కేజ్రీవాల్‌కు ఇల్లు..కారు లేవట

– ఆప్‌ అధినేత ఆస్తుల విలువ రూ.1.73 కోట్లు
– అఫిడవిట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని తాజా అఫిడవిట్‌ ద్వారా వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పత్రాల ప్రకారం బ్యాంకులో ఆయనకు 2.96 లక్షల సేవింగ్స్‌, రూ.50వేల నగదు ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లుగా ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవనే విషయాన్ని నామినేషన్‌ పత్రాల్లో పొందుపరిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం 2023-2024లో ఆయనకు రూ.7.21 లక్షల ఆదాయం సమకూరింది. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.2.5 కోట్లు. అందులో రూ.కోటికి పైగా చరాస్తులు. వాటిలో రూ.25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారం, రూ.92వేల విలువైన కేజీ వెండి ఉన్నట్టు పేర్కొన్నారు. సునీతకు గురుగ్రామ్‌లో ఇల్లు, సొంతంగా కారు ఉన్నట్టు తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ.4.23 కోట్లుగా ప్రకటించారు.న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్‌ 2020లో తన ఆస్తుల విలువ రూ.3.4 కోట్లు అని ప్రకటించారు. 2015లో రూ.2.1 కోట్లు అని తెలిపారు. ఆప్‌ సీనియర్‌ నేత, మంత్రి సత్యేంద్ర జైన్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. షకూర్‌ బస్తీ నుంచి పోటీ చేస్తున్న ఆయన తన ఆస్తుల విలువ రూ.4.4 కోట్లు అని వెల్లడించారు.