సంక్రాంతి అచ్చిందంటే సాలు మా ఊరంత గిర్ని కాడనే ఉండేది…
ఏ వాడకు వోయిన సకినాల వాసనే అచ్చేది…
కట్టెల పొయ్యే బోగి మంటలేశినట్లుంటది…
సలిల లేశి అనుక్కుంట
చీపిరందుకొని ఆకిలూడుస్తాంటే…
పెద్ద తాత కొట్టంల పేడ తెచ్చి
గుంజ పొంటి పెట్టేది…
నానమ్మ కొంగు శెక్కి అల్కు సల్లుకచ్చి…
తెల్లటి బియ్యప్ పిండితో
సందుపోకుండ ముగ్గులేత్తంటే…
నెత్తి మీదకి సూరీడు రానే అచ్చే…
పొద్దంతా ఆకిట్లనే ఉంటవా ఏందని?
తాత మొత్తుకుంటే…
అప్పుడు నాన్నమ్మ నడుం లేపి
ముగ్గులని చూసి మురిసిపోతూ.. సంకురాత్రి లచ్చిమి
మా దర్వాజలనే ఉన్నదని సంబురపడేది…
పీటేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు
చేసి పసుపు కుంకుమ పుదిస్తే…
ఇంటెనుక బాయి పొంట పూసిన బంతిపూలు వంగి వంగి చూస్తుంటే…
గర్కపోసలు గర్వంగ లేచి నిలబడ్డవ్…
నవధాన్యాలు సోలలేసి ఎర్రటి రేగుపండ్లు పోస్కుంట
కడపలన్నిటి మీద గౌరమ్మలు పెట్టేది…
ఎంతటి పేదవాడికైనా పండగంటే
సేసిన కట్టాన్ని మర్షిపోయి ఆ పొద్దంత నవ్వుకునుడే…
తెల్లారితే తారీఖు మారుతుందేమో కానీ తలరాతలు చెరిగిపోవు… పండగ ఒక కనిపించని సుట్టం తీరు అచ్చిపోతది…
ఆ తరువాత రోజుల్ల కనిపించేది మాత్రం మన రెక్కల కట్టమే…
– తుమ్మల కల్పన రెడ్డి, 9640462142