– కక్ష సాధింపేనంటున్న ఆసుపత్రి యాజమాన్యం..
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు సరిగా పాటించడం లేదనే కారణంతో వేములవాడ పట్టణంలోని చాణక్య నర్సింగ్ హోమ్ ప్రయివేటు ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిణి రజిత మాట్లాడుతూ ఆస్పత్రి నిర్వహణలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదని మీడియాకు వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతి సైతం ఆస్పత్రి నిర్వహణకు ఆమోదయోగ్యంగా లేదని, రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో భవనానికి సంబంధించిన పత్రాలు జమ చేయలేదని అన్నారు. అట్లాగే ఆస్పత్రికి కావాల్సిన కనీస 40ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేదని ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు వీలు లేకుండా ఉందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా నర్సింగ్ హోమ్ కు సంబంధించిన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సైతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి తీసుకోవాల్సింది పోయి, షేక్ సుహైల్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుండి తీసుకున్నారని చెప్పారు.అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ వ్యక్తిగత కక్షతో పాటు రాజకీయ కోణంలో ఆస్పత్రిని సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణంలో చాలా ఆసుపత్రులు నిబంధనలు పాటించనప్పటికీ కేవలం తమ ఆసుపత్రినే లక్ష్యంగా చేసుకొని అధికారులు సీజ్ చేశారని ఇది చట్ట విరుద్ధమని, అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. మరోవైపు ఆసుపత్రి సీజ్ చేస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకొని అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్, టిపిఎస్ ఆన్సర్, టౌన్ సిఐ వీరప్రసాద్, అగ్నిమాపక అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తో పాటు తదితరులు ఉన్నారు.