నిగ్గు తేల్చాల్సిందే

 Sampadakiyamరాష్ట్రంలో రాజకీయ, పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. నాయకులు వార్తల్లో వ్యక్తులవుతున్నారు. ఎక్కువ భాగం అవినీతి, క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని జెండాకెక్కుతున్నారు. తెలంగాణ మాజీ మంత్రి కె.తారక రామారావుపై ఫార్ములా ఈ-రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తున్నది. హెచ్‌ఎండీఏ నిధులను మంత్రిమండలితో పాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే గ్రీన్‌కో కంపెనీకి తరలించారనే ఆరోపణలతో కేటీఆర్‌ అయన అనుచర అధికారగణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై కేటీఆర్‌ కోర్టు కెళ్లడం, పది రోజుల మధ్యంతర రక్షణ తర్వాత క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది.నిధుల దుర్వినియోగం జరిగిందనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. ఒకవైపు హైకోర్టు ఈ తీర్పును చెబుతుండగానే, మరోవైపు ఏసీబీ గ్రీన్‌కో, ఇతర కంపెనీల్లో సోదాలు నిర్వహించి పైళ్లను స్వాధీనం చేసుకుంది. ఇంకో వైపు కేటీఆర్‌ ‘సుప్రీం’లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వెంటనే దాఖలు చేయగా, తమ వాదనలూ వినాలంటూ సర్కారు కేవియట్‌ వేసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు చలికాలంలోనూ వేడేక్కాయి.
రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాలని వాదనల సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎఫ్‌ఐఆర్‌ని ప్రాథమిక దశలోనే కొట్టివేయాలన్న కేటీఆర్‌ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ చేసిన ఆరోపణలకు తొలిదశలో సాక్ష్యాలు, ఆధారాలు దొరకవనీ, దర్యాప్తు సంస్థకు తగిన సమయం, అవకాశం ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. కేటీఆర్‌కు విచారణకు సహకరించడం మినహా మరో మార్గం లేదిప్పుడు. సందట్లో సడేమియలా ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను పట్టుకుని ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌(ఈడీ)సైతం రంగంలోకి దిగి కేటీఆర్‌కు తాఖీదులు పంపింది. ఇక విచారణల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. కేటీఆర్‌ను అరెస్ట్‌చేసే అవకాశం లేకపోలేదు. అనవసర రాద్దాంతం చేయకుండా నిందితులు, చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలి. లొట్టపీసు కేసంటూ బీఆర్‌ఎస్‌ గుంపంతా సర్కారుపై విరుచుకు పడుతున్నది. ఒకవేళ అదేనిజమైతే, భయ పడాల్సిన పనేముంది? న్యాయ పోరాటంతో తన సచ్ఛిలతను నిరూపించు కోవాల్సిందే. మరక మంచిదే అని మురవాల్సిందే.
విమర్శలతో తుడిచేసుకోవడానికి ఇది రాజకీయ ఆరోపణకాదు. ఈ కేసు విలువైన ప్రజాధనాన్ని అక్రమార్కుల బొక్కసం నింపిన అవినీతి వ్యవహారం. హెచ్‌ఎండీఏ నిధులను దారి మళ్లించిన వారిలో కేటీఆర్‌తోపాటు అప్పటి పురపాలక శాఖ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని సైతం నిందితులుగా చేర్చి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండకపోతే, పారదర్శకతతో పాలన చేయకపోతే, ఆ శాపం అధికారం కోల్పోయాక యమపాశంలా వెంటాడుతున్నదనే దానికి ఇది ఓ ఉదాహరణ.ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌ పౌండ్ల రూపంలో రూ.55 కోట్లు గ్రిన్‌కో సంస్థకు చెల్లించేశారు. విలువైన ప్రజాధనాన్ని అప్పనంగా సరిహద్దులు దాటించేశారు. దీనికి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ వాంగ్మూలమే సాక్ష్యం. పాలకులకైనా, ప్రతిపక్షమైనా చట్టం అందరికి సమానమనేలా విచారణ సాగాలి. ప్రజాప్రతినిధులు అవినీతికి దూరంగా ఉన్నామంటూ మాటలు చెప్పడం కాదు. ఉండాలి కూడా. ఆదర్శమవ్వాలి. అంతేకాని మాటలతో నీతిమంతులు కాలేరు.
ఇప్పటికే కూతురు ఐదునెలలు జైల్లో ఉన్న కాలమంతా కేసీఆర్‌కు కునుకు పట్టలేదన్నది వాస్తవం. ఈలోగా మరో కేసు కేటీఆర్‌ కుటుంబం ఖాతాలో వచ్చి చేరింది. కాగా అర్వింద్‌కుమార్‌ అఫ్రూవర్‌గా మారడానికి అంగీకరించినట్టు వార్తలు. అదేగనక జరిగితే ఫార్ములా ఈ-రేసు కేసు భాగోతం మెడకు చుట్టుకుంటుంది. ఏదీఏమైనా కేసు విచారణను కేటీఆర్‌ ఎదుర్కొవాల్సిందే, సహకరించాల్సిందే. ఒకవేళ ఆయన చెప్పినట్టుగానే తప్పులేదనుకుంటే గొడవేలేదు. ”నిజం నిలకడ మీద తేలుతుంది. కేటీఆర్‌ కడిగిన ముత్యంలా బయటకొస్తారు” అని హరీష్‌రావు, ”నా మాటలు రాసిపెట్టుకోండి.ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటా..సర్కార్‌ అబద్దాలు నన్ను దెబ్బతీయలేవు” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్టు జరుగుతుందో,లేదో కాలమే సమాధానం చెప్పాలి.ఈ కేసులు, జైళ్లు రాజకీయంగా ఎవరికి లాభిస్తాయి, ఎవరికి నష్టం కలిగిస్తాయనే విషయాల చుట్టూ తిరగడం కాదు. ఎవరు నిజంగా దోషులో నిగ్గుతేలాలి ! అంతేకాని కక్షలు, దృష్టి మళ్లింపు రాజకీయాలుగా వ్యవహారం నడవకూడదు.