యువత

youthవిజయం సాధించాలంటే ప్రతి రోజు ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి. అది మన మనసు నిండా ఉండాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అతి ఉత్సాహం ప్రమాదకరం. కానీ స్థిరమైన కృషి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒకేసారి ఎన్నో పనులు ప్రారంభించడం కంటే ఒక్క దానిపై కేంద్రీకరించి పనిచేయడం ఉత్తమం. అలాగే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజంపట్ల కూడా బాధ్యతగా వుండాలి.
ఉరకలెత్తే ఉత్సాహం యువత సొంతం. ఉల్లాసం యువతకు పర్యాయపదం. ఏ దేశానికైనా యువత గొప్ప ఆస్తి అనే విషయం అందరికీ తెలిసిందే. దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎంతో కీలకమైనది. ఇంకా చెప్పాలంటే యువత తెలివితేటలు, పనితనం దేశాన్ని విజయపథంలోకి తీసుకెళతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశాన్ని నిర్మించే శక్తి యువతకు ఉంది. అటువంటి యువతను మంచి నాయకులుగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతగా ఉండాలి. కాబట్టి వారికి అవకాశాలు కల్పించాలి.
దేశ పునాదులను మార్చగల శక్తి యువత సొంతం. వారి ఉత్సాహం అలల కంటే ఎత్తు. ప్రతిభ సముద్ర గర్భమంత. కార్యదీక్ష కలిగితే ఏదైనా సాధ్యమే. శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది. ఇది ప్రతి యువకుడు తన జీవితంలో ఆచరించాల్సిన నిజం. అలుపెరుగని శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించగల సామర్థ్యం ప్రతి యువతకూ ఉంది. అయితే అది ఆచరణలో పెట్టడమే ముఖ్యం.
చరిత్ర పుటల్లో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్న యువత సైతం ఎందరో ఉన్నారు. భగత్‌సింగ్‌ 23 ఏండ్ల వయసులో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యను ముద్దాడాడు. కనుకే ఆయన ఓ స్ఫూర్తిప్రధాతగా యువత గుండెల్లో నిలిచిపోయాడు. ఓపిక, సమయం, నైపుణ్యం, సత్తువ వంటి వనరులు యువత చేతిలో ఉన్నాయి. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన మహానుభావులంతా యవ్వనంలో శ్రమించిన వారే. ఈ వయసులో కాలం వృథా చేస్తే, తర్వాతి దశలో ఏమీ సాధించలేం. అందుకే శ్రీశ్రీ ‘ఎముకలు కుళ్లిన, వయసు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే యువకుల్లారా రారండీ’ అంటూ యువతకు పిలుపునిచ్చారు. కనుక యువతలో ఉన్న సమర్థతను చక్కగా ఉపయోగించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
ప్రతి విజయం వెనుక కష్టాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంలోనే యువత సత్తా దాగి ఉంటుంది. సవాళ్లకు ఎదురెళ్లి, అవసరమైతే మార్గం మార్చుకోవాలి కానీ పోరాడటం ఆపకూడదు. విజయం పొందాలంటే నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలి. కానీ నేటి యువత తమ లక్ష్యం చేరేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ. ఆధునికత పెరిగే కొద్ది యువతలో సవాళ్లు పెరిగిపోతున్నాయి. చాలా మంది సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దేశ భవితలో భాగం పంచుకోవల్సిన వారు మత్తులో మునిగిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదం. దీని నుండి బయటపడేందుకు యువతకు చేయూతనివ్వాలి.
విజయం సాధించాలంటే ప్రతి రోజు ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి. అది మన మనసు నిండా ఉండాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అతి ఉత్సాహం ప్రమాదకరం. కానీ స్థిరమైన కృషి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒకేసారి ఎన్నో పనులు ప్రారంభించడం కంటే ఒక్క దానిపై కేంద్రీకరించి పనిచేయడం ఉత్తమం. అలాగే వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజంపట్ల కూడా బాధ్యతగా వుండాలి. శ్రీశ్రీ పిలుపును అందుకొని మరోప్రపంచం కోసం కృషి చేయాలి. ఇందులో యువతే కీలకపాత్ర పోషించాలి.