల్లో ఒకటి. అమెరికాలోని చాలా రాష్ట్రాలు దాన్ని స్కూలు సిలబస్‌ల్లో చేర్చాయి. వేస్ట్ లాండ్ (టి.ఎస్. ఎలియట్), రోడ్ నాట్ టేకెన్ (రాబర్ట్ ఫ్రాస్ట్), డాడీ (సిల్వియా ప్లాత్)లు కూడా ఆ రోజుల్లో అందరి దష్టిని ఆకర్షించాయి. బ్రూక్స్ కవితను కింద ఇస్తున్నాను.
We Real Cool
The Pool Players.
Seven at the Golden Shovel.
We real cool. We
Left school. We
Lurk late. We
Strike straight. We
Sing sin. We
Thin gin. We
Jazz June. We
Die soon.
ఉపశీర్షికను మినహాయిస్తే కేవలం ఎనిమిది పంక్తులు, 24 పదాలు ఉన్న ఈ చిన్న కవిత గురించి కొన్ని వెబ్ సైట్లలో ఉన్న వాచకం(text) దాదాపు ఓ పుస్తకమంత ఔతుంది! దానికి కారణం, ఈ కవితలో అనేక రకాల విశేషాలుండటం.
”బంగారు పార” బిలియర్డ్స్ క్లబ్ దగ్గర ఏడుగురు ఆటగాళ్లు, అన్నది ఉపశీర్షిక. నిజానికి అది పూల్ క్లబ్. పూల్ ఆట చాలావరకు బిలియర్డ్స్ లాగానే ఉంటుంది. మన భారతదేశ సందర్భంలో ఈ క్లబ్ పేరును బంగారు గునపం అనాలేమో. కొన్ని దేశాలలో భూమిని తవ్వడానికి పార (shovel)ను మాత్రమే వాడుతారు. మన దగ్గర గునపం (crow bar) ప్రధాన పరికరం. దానికి అదనంగా పారను కూడా ఉపయోగిస్తారు. షికాగో నగరంలోని దక్షిణ ప్రాంతంలో గ్వెండోలిన్ బ్రూక్స్ చాలా కాలం నివసించారు. అక్కడ తన యింటి పక్కన ఉన్న ఇటువంటి ఒక క్లబ్ బయట నల్లజాతీయులైన ఏడుగురు అబ్బాయిలు/ యువకులు అతిగా తుళ్లిపడుతూ, కొట్లాడుతూ, మద్యం తాగుతూ, నానా హంగామా చేస్తూ కనిపించారు ఆమెకు. వారిలో నేరప్రవత్తి కూడా ఉంది. అది మధ్యాహ్న సమయం కనుక, వాళ్లు బహుశా బడి ఎగ్గొట్టి అక్కడికి వచ్చి వుంటారు అనుకున్నదామె. వాళ్లలో ప్రపంచాన్ని ధిక్కరించే, సామాజిక నియమాలను బేఖాతరు చేస్తూ ఎదురు తిరిగే స్వభావం ఉంది. తమ గురించి చెప్పమని అడిగితే వాళ్లేం చెప్తారో ఊహించి, ఈ కవితను రాశారు బ్రూక్స్. అది అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం జరుగుతున్న కాలం కనుక, అటువంటి యువకులు అక్కడక్కడ కనిపించేవారు. బ్రూక్స్ కూడా అమెరికాకు వలస వచ్చి స్థిరపడిన నల్ల జాతీయురాలు.
కవితలోని భావం ఇది : మేం హాయిగా, నింపాదిగా ఉన్నాం. మేం బడి ఎగ్గొట్టాం. మేం రాత్రుళ్లు చాలా ఆలస్యమయ్యేదాకా బయటనే గడుపుతాం. మేం భీకరంగా పోట్లాడుతాం. మేం పాపకత్యాలను కీర్తిస్తాం. మేం బాగా మద్యపానం చేస్తాం. జాజ్ సంగీతానికి అనుగుణంగా ఆడుతాం, పాడుతాం, నాట్యం చేస్తాం. మేం చనిపోతాం. ఆ యువకుల ప్రవర్తన ప్రమాదకర మైనదని చెప్తున్నారు కవయిత్రి. కానీ అది కొంతవరకు సమంజసమైనదే అనే భావన కూడా దాగి వుంది అందులో. ఆ రోజుల్లో (ఈ రోజుల్లో కూడా) అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్ష, హింస పెచ్చు మీరడం మనకు తెలిసిందే. కాబట్టి ఆ యువకుల స్వభావం, ప్రవర్తన ఆ విధంగా ఉన్నాయని ఆమె భావన. తాము చనిపోబోతున్న విషయం కూడా వారికి తెలుసు. అంటే చావును సైతం లక్ష్యపెట్టనంత విశృంఖలత్వం ఉంది వారిలో.
ఈ కవితలో పదికి పైగా కవిత్వ ఉపకరణాలు లేదా సాధనాలు (poetic devices) ఉన్నట్టు గుర్తించారు విమర్శకులు. వాటిని కింద ఇస్తున్నాను. ‘ఈ కవితలో’ అంటే గ్వెండోలిన్ బ్రూక్స్ రాసిన ఈ ఆంగ్లకవితలో అని అర్థం.
Assonance:పదాలలో ఒకే రకమైన అచ్చుధ్వనులు (అక్షరాలు కాదు) వస్తే, దాన్ని aరరశీఅaఅషవ అంటారు. కానీ అవి వరుసగా ప్రతి పదంలో రావాలనే నియమం లేదు.
ఆంగ్ల ఉదాహరణ : Who gave Newt and Scooter the blue tuna? It was too soon.. ఇక్కడ Newt, Scooter మనుషుల పేర్లు. ఈ వాక్యాలలో ఊ అనే అచ్చు ధ్వని మళ్లీ మళ్లీ వచ్చింది.
తెలుగు ఉదాహరణ : వొక మౌనంలోంచి యింకో మౌనం లోకి/ వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి (అఫ్సర్). ఇక్కడ ‘ఓ’కారం మళ్లీ మళ్లీ వచ్చింది.
ఈ కవితలో:pool, cool, , school(ఊకారం)late, straight(ఏకారం)sing, sin, thin, gin (ఇకారం)
Consonance: పదాల్లో ఒకే రకమైన హల్లుధ్వనులు వస్తే, దాన్నిconsonance అంటారు.
ఆంగ్ల ఉదాహరణ : A duck that clucked drove a truck into an aqueduct.
తెలుగు ఉదాహరణ : ఎటు నే చూచిన చటులాలంకారపు/ మటుమాయల నటనలలో (శ్రీశ్రీ)
ఈ కవితలో : cool, pool, school, golden, late, left, lurk (ల్- లకారం)
Alliteration:: ఇందులో పంక్తిలోని దాదాపు అన్ని పదాల ప్రారంభాల్లో ఒకటే ధ్వని ఉంటుంది. అది అచ్చుధ్వని కావచ్చు, లేదా హల్లుధ్వని కావచ్చు.
ఆంగ్ల ఉదాహరణ : Aunt Agnes! Ack! Another accounting error!! ఈ వాక్యం aరరశీఅaఅషవ కు కూడా ఉదాహరణ అనే విషయాన్ని గమనించాలి.
తెలుగు ఉదాహరణ : గజానికొక గాంధారి కొడుకు గాంధీగారి దేశంలో (తిలక్)
ఈ కవితలో : lurk, late; strike, straight, sing, sin.
Enjambment : భావాన్ని పంక్తిలో ముగించకుండా పొడగించి, తర్వాతి పంక్తులకు విస్తరింపజేయడాన్ని enjambmentఅంటారు.
ఆంగ్ల ఉదాహరణ :Let us go then, you and I,/ When the evening is spread out against the sky/ Like a patient etherized upon a table; (T.S. Eliot కవిత,The Love Song of J. Alfred Prufrock)
తెలుగు ఉదాహరణ :
చీకటి సాయంకాలాలతో జీవితాన్ని
కొలుచుకుంటున్నాను. వత్తాలతో కొలిచి
పోశానొకప్పుడు నా ద్రవ్యాన్ని, దోసిళ్ళతో
వెదజల్లుతున్నానిప్పుడు నా భవితవ్యాన్ని
దశ దిశలకు ఎగిరిపోనిమ్మని దాన్ని
(గుంటూరు శేషేంద్ర శర్మ).
ఇందులోని చివరి పంక్తిని ఒకవిధమైన పొడగింపుగా పరిగణించవచ్చు. ఈ కవితలో: చివరి పంక్తిలో తప్ప తక్కిన ఏడింటిలో ఫుల్ స్టాప్ తర్వాత ఔవ వచ్చి, కింది పంక్తికి పాకింది.
Caesura: ఒక కవితా పంక్తిలోపల విరామాన్ని గాని, నిలుపుదలను గాని ఏర్పరచడం. అంటే పంక్తి మధ్య బిందువులాంటిది వచ్చి, తర్వాత ఒకటో రెండో పదాలు ఆ పంక్తిలో ఉండటం. ఇది ఒకవిధంగా enjambment ను పోలివుంటుందని చెప్పవచ్చు.
ఆంగ్ల ఉదాహరణ :Even then would be/ some stooping; and I/ choose// Never to stoop. (Robert Browning ·, My Last Dutchess) ఇక్కడ Choose తర్వాత ఉన్న ఆపుదలను ((stoppage ను) మనం గమనించాలి.
తెలుగు ఉదాహరణ : ఈ కవితలో : మళ్లీ అవే ఏడు పంక్తులను ఉదాహరణలుగా చూపవచ్చు. వాటిలో చివరి పదానికి ముందు ఫుల్ స్టాప్ విరామం రూపంలో వచ్చింది.
Metaphor : ఇక్కడ మెటఫర్ అంటే రూపకం అని కాదు,figurative గా (ఆలంకారికంగా) చెప్పడం అని.
ఆంగ్ల ఉదాహరణ : His words were a double – edged sword.
తెలుగు ఉదాహరణ :‘అతని తలమీద నిప్పులు కుప్పగా పోయడం’ అనేది బైబిలు కాలంలో లోహాన్ని కరిగించడానికి ఉపయోగించిన పద్ధతినుండి వచ్చిన అలంకారార్థ పదజాలం.
ఈ కవితలో : శీర్షిక (Golden Shovel) లోని మొదటి పదం ఉల్లాసమయ విలాసమయ జీవితాన్నీ, రెండవది భవిష్యత్తులో సొంత సమాధి తవ్వడాన్నీ సూచిస్తున్నాయి. ఇది ఆలంకారికత.
Parataxis: అంటే సరిగ్గా పంక్తులన్నీ ఒకదానికింద ఒకటి కాకుండా కింది పంక్తిలో ఉండాల్సిన భాగంలో కొంత పైపంక్తిలోనే ఉండటం. స్థూలంగా, పారాగ్రాఫ్ కవితలను పారాటాక్సిస్ ఉన్న కవితలుగా చెప్పుకోవచ్చు.
ఈ కవితలో : మళ్లీ మొదటి ఏడు పంక్తులు. ఫుల్ స్టాప్ తర్వాతbecause, so/therefore లాంటి conjunctions లేకుండా పక్కపక్కన రాయడం పారాటాక్సిస్ కిందికి వస్తుంది.
Symbols:
ఈ కవితలో :School అధికారానికీ, నియంత్రణకూ, అనుగుణ్యతకూ (conformity కి), కట్టుబాటుకూబీ జీబఅవ నెల సంతప్తికీ, సంతోషానికీ, ఉత్సాహానికీ, ఉల్లాసానికీబీ shovel (పార) సమాధి నిర్మాణానికి వచ్చే పరికరానికీ ప్రతీకలు. కవితలో మాట్లాడే అబ్బాయిల దష్టిలో జూన్ నెలstatus quo కు సంకేతం కనుక, పరిస్థితి/సమాజం మారాలనే ఉద్దేశం సూచించబడుతున్నది.
Repetition: ఈ కవితలో we చాలాసార్లు వచ్చింది.
Internal Rhyme: cool, cool, sin, gin లు అంత్యప్రాసలుగా కాక అంతర్గత ప్రాసలుగా వచ్చాయి.
Brevity and Economy of Words: ప్రతి వాక్యంలో మూడు మాత్రమే పదాలు వచ్చాయి. ఈ లక్షణం వలన మాటల పొదుపు, సంక్షిప్తి సిద్ధించాయి. వడ్లగింజలో బియ్యపు గింజ అన్నట్టు ఈ కవిత్వ సాధనాలలో కొన్ని ఏమంత ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి కావు. పైగా కొన్ని వేరేవాటితో Overlap ఔతాయి. కానీ వీటిలో శాస్త్రీయత ఉంది. ఆంగ్ల సాహిత్యంలో ఇటువంటి కవిత్వ, సాహిత్య ఉపకరణాలు వందకు పైనే ఉన్నాయి! వాటిలోని చాలా సాధనాలను మనం తెలుగులో వాడుతున్నాం కానీ, వాటికి పేర్లు పెట్టుకోలేదు. ఎవరైనా ఆ పని చేస్తే బాగుంటుంది.
– ఎలనాగ