నేటి రాజకీయాలు, అది కేంద్రమైనా ఏ రాష్ట్రమైనా సరే కారు రేసులా స్పీడుగా ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గరినుండి నిద్రపట్టినా పట్టకున్నా రాత్రి పడుకునేవరకు మొత్తం రాజకీయమే. భారతంలో ధృతరాష్ట్రులవారి వందమంది కొడుకులను, వారు చేస్తున్న పనులను చూసిన వ్యాసులవారు ”గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్” అన్నారట. నేనేమీ సినిమాలకు పాటలు రాయను కాబట్టి పాండవులు మంచోళ్లా, కౌరవులు మంచోళ్లా అన్న విషయానికి పోయి ఒకరి ప్రాపకం కోసం పాకులాడే ఉద్దేశ్యం లేనేలేదు. అప్పటి రాజకీయాలను మాత్రమే తీసుకొని అప్పటి రాజులు కూడా ప్రతిపక్ష నాయకులను ఎలా వేధించారు అన్న విషయం కొద్దిగా చూడ మని చెబుతున్నానంతే. గతం గతహ్ణ అని వదిలేయమన్నారు పెద్దలు అని పెద్దలు చెప్పగా విన్నాము. గతాన్ని వదిలేస్తే ఎలా, రోజూ దాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుతానికి అన్వయిం చకపోతే ఇంకేమైనా ఉందా, ప్రాణా లు అంటే రాజకీయ ప్రాణాలు పోవూ? పోతాయి తప్పక పోతాయి ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్లు, అధికారంలోకి రావాలనుకునేవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు, కనీసం వచ్చేసారన్నా ప్రతిపక్షంలోకి రావాలనుకునేవాళ్లు ఇలా ఎవరైనా సరే రాజకీయ ప్రాణులైతే చాలు వాళ్లకు గతమే కావాలి. గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదు అని దేవదాసులా నిర్వీర్యమైపోయేవాళ్లు కాదు వీళ్లు. గతాన్ని పట్టుకొని ముందుకుపోయే వీరులు వీళ్లు.
పుచ్చలపల్లి సుందరయ్యగారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పార్లమెంటుకు వచ్చే ప్రధాని నెహ్రూతో పాటు మంత్రులు కూడా సుందరయ్యగారు వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం బాగా తయారై వచ్చేవారని విన్నాము. సుందరయ్యగారిని అంత గౌరవం గానూ చూసుకునేవారు. ఐక్యరాజ్య సమితికి విదేశీ వ్యవహారాలకోసం పంపే కమిటీకి ప్రతిపక్ష నాయకుడు వాజిపేయి గారిని నాయకుడిగా వేసి పంపారు అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీó. పనిలో పనిగా వాజిపేయిగారికున్న అనారోగ్యం దృష్ట్యా అక్కడ చికిత్స కూడా చేయించారు ప్రధాని రాజీవ్. ఇప్పుడు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇండియాకు భారత్‌కు తేడా. దేశభక్తి జపం చేసినా, మన సనాతన ధర్మాల గురించి మాట్లాడినా మంచిదే కాని రాజకీయాల్లో ఎప్పుడూ రేసులో పోతున్న కారులాగా ఇతర కార్లని దాటడం కాదు కొన్ని విలువల్ని, ప్రజాస్వామ్యంలో పాటించే పాత సాంప్రదాయాల్ని కూడా గౌరవించాలి. మూడూ పాయింట్ సున్నా అనగానే ఎన్నో మంచిపనులు గుర్తుకు రావాలి అంతే తప్ప ఒక్కసున్నా మాత్రమే గుర్తొస్తే ఏమిటి ప్రయోజనం చెప్పండి. ఆ లెక్కన జ్యోతిబసు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా చేసి చూపించారు. ప్రధానిగా ఛాన్సు వచ్చినా వద్దన్నారు అంతే కాని ఒకటి పాయింట్ సున్నాతో మొదలు పెట్టి రేసులాగా చేయలేదు.
రేసులో పాల్గొనే కార్ల చోదకులకు వాహనాన్ని తోలడం బాగా వచ్చి ఉండాలి. అలాగే ప్రమాదాలు ఎదురైనా తప్పించుకోగల నేర్పు ఉండాలి. కార్లు తమని దాటిపోతున్నా తట్టుకోగల ఓర్పు మళ్లీ దాన్ని దాటడానికి సహనం ఉండాలి. క్రికెట్ మ్యాచుల్లా కార్ల రేసుల నిర్వాహకులతో సంబంధాలూ ఉండాలి. రేసు అయిపోయింది కప్పు వచ్చేసింది అని ఊపిరి పీల్చుకునే వీలుండదు. తరువాత దాని పర్యవసానాలను ఎదుర్కునే శక్తీ ఉండాలి. అప్పుడే రేసుల్లోకి దిగాలి.
వేగానికి, వైరాగ్యానికి ఎప్పుడూ పడదు. గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదని దేవదాసు పాడతాడు సినిమాలో. వైరాగ్యంలో ఉన్న ఆ నాయకుడు అందరాని పొందుకన్నా అందమే లేదు ఆనందమే లేదు అనీ పాడతాడు. తిరిగి దాన్ని రాజకీయాలకు అన్వయిస్తే వైరాగ్యంలో ఉన్న ఆ నాయకుడు తిరిగి దాన్ని రాజకీయాలకు అన్వయిస్తే అధికారంలో ఉన్నవాళ్లు, అధికారం కోల్పోయినవాళ్లు, అది కావాలని ఆరాటపడేవాళ్లు అందరూ కారు రేసులో లాగా రోజూ ఉరుకులూ పరుగులే. అందనిదాన్ని, అందరానిదాన్ని వదులుకునే సమస్యే లేదు. అసలు రాజకీయాలే కాదండి సినిమాలు, సినిమా హీరోలు కూడా బాగా మారిపోయారు అని తెలుపు నలుపు, మూకీ సినిమాల కాలం నుండి పోలికలు ఇవ్వబోతారు కొందరు. వాటిలో నిజం లేకపోలేదు కాని పాతదాన్ని పాతగాను, కొత్తదాన్ని కొత్తగానూ చూడాలి. విలువలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఉండాలి. అప్పుడే నిజంగా ప్రజలకు మేలు జరిగేది. గాంధీగారొస్తుంటే డబ్బులు, ఒంటిపైనున్న నగలు బంగారువైనా ఎలా ఇచ్చేశారో చెప్పి అప్పటి ప్రజలకీ ఇప్పటి ప్రజలకీ పోలికలు చేప్పేవాళ్లు, ఇప్పటి ప్రజలు కూడా రాజకీయ నాయకుల్లా మారారండీ ఎవరి సౌఖ్యం వారే చూసుకుంటున్నారు అనేవాళ్లూ ఉన్నారు.
కార్లలో, నాయకుల్లో ఎలా రకరకాలు ఉన్నాయో ప్రజల్లో కూడా అలాగే ఉంటారు కాని అందరు ప్రజలూ అలా ఉండరు. ఇప్పుడొస్తున్న సినిమాలను తీసుకున్నా అవి రేసు గుర్రాల్లా, రేసు కార్లలా తయారైనాయి. సినిమాలు వసూలు చేస్తున్న డబ్బుపైనే ధ్యాస. అందుకు ప్రభుత్వాలు కూడా సహకరించి టికెట్ల ఖరీదును మీకిష్టమొచ్చినట్టు పెట్టుకోండని చెప్పడం చూస్తే ప్రభుత్వాల్ని నడిపే ఇంధనమేదో, అధికారంలోకి రావడానికని ఎన్నికల్లో పెట్టే ఖర్చుకీ లెక్కలు రెక్కలు కట్టుకొని ఎలా వస్తున్నాయో తెలిసిపోతుంది. అక్కడక్కడా, అప్పుడప్పుడూ జరిగే కారురేసుల్ని ఒకేసారి జమిలిగా పెద్ద రేసు పెడితే ఏ కారు ముందుకు దూసుకుపోతుందో మరి!!
ఇప్పుడు రాజకీయ జనాలకు కావలసింది గేం ఛేంజర్ రాజకీయాలే.ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేవి కాదు.
జంధ్యాల రఘుబాబు
9849753298