అనుకున్నది జరగకపోయినా.. కోరుకుంది దక్కకపోయినా.. ఇలా కారణం ఏదైనా సరే.. ఎవరికైనా సరే.. వెంటనే మూడ్ మారిపోతుంది.. డల్‌గా మారిపోయి మనసు కుమిలిపోయేలా చేస్తుంది. అయితే ఇలాంటి స్థితిలో ఎక్కువ సేపు ఉండటం మానసికంగా అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అందుకే వెంటనే మన మానసిక స్థితి తిరిగి మామూలుగా మారేలా చేసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా అది చాలా సులభమంటున్నారు. ఇంతకీ మన మూడ్‌ని ప్రభావితం చేసే ఆ పనులేంటో మనమూ ఓసారి తెలుసుకుందాం…
సాధారణంగా మూడ్ మారాలంటే యోగా, కిక్‌బాక్సింగ్.. వంటి వ్యాయామాలు చేయడం, గార్డెనింగ్… మొదలైన వాటి ద్వారా మనసును సంతోషం వైపు మళ్లించవచ్చని చెబుతుంటారు. అయితే ఒక్కోసారి మన వద్ద అంత సమయం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మన శరీరంలో చిన్న చిన్న కదలికలు చేయడం ద్వారా మానసిక స్థితిని తిరిగి సంతోషంగా మారేలా చేయొచ్చంటున్నారు మానసిక నిపుణులు.
వండర్ ఉమన్‌లా…
వండర్ ఉమన్ సినిమా చూసే ఉంటారు కదా! నడుంకి కాస్త కింది భాగంలో రెండు చేతులు పెట్టి ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చెరగని చిరునవ్వు, బెదరని కంటి చూపుతో ఒక మహిళ కనిపిస్తుంది. అదే భంగిమలో మీరూ కాసేపు నిలబడి చూడండి.. ఇదేమిటీ అనుకుంటున్నారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మన మూడ్‌ని మార్చేందుకు బాగా సహకరిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి భంగిమలో రెండు నిమిషాల పాటు నిలబడడం వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులు 20శాతం పెరుగుతాయి. అలాగే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ స్థాయులు 25శాతం తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఆందోళన, బాధ.. వంటి భావాల నుంచి కాస్త బయటపడి సంతోషం వైపు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరిగిన భావన మనలో కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి సందర్భంలోనైనా మన మూడ్ ఇట్టే మారిపోతుందట.
నచ్చినట్లు డ్యాన్స్ చేయండి..
మానసిక స్థితి కాస్త మెరుగుపరుచుకునేందుకు సాధారణంగా సూచించే మార్గాల్లో డ్యాన్స్ చేయడం కూడా ఒకటి. అయితే ఇదేదో క్రమపద్ధతిలోనే చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే నచ్చిన పాటకి మనకొచ్చినట్లు డ్యాన్స్ చేసినా అది మూడ్‌పై ప్రభావం చూపి తిరిగి మనం సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఇది కూడా అధ్యయనంలో నిరూపితమైందే.. అందుకే ఈసారి కాస్త డల్‌గా ఉన్నట్లనిపిస్తే వెంటనే హుషారైన పాటకి నచ్చినట్లుగా చిందులు వేయండి. మనసు తిరిగి సంతోషంతో నిండిపోతుంది.
సరదాగా షాపింగ్ చేయండి
షాపింగ్ చేయడానికి, మూడ్ మారడానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉంది.. కానీ ఇక్కడ షాపింగ్ చేయమన్నాం కదా అని వందలు, వేలు ఖర్చుపెట్టి ఖరీదైన వస్తువులు కొనేయాల్సిన అవసరం లేదు. మూడ్ బాలేదనిపించినప్పుడు నచ్చిన దుస్తులు, యాక్సెసరీలు కొనడం, నచ్చిన ఆహారం తీసుకోవడం… వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కూడా మూడ్‌ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అయితే ఇలా షాపింగ్ చేసి మనం కొనే వస్తువు తప్పకుండా మన సంతోషాన్ని పెంచేదై ఉండాలి. అప్పుడే అది మన మానసిక పరిస్థితిపై ప్రభావం చూపి తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేసే వీలు ఉంటుందని గుర్తుంచుకోవాలి.
సంతోషాన్ని ఇచ్చే ఫొటోలు
ఫొటోలు.. అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది.. ఒకప్పుడైతే ఆల్బమ్.. ఇప్పుడు మాత్రం స్మార్ట్‌ఫోన్‌లోని గ్యాలరీ. అయితే అప్పటికప్పుడు మన మూడ్ మారేందుకు అది ఎలా ఉపయోగపడుతుందబ్బా అనుకుంటున్నారా? మన ఫోన్లో ఇప్పటికే మన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన క్షణాలు, స్నేహితులతో టూర్‌కి వెళ్లిన మధుర జ్ఞాపకాలు.. ఇలా చాలా ఉండి ఉంటాయి. మనం చేయాల్సిందల్లా మూడ్ బాలేదనిపించినప్పుడు ఏకాంతంగా ఉండే ప్రదేశానికి వెళ్లి రెండు నిమిషాలు శ్వాస మీద ధ్యాస కేంద్రీకరించాలి. ఆ తర్వాత ప్రశాంతమైన మనసుతో మధురమైన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొంటూ ఫోన్లో ఉన్న ఫొటోలు చూడండి.. తప్పకుండా మానసిక స్థితి మారుతుంది.
మరెన్నో మార్గాలు
– మూడ్‌ని ప్రభావితం చేసే అంశాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరు పసిపిల్లలతో గడుపుతూ ప్రశాంతత పొందితే, ఇంకొందరు సంగీతం వినడం ద్వారా శాంతిస్తారు. మరికొందరు పాటలు పాడడం ద్వారా ఒత్తిడికి స్వస్తి పలుకుతారు. మరి మీ మూడ్ మారడానికి ఎలాంటి అంశం దోహదం చేస్తుందో ఒకసారి పరిశీలించుకోండి. తద్వారా క్షణాల్లో మీ మూడ్‌ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే వీలు ఉంటుంది.
– పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోవడం..
– మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వాకింగ్ స్త్టెల్ కాస్త మార్చి కొత్తగా నడిచేందుకు ప్రయత్నించడం..
– కుర్చీలో నిటారుగా కూర్చొని చేతులు మోకాళ్లపై ఉంచి, నాలుక బయటపెట్టి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ నోటి ద్వారా వదిలిపెట్టడం..
– తలని అటుఇటూ వూపడం..
– లాఫింగ్ థెరపీ.. బయటకు గట్టిగా నవ్వడం ద్వారా ఆక్సిజన్ అధిక మొత్తంలో శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలయ్యేలా చేసి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనం సంతోషంగా ఉండేలా చేస్తుంది.
ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా కూడా మన మూడ్‌ని వెంటనే మార్చుకునే వీలు ఉంటుంది. అయితే ఇందుకు ముందుగా మానసికంగా మనల్ని మనం సన్నద్ధం చేసుకున్నప్పుడే ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. మీరూ వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి.