అమెరికా లేదా స్వేచ్ఛా ప్రపంచ రక్షణ కోసం పనామా కాలువను తిరిగి తమకు అప్పగించాలని, డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్, కెనడాలు తమకు కావాలని, మెక్సికో గల్ఫ్ పేరును అమెరికాగా మారుస్తానని తద్వారా ఆ ప్రాంతంపై తమ ఆధిపత్యం, ప్రపంచ నాయకత్వం మరింతగా ప్రతిబింబిస్తుందని డోనాల్డ్ ట్రంప్ చెప్పాడు. మంగళవారం నాడు విలేకర్ల సమావేశంలో చెప్పిన ఈ మాటలు సామ్రాజ్యవాద కాంక్ష వెల్లడితప్ప మరొకటి కాదు. అమెరికాకు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో ప్రమాద ఘంటికలను గుర్తు చేసింది. స్వీయ రక్షణ సాకుతో ప్రపంచమంతటా 80దేశాల్లో 800కు పైగా చిన్నా పెద్ద మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసిన అమెరికా ఆ ముసుగులో ఆధిపత్యం చెలాయించటానికి పూనుకున్న పూర్వరంగంలో ఈ మాటలు ఆశ్చర్యం కలిగించటం లేదు. అంతరంగాన్ని బయటపెట్టాయి. అయితే అది ఆచరణ సాధ్యమా అంటే కాదని వేరే చెప్పనవసరం లేదు. అయినప్పటికీ ట్రంప్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పెద్దన్నగా ఉన్నప్పటికీ ఎక్కడా అది పైచేయి సాధించిన ఉదంతం లేదు. చిన్న దేశాలైన వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆక్రమించి చివరకు పారిపోయి ప్రాణాలు దక్కించుకోవటాన్ని చూశాము. ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు అమెరికాను ఖాతరు చేయటం లేదు. ఆ ఉక్రోషంతో మరోసారి అమెరికాకు అగ్రస్థానం తెస్తా అనే నినాదంతో రెండోసారి అధికారానికి వచ్చిన ట్రంప్ అమెరికన్లను ఆకట్టుకొనేందుకు చూస్తున్నాడు.
కెనడా రక్షణకు తాము బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నామని, అక్కడి నుంచి వచ్చే దిగుమతులు తమను దెబ్బతీస్తున్నందున తమ దేశంలో ఒక రాష్ట్రంగా ఉండాలన్న ట్రంప్ ప్రతిపాదనను కెనడా ప్రధాని ట్రూడూ తిరస్కరించాడు. అందుకు ఏమాత్రం అవకాశం లేదన్నాడు. డెన్మార్క్ కూడా అదే చెప్పింది, తమ భవిష్యత్‌ను గ్రీన్‌లాండర్స్ మాత్రమే నిర్ణయించు కుంటారన్నది. ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకంగా ఉండటమే గాక కేవలం 57వేల మంది జనాభా మాత్రమే ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద దీవి గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను పడటానికి హైటెక్, విద్యుత్ బాటరీల తయారీకి అవసరమైన ముడిసరుకు అక్కడ పుష్కలంగా ఉండటమే కారణం. భవిష్యత్ విద్యుత్ వాహనాలదే అని తేలిపోయిన కారణంగానే ఆ ప్రాంతం మీద అమెరికా కార్పొరేట్ల కన్నుపడింది. ట్రంప్ ద్వారా తమ వాంఛను వెల్లడించాయి పైకి మాత్రం చైనా, రష్యా నౌకల రాకపోకలను తెలుసుకొనేందుకు అది తమకు మిలటరీ రీత్యా ఎంతో అవసరం అని ట్రంప్ చెప్పాడు. గ్రీన్ లాండ్ కోసం అవసరమైతే మిలిటరీ, ఆర్థిక బలాన్ని వినియోగిస్తామన్నాడు. అమెరికాలో విలీనం కావాలని గ్రీన్‌లాండర్స్ ఓటింగ్ నిర్వహించాలని కూడా చెప్పాడు. అక్కడ పెద్ద అమెరికా అంతరిక్ష కేంద్రం కూడా ఇప్పటికే ఉంది.ట్రంప్ ప్రకటనకు ముందు అతగాడి కుమారుడు ఒక ప్రయివేట్ జెట్‌లో వ్యక్తిగతం పేరుతో గ్రీన్‌లాండ్ పర్యటన జరిపాడు.
పనామా కాలువ హంకాంగ్‌కు చెందిన సికె హచిసన్ కంపెనీ ఆధీనంలో ఉంది, రెండు వైపులా ఉన్న రేవులను నిర్వహిస్తున్నది. అమెరికా నౌకలకు ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్నదని, అది చైనా కంపెనీ అని ట్రంప్ ఆరోపించాడు. దీన్ని పనామా అధ్యక్షుడు జోస్ రావుల్ ములినో ఖండిస్తూ చైనా జోక్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశాడు. పసిఫిక్-అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ 1910దశకంలో ఈ కాలువను అమెరికా నిర్మించింది. 2000 సంవత్సరం జనవరి ఒకటి నుంచి పనామా ఆధీనంలోకి వచ్చింది. దాన్ని తమ మిలిటరీ కోసం నిర్మించినందున తమకు తిరిగి కావాలని గతంలో కూడా ట్రంప్ అన్నాడు. తిరిగి తీసుకొనే సమయం వచ్చిందన్నాడు. తానేం మాట్లాడినా అమెరికన్లు గుడ్డిగా నమ్ముతారనే భ్రమలో ఉన్న కారణంగానే 2021లో అమెరికా అధికార కేంద్రం కాపిటోల్ భవనంపై జరిగిన దాడిలో హిజబుల్లా తీవ్రవాదులు పాల్గొన్నట్లు ఆరోపించాడు. వైట్‌హౌస్‌లో ఇంకా అడుగు పెట్టక ముందే ఇలా మాట్లాడుతున్నాడంటే జనవరి 20 తరువాత ఏమంటాడో తెలియదు. నియంత హిట్లర్ ప్రపంచానికి ఎలా ముప్పు తెచ్చాడో డోనాల్డ్ ట్రంప్ తీరుతెన్నులను చూస్తే అదేపని చేసేట్లు అనిపిస్తోంది. యావత్ భూమండలాన్ని చాపమాదిరి చుట్టి చంకలో పెట్టుకోవాలని చూసిన ఆ నాజీ చివరకు దిక్కులేని చావు చచ్చాడు. ఈ పిచ్చివాడిని ఏం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది.