కమిన్స్‌కు గాయం?

Injury to Cummins?– చాంపియన్స్‌ ట్రోఫీకి దూరం
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంకతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌కు పాట్‌ కమిన్స్‌ అందుబాటులో లేడు. పితృత్వ సెలవు కోసం గతంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి అనుమతి తీసుకున్నాడు. కానీ భారత్‌తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో పాట్‌ కమిన్స్‌ చీలమండ గాయం బారిన పడినట్టు సమాచారం. చీలమండ గాయం నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. దీంతో ఫిబ్రవరిలో ఆరంభం కానున్న చాంపియన్స్‌ ట్రోఫీలో కమిన్స్‌ ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఆసీస్‌కు సారథ్యం వహించి టైటిల్‌ అందించిన కమిన్స్‌.. ఆ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో పెద్దగా ఆడలేదు. పని ఒత్తిడితో వన్డే ఫార్మాట్‌లో కనిపించలేదు. ఈ సమయంలో స్మిత్‌, మార్ష్‌, ఇంగ్లీశ్‌లు కెప్టెన్సీ వహించారు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఫిబ్రవరి 22న ఇంగ్లాండ్‌తో ఆసీస్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. చాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసేందుకు జనవరి 12న గడువు ముగియనుంది. దీంతో పాట్‌ కమిన్స్‌ లేకుండా ఆసీస్‌ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో కమిన్స్‌ 167 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు.