– చాంపియన్స్ ట్రోఫీ జట్టుపై రాజీవ్ శుక్లా
ముంబయి : 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే భారత జట్టును ఈ నెల 19న ప్రకటించనున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఎనిమిది జట్లు జనవరి 12న ప్రాథమిక జట్ల జాబితాను సమర్పించాలి. భారత్ ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లటం, పలువురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై వైద్య నివేదికలు రావాల్సి ఉండటంతో జట్టు ఎంపిక ప్రక్రియను వాయిదా వేసినట్టు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ఆరంభం కానుండగా.. నెల రోజుల ముంగిట జనవరి 19న జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులో గాయపడిన జశ్‌ప్రీత్ బుమ్రా ప్రస్తుతం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. బుమ్రా గాయం తీవ్రత, ఫిట్‌నెస్‌పై స్పష్టత కోసమే జట్టు ఎంపికను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐసీసీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుందని తెలుస్తోంది. ఊహాగానాలు ఎలా ఉన్నా.. రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడుతుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ సైతం జట్టులో ఉంటారని, ఎటువంటి సందేహం అవసరం లేదని బోర్డులో ఓ అధికారి తెలిపారు.