స్వర్ణానిది ధగధగ వర్ణం. ఈ కథలు మాత్రం నల్లబంగారం. నలుపు నిరసనో, విషాదమో కాదు చిక్కదనపు నాణ్యతా దర్పణం. పదమూడు కథల గుచ్చం నల్ల బంగారం కథలు. గతన్ని పాదముద్రగా బహుకరించే నల్లనేల యాదులివి, గుండె తెల్ల కాయితమ్మీద యాదుల్ని అచ్చొత్తే కాలరీ కార్బన్ ఇది. బజిలీ కూతల సింగరేణి కోయిలలు కదా ఈకథలు..
బొగ్గు గనులు, తదితర సింగరేణి కి సంబందించి తవ్వి తీసిన బొగ్గు రాశులంతటి సాహిత్యాన్ని గతంలో మనం అనేకం చదువుకున్నాం, సింగరేణి నేపథ్యంగా ఎర్రజెండాల ఉద్యమాలు చీకటి సూర్యుల పోరాటాలు, నినాదాలు, బృందగానాలు చూశాం. కానీ ఈ కథలు అందుకు భిన్నమైనవి. ‘నా బాల్యం నా తియ్యని మిఠాయి పొట్లం’ అనే రచయిత్రి స్మతుల కోణంలోనివి ఈ రాతలు. సింగరేణికి చెందినవే అయినప్పటికీ.. మానవ సంబంధాలు పెనవేసిన ఈ కథలు కాలరీస్‌కు ఆత్మీయ హారాలు.
కమ్మనైన అనుబంధాలు, పూ లతల్లా అల్లుకున్న ఆప్యాయతలు, కోపాలు, అలకలు, బుజ్జగింపులు.. స్నేహాలు.. ఈ కథలు.. సైకిల్ ఎక్కి వచ్చే నాన్న కోసం గుండె కిటికీ నుంచి ఎదురుచూసే కూతుర్లు.. ఆడపిల్లల్ని మనసు గూటిలో పొదుముకునే మమకారపు తండ్రి. ప్రేమను పంచుతూనే క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చే తల్లి.. యంత్ర భూతాల కోరలు తోమే కార్మికులు, దినదిన గండం లాంటి బొగ్గుబాయి బతుకులు.. ఇళ్ళముందు అగ్గి బకెట్లు.. గాలికీ గని వాసన.. బట్వాడాలనాడు, బత్యాల నాడు బోనస్‌ల నాడు ఉర్రూతలూగే ఊరు.. సమస్థ వ్యాపారాలనూ బతికించే శ్రామిక త్యాగాలు.. ఉత్సవాలు.. పండుగలు, పబ్బాలు.. మొక్కులు.. కొత్తగూడెం కథ కొత్తదేం కాదు.. పక్కా తెలంగాణ పద మాధుర్యం.. బతుకమ్మ, బోనాల సంస్కతి సౌందర్యం.. పాత కొత్తగూడెం ఓ విరోధ బాస..
గతం ఎన్నటికీ చావదు.. కానీ గతం చంపేసిన అవ్వాటి మాటేమిటి.. చావు కాలానికీ రావొచ్చు. చంపబడటం ప్రాంతానికీ కావొచ్చు. ఇది అబివద్ధి చంపేసిన ఊరి యాదుల పరితాపాం. కాలం మింగేసిన బాల్యాన్ని తలచుకొనే మనాదుల విలాపం. చచ్చాక సమాధి చేస్తారు కానీ ఇక్కడ సమాధి తీసి చంపేశారు. సమాధులను వెలికి తీస్తే అస్తిపంజరాలు బయల్పడతాయి. ఇక్కడ మట్టిగుట్టల అడుగుల్లో కాలం కంకాలాలు. గతం అస్థి పంజరాలు. ప్రత్యేక చరిత్ర సంస్కతి, రంగు, రూపు, యాసల అవశేషాలు.
బొందలో పూడ్చితే సమాధి చేసినట్టు కానీ ఇక్కడ బొందతోడితే సమాధి అయ్యింది. ఊరికి ఊరంత సమాధి. నల్లమట్టి మీద అడుగు.. నేల నెమలిపించమై వెలుగు..
సింగరేణి పుట్టిల్లు ఇల్లెందు నల్ల మట్టిమీద నడిచిన లేత పాదం నాది.. బొగ్గు బావి జీతాలు, జీవితాలు. నాకు తెలుసు.. మరో వంక కథా ప్రాంతాలు పాత కొత్తగూడెం, పెనగడప, రామవరం, నైన్ ఇంక్లైన ప్రాంతాల్లో బంధుత్వాల వల్ల స్థానిక జీవనంతో పరిచయాలున్నాయి.
ద పాస్ట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. నాట్ ఎ ప్లేస్ ఆఫ్ లివింగ్… గతం నుంచి నేర్చుకోవాలి, గతంలోనే జీవించొద్దు అని ఈ కొటేషన్ హితోక్తి. గతంలో నివసించటం కాదు కానీ గతంలో నివసించిన నేల వియోగ పరితాపం ఈ కథలు. గతం మింగేసిన బంగారు బాల్యపు నోస్టాల్జియా. జీవగర్రకై వెదకులాట.
ఈకథలు వేటికవే అయినా వీటిలోని ఆత్మకథనాత్మకథ దష్ట్యా, చాలా కథల్లో పాత్రలు పునరావతం అయ్యాయి. కొన్ని కథల్లో మాత్రం పాత్రలు కొత్తపేర్లు తొడుక్కోవటం.. ఎత్తుగడో, లేక ఇతరుల కథలనో..
జరిగిపోయిన సందర్భాలను కథ కట్టి తన పని పూర్తయ్యిందనిపించటం కాక కొన్ని కథల ద్వారా సమస్యలపై చర్చపెట్టటం ఫలితాలు సాధించటం ఈ కథల ప్రయోజనం.
ముగ్గురు ఆడపిల్లలు గల మధ్యతరగతి కార్మికుడైన తండ్రి, ఆ కుటుంబంలో సంతోషాలు, సంతప్తులు, పండుగలు, ఆనందాలు.. ఇబ్బందులు, సమస్యలు, వాటిని అధిగమించడాలు.
‘జీవగర్ర పుల్ల’ కథ రచయిత్రి గుండె గాయానికి సంకేతం.. కులం మతం దేవుడు ఏదీ నిజం కాదు చావొక్కటే సత్యం అన్న ఫిలాసఫీ.. కని పెంచి పెద్ద చేసిన అమ్మను దక్కించుకోవాలనుకునే ఆరాటం. ఆ కన్నీళ్ళకు కారణం ఏమిటో కథ చదివితే తెలుస్తుంది.
‘ఓపెన్ కాస్ట్ సర్జరీ’లో ఊరు మాయమైన ఉమ్మడి దుఖం. ఆనవాళ్లు దక్కని అపురూప జ్ఞాపకాలకై వెదకులాట. ఓపెన్ కాస్టు కోసం ఊరిని కబళించిన కష్టానికి కన్నీళ్ళు కార్చటం.
‘మాఫ్ కరో దోస్త్’ కథలో స్నేహితురాలి ఆతిథ్యాన్ని ఆస్వాదించలేని తనం.. పేద స్థితిని ఇంటి పరిసరాలతో పోలిక పెట్టి పశ్చాత్తాప ప్రకటన.. నిజాయితీ ఒప్పుకోలు..
‘నల్ల బంగారం’ టైటిల్ కథలో తండ్రీ కూతుర్ల అనురాగం ఆప్యాయత.. ఆడపిల్ల పట్ల తల్లి బాధ్యత.. కనిపిస్తుంది.. బొగ్గు బావుల్లో జరిగే ప్రమాదాలు కుటుంబాలు తల్లడిల్లి పోవటం… కనిపిస్తుంది.. మొత్తంగా సింగరేణి బతుకును కళ్ళకు కట్టే కథ ఇది..
‘దో పెV్‌ా లే ప్రేం పత్ర్’ కథలో స్కూల్ రోజుల్లో తెలిసీ తెలియని విరిసీ విరియని కాలం నాటి ప్రేమ భావనలు.. వాటి తాలూకు భయాలు, అనుభవాలు అలుముకున్నాయి..
కథల నిండా రాపిడి భావాల సంఘర్షణ.. అంతర్మథనం.. తండ్రికి ప్రమాదం జరగకుండా ఉంటే బాగుండు అని, తల్లిని కాపాడుకిఉంటే బావుండు అని.. పొరుగింటి కబంధ హస్తాలకు చిక్కకుండా ఉండాలని, స్నేహితురాలి మనసు నొప్పించకుండా ఉండాల్సిందని. జరిగిన సంఘటనలకు సందర్భాలకు అందంగా వాక్యాలు కట్టటమే.. ఫిక్షన్ జోడిస్తే నిజాయితీ ఉండదు.. కనుక శిల్ప పరిధిని దాటి అందమైన కథలివి. కథలకు వాడిన తెలంగాణ మాండలిక జీవభాష ప్రధాన ఆయువు పట్టు..
కంచర్ల శ్రీనివాస్
9640311380
గుండెగనిలో బొగ్గుపెళ్లల రాపిడి.. నల్లబంగారం కథలు
9:47 pm