ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ ఎత్తిన సుశీ ”ఎవరు?” అంది.
”నేనండి చందు, చంద్రశేఖర్. ఇందాక పార్టీలో కలిశాను కదా. మీరు ఉద్యోగంలో కొత్తగా చేరారని తెలిసింది. స్పీచ్‌లో చాలా చక్కగా మాట్లాడారు. మీలా యాక్టివ్‌గా ఉండేవాళ్లు మంచి వృద్ధిలోకి వస్తారు. పనిచేసే కంపెనీని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. మీకు ఏ సలహా సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి”
”థాంక్యూ సర్”
”ఓకే బాయ్”
”బారు సర్”
ఫోన్ కట్ చేసిన సుశీ ఆశ్చర్యపోయింది. మీటింగ్‌లో మాట్లాడే అవకాశం ఇస్తే హుషారుగా మాట్లాడింది. అందరూ చప్పట్లు కొట్టారు. హెడ్ ఆఫీస్ హెచ్‌ఆర్ టీం హెడ్ చంద్రశేఖర్. స్పీచ్ అవ్వగానే దగ్గరకు వచ్చి స్వయంగా అభినందించటమే కాకుండా, ఇప్పుడు ఫోన్ కూడా చేయటం, పైగా ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమనటం, అంతా కలలా అనిపించింది. ఏనుగు ఎక్కినంత సంతోషం అనిపించింది. డాన్స్ చేయాలనిపించింది.
ఇంటికొచ్చి చంద్రశేఖర్ ఫోన్ చేసిన విషయం, మిగిలిన ఉద్యోగస్తులు తనని మెచ్చుకోవటం, తల్లికి వర్ణించి వర్ణించి చెప్పింది. తల్లి కూడా సంతోషించింది.
సుశీకి కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగం వచ్చింది. చేరి రెండు నెలలే అయినా తన చురుకుతనంతో ఆఫీసులో అందర్నీ స్నేహితులుగా చేసుకుంది.
మర్నాడు ఉదయమే చందు నుంచి వచ్చిన గుడ్ మార్నింగ్ మెసేజ్ చూసి, సంతోషంతో రిప్లై ఇచ్చింది. ఆ రోజు మొదలైన మెసేజ్‌లు నెమ్మదిగా కాల్స్‌గా మారి, ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగింది. సుశీ కూడా ఇదివరకటి కన్నా హుషారుగా తయారైంది.
ఇదంతా గమనిస్తున్న తల్లి పార్వతి ఓ రోజు భర్తతో ”ఏవండీ సుశీ గురించి నాకు చాలా భయంగా ఉంది. ఎవరో చందు, వీళ్ళ హెడ్ ఆఫీస్‌లో హెచ్‌ఆర్ టీం హెడ్ ట, అతనితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతోంది. నేను ఒకటి రెండు సార్లు అడిగితే ”ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను” అని సమాధానం చెప్పింది. మూడు నెలల వరకు ముహూర్తాలు లేవన్నారు నాకెందుకో చాలా భయంగా ఉంది. హరి తనకు నచ్చాడు అన్నాకే కదా సంబంధం ఖాయం చేసాం. ఎంగేజ్మెంట్ కూడా చేసాం. ఈమధ్య హరితో మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు.
ఎప్పుడు అది ‘అమ్మా!’ అని పిలిచినా ఏం చెబుతుందో అని భయం వేస్తోంది. ఎక్కడ ‘నాకు హరి వద్దు.. సంబంధం క్యాన్సిల్ చేయండి నేను చందునే పెండ్లి చేసుకుంటా’ అని అంటుందోనని గుండె దడదడ లాడుతోంది.
మన అమ్మాయి, అందరు పిల్లల్లా ప్రేమ గీమా అనకుండా మనం చూసిన సంబంధమే చేసుకుంటోందని, ఎంతో సంబర పడ్డాం. ఇప్పుడు అది పెండ్లి వద్దు అంటే ఏం చేయాలి? వియ్యాలవారికి ఎలా చెప్పాలి? అసలు నలుగురిలో ఎలా తలెత్తుకోవాలి? ఈ ఆలోచనలతో నా తల పగిలిపోతుంది” అంది.
ఆ మాటలు విని శంకర్ తల పట్టుకు కూర్చున్నాడు ”ఇదేంటి పార్వతి. సుశీ ఇలా ఎందుకు చేస్తోంది. అసలు అదిలా చేస్తుందని ఊహించను కూడా ఊహించలేదు. నువ్వు చెబుతుంటే నాకు కంగారు వస్తోంది. స్నేహితులు, బంధువుల ముందు తల ఎలా ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. ఈ కాలం పిల్లలంతా ఇలానే ఉన్నారు. వాళ్లకు తెలియదు. మనం చెబితే వినరు. పోనీ గట్టిగా మందలించి చెప్పటానికి కూడా లేదు. ఆత్మహత్యలని ఇంట్లోంచి వెళ్ళిపోవటాలని రకరకాలుగా వింటున్నాం. అవన్నీ తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. ఆదివారం ఒకసారి సుశీను కూర్చోబెట్టి మాట్లాడదాం. నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేద్దాం. మన మాట వింటే అదృష్టవంతులం. లేకపోతే ఆ చందు ఎవరో కనుక్కొని, అతడి పెద్దలతో మాట్లాడి, ఆ చందుతోనే పెండ్లి జరిపిద్దాం. ఇంకేం చేస్తాం. బయటి వాళ్ల గురించి ఆలోచించి, ఒక్కగానొక్క పిల్లను వదులుకోలేము కదా” అన్నాడు
ఇద్దరు ఆ నిశ్చయానికే వచ్చి, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడ సాగారు.
ఆదివారం వచ్చింది.
ఉదయం టిఫిన్లు అయ్యాక, పార్వతి ”సుశీ నాన్న పిలుస్తున్నారమ్మ” అని పిలిచింది.
”వస్తున్నా అమ్మ”
హాల్లోకి వచ్చిన సుశీని పక్కన కూర్చోబెట్టుకుని శంకర్ ”సుశీ హరి ఎలా ఉన్నారమ్మ? ఆఫీస్‌కి వెళ్తున్నారా? నెమ్మదిగా పెండ్లి బట్టలు షాపింగ్ మొదలు పెడితే బాగుంటుందేమో? అందరం కలిసి షాపింగ్‌కు వెళ్దాం. నేను, అమ్మా మీ అత్తగారు మామగారుతో మాట్లాడతాం. నువ్వు అల్లుడుగారు సెలవు చూసుకోండి.” అని కూతురు ముఖంలోకి చూసాడు.
పార్వతి కూడా కూతురు ముఖంలోకి ఆత్రంగా చూడసాగింది.
సుశీ ”హరి బాగున్నారు నాన్న. ఆఫీస్‌కు వెళ్తున్నారు. పెండ్లికి సెలవులు కావాలని ఇప్పుడు మానకుండ ఆఫీస్‌కు వెళ్ళి పోతున్నారు. హరితో నేను చెప్తాను. మేము అదే అనుకున్నాము. నేను హరి మ్యాచింగ్ డ్రెస్సులు తీసుకుందామని అనుకుంటున్నాం. ఇద్దరికీ సెలవు ఎప్పుడు వీలవుతుందో చూసి మీకు చెప్తాను నాన్న” అంది సంతోషంగా.
కూతురు మాటలు విన్న పార్వతీశంకర్లు ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమీ అర్థం కాక.
పార్వతి ”మరి చందుతో ఎక్కువగా మాట్లాడుతున్నావ్? హరితో అస్సలు మాట్లాడుతున్నట్టు కనపడటం లేదు” అని అడిగింది అయోమయంగా.
సుశీ నవ్వుతూ ”అయ్యో పిచ్చి అమ్మ! హరితో మాట్లాడనిదే నా రోజు మొదలవదు. నా రోజు పూర్తవ్వదు. ప్రతీ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక చందు అంటావా? నాకు మంచి ఫ్రెండ్. ఈ కాలంలో కూడా ఫ్రెండ్‌షిప్‌కి ఆడ మగ ఏంటమ్మా? మేము ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు, స్నేహాలు చేస్తున్నా, మా లిమిట్స్ మాకు తెలుసమ్మ. కుటుంబ విలువలు తెలుసు. మీరు అనవసరంగా కంగారు పడకండి” అని చెప్పింది.
ఊపిరి పీల్చుకున్న భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ముఖముఖాలు చూసుకున్నారు.
ఓ సెలవు రోజు చూసి చందుని ఇంటికి పిలిచి తల్లిదండ్రులకి కూడా పరిచయం చేసింది సుశీ. చందుతో మాట్లాడాక, అతడిని చూశాక, పార్వతీశంకర్లకు ”చందు మంచి పిల్లాడే, అనవసరంగా ఏదేదో ఊహించుకుని మనం కంగారు పడ్డాం” అనిపించింది.
అప్పుడే సుశీకి హరి ఫోన్ చేయటంతో, సుశీ హరితో మాట్లాడి, చందుకిచ్చింది.
చందు కూడా హరితో క్లోజ్‌గా మాట్లాడటం చూసి, ఏమూలో కొద్దో గొప్పో ఉన్న బెంగ కూడా తీరిపోయి, సంతోషంగా పిల్లల వంక చూశారు పార్వతి శంకర్.
చందూని పంపిరావటానికి, సుశీల బయటకు వెళ్ళటంతో,
శంకర్ ”పార్వతీ! ఆధునికత పెరిగి, ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ రావటంతో, పిల్లలు మరీ పాడవుతున్నారు. చెడు మార్గాల వైపు, మళ్లుతున్నారు. తల్లితండ్రులు కూడా ఎవరిగోల వాళ్ళది అన్నట్టు వుండటంతో, పిల్లలు మరీ విచ్చలవిడిగా తయారవుతున్నారు. పిల్లలు విలువలతో పెరగాలంటే, తల్లిదండ్రులు పిల్లలకి, ప్రేమాభిమానాలు పంచాలి. వారి కోసం సమయం కేటాయించాలి. పిల్లకి సమయం కేటాయించకుండా, పిల్లలు తప్పుడు దారిలో నడుస్తున్నారని అనటం హాస్యాస్పదం అవుతుంది. పార్వతీ! నువ్వు మన అమ్మాయి విషయంలో శ్రద్ధతో ఉన్నావు. నేను పని హడావిడిలో ఉన్నా, నువ్వే ఇంటిని, సుశీ నీ ప్రేమగా చూసుకున్నావు. కాబట్టే మనం ఈ రోజు గౌరవంగా తల ఎత్తుకోగలుగుతున్నాం” అంటూ పార్వతి చెయ్యి పట్టుకున్నాడు.
శశి
9553809850