మంచి స్నేహం

good friendshipఅనగనగా ఒక ఊరిలో ప్రవళిక, వెన్నెల అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వీరిద్దరు ఎప్పుడూ కలిసే పాఠశాలకు వెళ్లేవారు. టీచర్లు చెప్పే పాఠాలను ఎప్పటికప్పుడు చదివేవారు. ఆటలు ఆడే సమయంలో ఎవరు గెలిచినా సంతోష పడేవారు. పరీక్షల్లో మార్కులు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ వచ్చినా కూడా ఒకరినొకరు అభినందించుకునేవారు.
ఒకరోజు ఆ పాఠశాలకు నస్రీన్‌ అనే అమ్మాయి కొత్తగా వచ్చి చేరింది. నస్రీన్‌ తో ప్రవళికకు స్నేహం ఏర్పడింది. ఆ రోజు నుంచి వెన్నెలను పట్టించుకోవడం మానేసింది.
టీచర్లు పాఠాలను చెబుతుంటే.. శ్రద్ధగా వినడం మానేసి ముచ్చట్లు పెట్టేవారు. అలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత వచ్చిన పరీక్షల్లో నస్రీన్‌తో పాటు ప్రవళికకు కూడా మార్కులు తక్కువగా వచ్చాయి.
వెన్నెల ఒకరోజు ప్రవళిక వద్దకు వెళ్లి ”ప్రవళిక.. నువ్వు టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం లేదు. ముచ్చట్లు పెడుతూ కూర్చుంటున్నావు. అందుకనే నీకు మార్కులు తక్కువగా వచ్చాయి. ఇకనైనా చదువుపైన శ్రద్ధ పెట్టు” అని చెప్పింది.
”నాకు తెలుసులే.. నువ్వేం చెప్పొద్దు” అని బదులిచ్చింది ప్రవళిక.
నస్రీన్‌, ప్రవళిక ఇద్దరు సెల్‌ ఫోన్‌ గురించే మాట్లాడుకునేవారు. ఆ తరగతిలో ఉన్న అబ్బాయిలతో, ”నాకు ఇన్‌స్టాగ్రామ్‌ ఉంది. నా ఐడి ఇది. ఫాలో చేయండి, లైక్‌ చేయండి” అని ఎప్పుడు అడిగేది.
ఒకరోజు చాటుగా తరగతి గదిలోకి నస్రీన్‌ మొబైల్‌ను తీసుకొని వచ్చింది. ఈ విషయాన్ని చూసిన మిగతా విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్‌ నస్రీన్‌ తల్లిని పిలిచి జరిగిన సంగతిని చెప్పారు. నస్రీన్‌ను మందలించి వదిలేశారు. అయినా నస్రీన్‌ పద్ధతి మారలేదు. తప్పని పరిస్థితుల్లో నస్రీన్‌కు టీసీ ఇచ్చి పాఠశాల నుంచి పంపించేశారు.
మళ్లీ ప్రవళిక, వెన్నెల వద్దకు వచ్చి, ”’సారీ వెన్నెల.. నేను నిన్ను వదిలి వెళ్లినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నాకు మళ్లీ పాఠాలు చెబుతున్నావు” అని అన్నది. వెన్నెల సంతోషించింది.

– గుంజ వెన్నెల, 7వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ,
6305393291.