తెలంగాణ మట్టికి ఘన చరిత్ర

–  తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌
తెలంగాణలో ఏ ప్రాంత మట్టిని ముట్టుకున్నా, ఏ ఊరును కదిపినా చరిత్ర ఊటలాగా పుట్టుకొస్తుందని తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో బుధవారం జరిగిన ‘మన ఊరు మన చరిత్ర’ ప్రాజెక్టుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చరిత్రను రాయడానికి సిద్ధపడిన వారు చరిత్రను నిర్మిస్తారని సిటీ కళాశాల విద్యార్థులు నిరూపించారన్నారు. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు తెలంగాణ గ్రామీణ చరిత్రను వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో సిటీ కళాశాల విద్యార్థులు తిరిగి రాయాలని సూచించారు. వీర తెలంగాణ పోరాటంలో గ్రామీణ యువకులు చేతికర్రను తుపాకీగా మార్చి ఆధిపత్యవాదులపై అలుపెరగని పోరాటం చేసిన విధానాన్ని చరిత్రగా రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల్లో సబ్బండ వర్ణాలు, కులాలు, వారితో ముడివేసుకున్న సాంస్కృతిక, సామాజిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి ప్రత్యేకమైన ప్రాజెక్టుగా రూపొందించాలన్నారు. డిగ్రీ పట్టా విలువ కంటే తమ స్వగ్రామాల గురించి రాసే చరిత్ర ఎంతో విలువైనదని, చెప్పారు. విద్యార్థులు రూపొందించిన ఈ చరిత్ర రేపటి కలక్టరేట్ల గెజిట్లుగా ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడెమీ ఇచ్చిన పిలుపును అందుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు చేపట్టిన రెండు వేల ‘మన ఊరు మన చరిత్ర’ ప్రాజెక్టులు సమకాలీన తెలంగాణ చరిత్రకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. సిలబస్‌లో లేని గొప్ప పాఠం, పాఠంలో లేని గొప్ప సంస్కారం, విజ్ఞానం మన గ్రామాల్లో దాగి ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాన్ని, తరగతి గదిని తగిన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థులు 33 బృందాలుగా ఏర్పడి 33 గ్రామాల చరిత్రలను ప్రాజెక్టులుగా రూపొందించి తెలంగాణ సాహిత్య అకాడెమీకి సమర్పించటం అభినందనీయమైన్నారు. చేర్యాల, కొడకంచి, నడిగూడెం, చందాపూర్‌ తదితర గ్రామాలను సందర్శించి ఆయా గ్రామాలకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను అధ్యయనం చేసి ప్రామాణికమైన ప్రాజెక్టులుగా మలచటంతో మిగతావారికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను గౌరీశంకర్‌ ఆవిష్కరించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను పాఠ్యప్రణాళికలో భాగం చేయటమే కాకుండా వాటికి మార్కులు కేటాయించినందుకు ప్రిన్సిపాల్‌ ఆచార్య బాలభాస్కర్‌ను అభినందించారు.
డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడెమీ ట్రస్ట్‌ అధ్యక్షులు మణికొండ వేదకుమార్‌ మాట్లాడుతూ.. డెక్కన్‌ ప్రాంతంలో ప్రతి గ్రామానికీ ప్రత్యేక చరిత్ర ఉందని, చారిత్రకంగా గ్రామాలు స్వయం సమృద్ధిగా రూపొందిన ప్రగతి పరిణామాన్ని విద్యార్థులు పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రిన్సిపాల్‌ ఆచార్య బాల భాస్కర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు పుట్టిన ఊరును కూడా ఒక విలువైన గ్రంథంగా విస్తృతమైన పరిశోధన ప్రయోగశాలగా చేసుకుని కొత్త వైజ్ఞానిక సామాజిక విషయాలను నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు -మన చరిత్ర జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌.కోయి కోటేశ్వరరావు, కళాశాల కన్వీనర్‌ డాక్టర్‌.డి.శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అయిజాజ్‌ సుల్తానా, డాక్టర్‌ విప్లవ్‌ దత్త్‌శుక్లా, డాక్టర్‌ నీరజ, డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.