మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

Government's goal is to empower women.– స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి….
– త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం…
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతిపై  జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత లో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం ఉదయం ప్రజాభవన్ లో మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు.  అందుకుగాను అంది వస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ఇందిరమ్మ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ క్రమంలో మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నాం. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతులకి వస్తున్న క్రమంలో వారు వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు.  మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించండి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.
మహిళా సంఘాలు ప్లాంట్ల ఏర్పాట్లు లో  ఆర్థిక సహాయం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ లో ఏర్పాటుకు విద్యుత్ శాఖ redco ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలో టెండర్లు ఓపెన్ చేసి వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూ సేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం వంటి పనులను గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక మెగావాటు ఉత్పత్తికి నాలుగు ఎకరాలు అవసరం ఉంటుంది.. ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగువేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్లకు తెలిపారు. దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని.. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు భూమి అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో భూములపై హక్కులు ఏర్పడినప్పటికీ స్తంభాలు వేసి విద్యుత్ లైన్ ల ద్వారా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం సూచించారు. సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ దిశగా కలెక్టర్లు పనిచేస్తే గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం స్పష్టంగా ఉందని తెలిపారు.  ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుంది. చిన్నపాటి ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటుకు అధికారులు భూములు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.   అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని తెలిపారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడంలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇకనుంచి ఆ భూముల్లో ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటిని సమన్వయం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం కలిగించే పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుంది.
భూమి లభ్యత ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములపై అధికారులు దృష్టిపెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టల తో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నాయి వీటి పైన సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని ఇంధన శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవకాశం ఉంటుందని వివరించారు. ప్రధానమంత్రి కుసుము  పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఏర్పడింది.. ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రెడ్ కో  పోర్టల్ ద్వారా రైతులు సోలార్ పవర్ ఉత్పత్తికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని, దీని ద్వారా తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి రావడం మే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లడుతూ స్వయం సహాయక సంఘముల సభ్యుల సహకారముతో   దేవాలయ మరియు ప్రభుత్వ భూములలో సోలార్ పవర్  ప్లాంటు ఏర్పాటుకు , కరెంట్ ఉత్పత్తి  చేయుటకు  యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోత్కూరు మున్సిపాలిటీ పరిదిలోని భిజులాపురం నందు గల శ్రీ మత్స్య గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భూమి సర్వే నెం 452‌, 453  లలోని ఎకరములు 15.33 గుంటల స్థలం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు స్థలం పరిశీలించి ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు..మిగతా ప్రక్రియ కూడా వేగవంతం పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లోజిల్లా అటవీ శాఖ అధికారి  పద్మజా , సుదీర్  ఎస్ .ఇ ఎలక్ట్రిసిటీ ,  శ్రీనివాస్  చారి డి.ఇ. ఎలక్ట్రిసిటీ, శ్రీ శ్రీనివాస్ అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి  పాల్గొన్నారు.