‘మృత్యు’ దారులు

రోడ్డు ప్రమాదాల నివారణ భారతదేశంలో అతి పెద్ద సవాలుగా మారింది. దేశంలో ఏటా సుమారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే వాటిలో లక్షా 50 వేల మంది దుర్మరణం పాలవుతున్నారు. వేల కుటుంబాలు ఆర్థిక, మానసిక భారం మోస్తున్నాయి. ఆప్తులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి ఐదు వరకు ఈ కొద్ది కాలంలోనే తెలంగాణలో 80 మంది పైగా మంది దుర్మరణం చెందినట్టు పోలీస్‌వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయంటే ప్రమాదాల తీవ్రత అర్థమవుతోంది. ఈ దుర్ఘటనలు వ్యక్తిగత, సామాజిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. రోడ్లు విస్తరిస్తున్నా, ఆధునీకరిస్తున్నా, సాంకేతికంగా తీర్చిదిద్దుతున్నా, ప్రమాదాల నివారణకు ఏటేటా భద్రతా వారోత్సవాలు చేపడుతున్నా, కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గకపోగా రోజురోజుకూ ఆ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనాకరం.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలో కారు పల్టీ కొట్టి చెరువులో పడటంతో ఐదుగురి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద జరిగిన ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢకొీని నలుగురి మృతిచెందారు. మేడ్చెల్‌ జిల్లా పోచంపల్లి వద్ద రోడ్డుపై ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని వాహనం ఢకొీనడంతో ఒకరు చనిపోయారు. స్పీడుగా పోతుండటం, లైట్లు చెక్‌ చేసుకోకపోవడం, హెల్మెట్‌ లేకుండా అతివేగంతో పోవడం వంటి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పోలీస్‌ రికార్డుల్లో నోట్‌ చేశారు. ఇవన్నీ ఇటీవల జరిగినవే. రోడ్డు మధ్యలో విద్యుత్‌ స్తంభం ఉన్నా దాన్ని తొలగించకుండా అక్కడే ఉంచడం ఎవరి నిర్లక్ష్యం? చెరువుల చుట్టూ గోడ కట్టాల్సిన బాధ్యతెవరిది?. స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సింది ఎవరు? వివిధ రకాల వాహనాలు వేర్వేరుగా పోవడానికి రోడ్లపై లైన్సు ఎవరు ఏర్పాటు చేయాలి? సైకిల్‌ పోవడానికి ప్రత్యేకమైన దారీ లేదంటే రోడ్ల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనిష్మెంట్‌ల పేరుతో 2019 చట్టంలో సవరణలు కఠినంగా అమలు చేస్తున్నామని, అయినా ప్రమాదాలు తగ్గడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ సెలవిచ్చారు. ఈ ఏఐ వంటి కెమెరాల ఆధారంగా చలాన్‌లు జారీ చేసినా, వందల్లో పెనాల్టీలు వేలకు పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనంపై భారాలు వేయడం తప్ప మౌలిక సదుపాయాలు కల్పించిన దాఖ లాలు లేవు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఫుట్‌పాత్‌ల మీద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘోరాలకు మానవ తప్పిదం ఎంతుందో పాలకుల నిర్లక్ష్యమూ అంతకంటే ఎక్కువగా ఉంది. దీనకంతటికీ సరైన రహదారి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కేంద్రం విఫలమైంది.
రోడ్ల నాణ్యత, రూపకల్పన, నిర్వహణ ప్రభావంపైనే రోడ్డు భద్రతా ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తవం. గతంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సుందర్‌కమిటీ గానీ, సుప్రీంకోర్టు చేసిన సూచనలు గానీ రోడ్ల నిర్వహణపైనే చేశాయి. మనదగ్గర ఉన్న రోడ్లకు తగ్గ రీతిలో వాహనాల తయారీ లేవని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న కఠిన చట్టాలను ఇక్కడ అమలు చేసినా తగ్గలేదంటే ..ఆ దేశాల్లో రోడ్లు బాగుంటాయి.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కొన్ని చోట్ల నేషనల్‌ హైవేలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వాలు.. నిత్యం జనం తిరిగే రోడ్లపై జాగ్రత్తలు పాటించడం లేదు. ఔటర్‌రింగ్‌ రోడ్ల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉన్నాయి. పిపిపి పద్ధతిలో రోడ్ల నిర్వహణకు ఇచ్చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేది. ప్రమాదం జరిగినప్పుడు తప్ప అవి జరగకుండా ఏమీ చేస్తే బాగుంటుందన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఆన్‌రోడ్డు అంబులెన్స్‌ సౌకర్యం కల్పించడం వల్ల ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయాన్ని నివారించొచ్చు. కేరళలో సేవ్‌ కేరళ ప్రాజెక్టు పేరుతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. కేంద్రంతో పాటు మిగతా ప్రభుత్వాలు చాలాచోట్ల స్థానికుల అవసరాలను నిర్లక్ష్యం చేయడం వల్లే పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులూ ఉన్నాయి. డ్రైవర్లకు పని గంటలను కచ్చితంగా పెట్టాలి. అవి లేకపోవడంతో నిద్రలేమితో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే రోడ్డు భద్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలి. వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండాలి. జీబ్రా, క్రాసింగులు, పాదచారి వంతెనలు ఏర్పాటు చేయాలి. ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటే ప్రజల భద్రతకు రక్షణగా ఉంటుంది. ఇష్టారాజ్యంగా నడిచే ప్రయివేటు వాహనాలను నియంత్రించాలి.