– క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు
– క్షమాభిక్షపై భిన్నాభిప్రాయాలు
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. అప్పుడే ఇద్దరికీ కొన్ని అంశాల్లో స్వల్ప అభిప్రాయ భేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘క్యాపిటల్ హిల్’ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష అంశంపై వారు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే వారికి తన అధికారాలను ఉపయోగించి కేసుల నుంచి విముక్తి కల్పిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వాన్స్ మాత్రం సహజంగానే వారికి ఎటువంటి క్షమాభిక్ష ఇవ్వకూడదని చెబుతున్నారు.
తాజాగా ఫాక్స్ న్యూస్‌లో జరిగిన కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ ”ఇది చాలా సింపుల్. నాడు మీరు శాంతియుతంగా ఆందోళన చేసినట్లైతే.. మిమ్మల్ని జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఓ గ్యాంగ్ సభ్యుల్లా ట్రీట్ చేసేది. మీకు క్షమాభిక్ష కూడా లభించేది. కానీ, ఒకవేళ మీరు ఆ రోజు హింసకు పాల్పడితే.. మీకు క్షమాభిక్ష రాదు. దీనిపై కొంత అస్పష్టత ఉంది. జనవరి 6వ తేదీ నాటి అల్లర్లకు సంబంధించి చాలామంది అమాయకులు విచారణను ఎదుర్కోవడం సరికాదు. దానిని మనం సరిచేయాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై క్యాపిటల్ హిల్స్ ఘటనకు మద్దతు తెలిపేవారు వాన్స్‌ను తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. దీనికి మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన వివరణ పోస్టు చేశారు.
” మొదటగా నేను చెప్పేది ఏమిటంటే.. జే6 (జనవరి 6) ఖైదీల నిధికి నేను కూడా విరాళం ఇచ్చాను. నేను సెనెట్ బరిలో నిలిచిన వేళ ఈ విషయాన్ని చాలామంది విమర్శించారు. నేను చాలా ఏండ్లుగా వీరిని రక్షిస్తున్నాను. రెండోది.. నాడు జనసమూహంలో ఫెడరల్ ఇన్ఫార్మర్లు ఉన్నారు. వారికి క్షమాభిక్ష లభిస్తుందా..? అలాగని నేను అనుకోను. అధ్యక్షుడు ప్రతి కేసును తాను పరిశీలిస్తానని చెప్పారు. (నేను కూడా అదే చెబుతున్నాను) అలా అంటే కొంత వెనక్కి తగ్గినట్టు కాదు. అన్యాయంగా జైళ్లకు వెళ్లినవారిని రక్షిస్తాం. ఎవరి ప్రభావానికో లోనై రెచ్చిపోయిన వారు, చెత్త విచారణలు ఎదుర్కొంటున్నా వారు కూడా వీరిలో ఉన్నారు” అని రాసుకొచ్చారు.తాను అధికారం చేపట్టిన తొలిరోజే క్యాపిటల్ హిల్స్ ఘటనలో నిందితులకు క్షమాభిక్షను ప్రకటిస్తానని ట్రంప్ చెప్పారు. ఇటీవల ఎన్‌బీసీ మీట్‌ద ప్రెస్‌లో కూడా మాట్లాడుతూ వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేస్తానని పునరుద్ఘాటించారు.
అసలు ఏం జరిగింది..?
2020 జనవరి 6వ తేదీన జోబైడెన్ విజయం తర్వాత ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనం వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత వారు అడ్డంకులు తొలగించుకొని ఆ భవనంలోకి చొరబడి అరాచకం స ృష్టించారు. 100 మంది పోలీసులు గాయపడ్డారు. సుమారు 1,500 మందిపై దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు. నిందితులకు క్షమాభిక్ష పెడితే..చట్టాలకు విలువ ఉంటుందా..? ట్రంప్‌కు మద్దతిచ్చే అరాచకశక్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.